– రెండు యావజ్జీవ శిక్షలు, మూడు జరిమానాలు : ఎస్పీ శరత్ చంద్రపవార్ వెల్లడి
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
హత్య కేసులో నిందితుడికి రెండు యావజ్జీవ శిక్షలు, మరో మూడేండ్ల కఠిన కారాగార శిక్ష, మూడు జరిమానాలు విధిస్తూ నల్లగొండ కోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు ఎస్పీ శరత్ చంద్రపవార్ వివరాలు వెల్లడించారు. నల్లగొండ పట్టణంలోని తులసీనగర్ ప్రాంతానికి చెందిన రమావత్ బాల(35) సోదరితో రామాపురం మల్లేశ్వర్‌రావుకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ విషయం తెలిసిన బాల తమకు అడ్డు వస్తున్నాడనుకుని అతన్ని హత్య చేసేందుకు మల్లేశ్వర్‌రావు పథకం పన్నాడు. 2018 డిసెంబర్ 12వ తేదీన నల్లగొండ రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో హత్య చేశాడు. ఈ ఘటనలో మృతుని సోదరి ఫిర్యాదు మేరకు మల్లేశ్వర్‌పై నల్లగొండ టూ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షించారు. మల్లేశ్వర్‌రావు హత్య చేసినట్టు నిర్ధారణ అయింది. అదేవిధంగా 164 సీఆర్‌పీసీ ప్రకారం కీలక సాక్షుల వాంగ్మూలాలు మేజిస్ట్రేట్ సమక్షంలో నమోదయ్యాయి. శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాలు, వాంగ్మూలాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం కోర్టు మంగళవారం నిందితునికి ఐపీసీ సెక్షన్ 302 కింద జీవిత ఖైదు, రూ.10,000 జరిమానా విధించింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ చట్టం సెక్షన్ 3(2)(ఙ) కింద మరో జీవిత ఖైదు, రూ.10,000 జరిమానా, ఐపీసీ సెక్షన్ 201 కింద మూడేండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.10,000 జరిమానా విధించింది. మొత్తం రూ.30,000 జరిమానా విధించగా, అన్ని శిక్షలూ సమాంతరంగా అమలులో ఉంటాయి. ఈ కేసును శాస్త్రీయంగా, సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేసిన అప్పటి దర్యాప్తు అధికారులు, డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి, సీఐ మహబూబ్‌భాషా, ఎస్‌ఐ నరసింహులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అఖిల, ప్రస్తుత డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ రాఘవరావు, ఎస్‌ఐ సైదులు, సీడీఓ సుమన్, కోర్ట్ లైసెనింగ్ ఆఫీసర్స్ నరేందర్ మల్లికార్జున్‌ను ఎస్పీ శరత్ చంద్రపవార్ అభినందించారు.
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



