Saturday, August 2, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిప్రజాసేవకే అంకితమైన అచ్యుతానందన్‌ జీవితం

ప్రజాసేవకే అంకితమైన అచ్యుతానందన్‌ జీవితం

- Advertisement -

జూలై 21, 2025న, 101 సంవత్సరాల వయసులో మరణించిన కామ్రేడ్‌ వీ.ఎస్‌.అచ్యుతానందన్‌ జీవితం, కేరళ చరిత్రలో ముఖ్యంగా రాష్ట్ర విప్లవోద్యమంలో ఒక చెప్పుకోదగిన అధ్యాయం.
కామ్రేడ్‌ వీ.ఎస్‌గా పిలువబడే ఆయన, ఒక శాశ్వతమైన పోరాట సాంప్రదాయానికి, అసాధారణ కుదురుబాటుకు, న్యాయం పట్ల గల అచంచల నిబద్ధతకు ఒక ప్రతీకగా నిలిచాడు. ప్రజల కోసం అవిశ్రాంతంగా పని చేయడం, వారి అవసర సమ యాల్లో స్థిరమైన మద్ధతుతో గుర్తించబడిన ఆయన శతాధిక జీవితం, ఆధునిక కేరళ చరిత్రతో అల్లుకుపోయింది. కేరళ ప్రభుత్వ, సీపీఐ(ఎం) పార్టీ, వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్డీఎఫ్‌) నాయకుడిగా, వివిధ సమయాల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేసిన సేవలు అసమానమైనవి. కేరళ ఘనమైన రాజకీయ వారసత్వంలో అంతర్భాగంగా చరిత్ర, ఈ సహాయసహకారాల్ని గుర్తుంచుకుంటుంది.

వీ.ఎస్‌ మరణం, ఒక శకానికి ముగింపు. విప్లవోద్యమానికి, పార్టీకి, విశాల ప్రజాతంత్ర ప్రగతిశీల ఉద్యమానికి ఆయన మరణం తీరనిలోటు. పార్టీ ఈ లోటును కేవలం సమిష్టి నాయకత్వం ద్వారా మాత్రమే పూడ్చగలదు. ఆయనతో దశాబ్దాల కాలంపాటు పనిచేసిన వారికిది, అసంఖ్యాకమైన జ్ఞాపకాలు తిరిగివచ్చే సమయం.
అపరిమితమైన శక్తి, అసాధారణమైన సహన సామర్థ్యంతో గుర్తించబడిన వీ.ఎస్‌ జీవితం సంఘటనలతో నిండి ఉంది. పోరాటంలో పాతుకుపోయిన ఆయన జీవితం – కేరళ చరిత్రలో, కమ్యూనిస్ట్‌ విప్లవోద్యమం రెంటిలోనూ ఒక సజీవ అధ్యాయం. కార్మికులు, రైతుల తిరుగుబాట్ల నుండి ఫ్యూడల్‌ వ్యవస్థ, కులతత్వంలో పాతుకునిపోయిన శక్తుల వ్యతిరేక పోరాటం వరకు, రాష్ట్ర రాజకీయ దశ్యం రూపకల్పనలో ఆయన, నిర్ణయాత్మక పాత్ర పోషించాడు. అతి సాధారణ జీవితాన్ని ప్రారంభించిన ఆయన కమ్యూనిస్ట్‌ ఉద్యమ పెరుగుదలలోని ప్రతి అడుగు ద్వారా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అత్యున్నత పదవికి ఎదిగాడు.
భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కౌన్సిల్‌ నుండి బయటకు వచ్చి, 1964 లో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)ను ఏర్పాటు చేసిన 32 మంది నాయకులలో కామ్రేడ్‌ వీ.ఎస్‌.అచ్యుతానందన్‌ ఒకరు. ఆయన మరణంతో, ఆ చరిత్రతో గల చివరి సజీవ సంబంధం కూడా లేకుండా పోయింది. ఆయన మరణంతో జాతీయ స్వాతంత్య్ర పోరాట వారసత్వాన్ని, సమకాలీన రాజకీయ వాస్త వాలతో అనుసంధానం చేసే ఒక విలువైన రాజకీయ ఉనికిని కూడా కోల్పోయాం.
ఒక కమ్యూనిస్టు నాయకునిగా, శాసనసభసభ్యుడిగా, ప్రతిపక్ష నాయకునిగా, ఒక ముఖ్యమంత్రిగా వీ.ఎస్‌ అనేక విధా లుగా శాశ్వత కషిచేశారు. పున్నప్ర వాయలార్‌ పోరాటానికి పర్యాయ పదాన్ని పేరుగా కలిగి ఉన్న ఆయన, కష్టాలు, సహనం, ప్రజల పట్ల అచంచలమైన నిబద్ధతతో రూపుదిద్దుకున్న జీవితం ద్వారా ఎదిగాడు.
ఒక కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించిన వీఎస్‌ కార్మిక వర్గ ఉద్యమానికి ఒక బలమైన నాయకునిగా తయారయ్యాడు. పార్టీ వీఎస్‌ను అభివద్ధి చేస్తే, ప్రతిగా వీఎస్‌ పార్టీని అభివద్ధి చేశారు. తన 17వ ఏట ఆయన కమ్యూనిస్ట్‌ పార్టీలో 1940లో చేరి, 85 ఏళ్లు నిబద్ధత గల సభ్యునిగా ఉన్నాడు. కుట్టనాడ్‌లో వ్యవసాయ కార్మికుల్లో వేతన, కుల బానిసత్వం రద్దు కోసం జరిగిన పోరా టానికి ఆయన నాయకత్వం వహించారు. గ్రామాల గుండా నడుస్తూ, సమావేశాలు నిర్వహిస్తూ, కార్మికుల ఐక్యతను నిర్మిస్తూ, భూస్వాములు, పోలీసుల అణచివేతను ధిక్కరిస్తూ, అణిచివేతకు గురవుతున్న ప్రజానీకాన్ని ఒక బలమైన రాజకీయ శక్తిగా సంఘటిత పరిచాడు.
ట్రావెన్‌కోర్‌ వ్యవసాయ కార్మికుల సంఘం ఏర్పాటులో వీఎస్‌ తిరుగులేని పాత్రను పోషించారు. ఇదే, తర్వాత కాలంలో కేరళ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘంగా మారి, రాష్ట్రంలోని అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన కార్మికోద్యమ సంఘంగా ఉంది. ఆయన నాయకత్వం వహించిన అసంఖ్యాకమైన పోరాటాలు కుట్టనాడ్‌ సామాజిక దశ్యాన్నే మార్చివేశాయి. మెరుగైన వేతనాలు, చప్పా వ్యవస్థ రద్దు, ఉద్యోగ భద్రత, మిగులు భూమి పునః పంపిణీ కోసం డిమాండ్‌ చేస్తూ జరిగిన ఉద్యమాల్లో ఆయన ముందు భాగాన ఉన్నారు. కార్మికులలో ఐక్యత, ఆత్మవిశ్వాసాన్ని నిర్మించడం కోసం ఆయన అవిశ్రాంత ప్రయత్నాలు (పొలాల గట్ల వెంట మైళ్ల దూరం నడవడం, వారి గుడిసెల్ని సందర్శించడం, కార్మికులతో ప్రత్యక్షంగా మాట్లాడటం) ఉద్యమంలోకి వేల మందిని ఆకర్షించాయి.

1948లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించిన తర్వాత వీఎస్‌ను అరెస్ట్‌ చేశారు.1952 నాటికి ఆయన అలప్పుజా పార్టీ డివిజన్‌ కార్యదర్శి అయ్యాడు. ఈ కాలంలోనే ఐక్య కేరళ కోసం జరిగిన ఆందోళనలలో ఆయన క్రియాశీలకంగా పాల్గొన్నారు. 1957లో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన అలప్పుజా జిల్లా కార్యదర్శిగా నియమితులై, వెంటనే రాష్ట్ర కార్య దర్శివర్గ సభ్యుడయ్యాడు. 1959లో పార్టీ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మిగులు భూమి పునః పంపిణీ కోసం జరిగిన పోరాటంతోపాటు అనేక సాహసోపేతమైన పోరాటాలకు కూడా ఆయన నాయకత్వం వహించారు.
కామ్రేడ్‌ వీ.ఎస్‌.అచ్యుతానందన్‌ ఐదున్నర సంవత్సరాలకుపైగా అనేక జైలుశిక్షలు అనుభవించారు.1964లో సీపీఐ (ఎం) ఏర్పడిన నాటి నుండి ఆయన కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉంటూ, 1985లో పొలిట్‌ బ్యూరో సభ్యుడయ్యాడు. ఆయన 1980 నుండి 1992 వరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శిగా, 1996 నుండి 2000 వరకు వామపక్ష ప్రజాతంత్ర సంఘటన కన్వీనర్‌గా తన సేవలందించారు. 2015లో విశాఖపట్నంలో జరిగిన 21వ పార్టీ మహాసభలో వయసు పైబడిన కారణంగా కేంద్ర కమిటీ నుండి తప్పుకున్నారు, కానీ ప్రత్యేక ఆహ్వానితునిగా పార్టీతో తన అనుబంధాన్ని కొనసాగించారు.
ఆయన 2001 నుండి 2006 వరకు ప్రతిపక్ష నాయకుడిగా, తర్వాత 2006 నుండి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా మళ్లీ 2011 నుండి 2016 వరకు ప్రతిపక్ష నాయకుడిగా తన సేవలందించారు. ఆయన నిర్వహించిన ప్రతీ పదవిలో, వీఎస్‌ తనదైన ప్రత్యేకమైన, శాశ్వత ముద్రవేశాడు.
వ్యవసాయ, కొబ్బరిపీచు కార్మికుల కష్టాలను స్వయంగా అనుభవించిన వీఎస్‌, ఆ అనుభవాలను రాజకీయశక్తిగా మార్చుకున్నాడు. దోపిడీకి గురవుతున్న ప్రజల విముక్తి కోసం దఢంగా నిలబడిన నాయకునిగా ఆయన వ్యవసాయ కార్మికోద్యమం, విశాల కమ్యూనిస్టు ఉద్యమాన్ని రెండింటినీ పట్టుదలగా, దఢ సంకల్పంతో ముందుకు నడిపించాడు. కమ్యూనిస్టు పార్టీ చీలిక తర్వాత ఆయన రివిజనిజంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అనంతరం వామపక్ష తీవ్రవాదాన్ని కూడా ప్రతిఘటించారు. పార్టీని సరైన మార్గంలో, ఐక్యంగా ఉంచడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.

వీఎస్‌ దార్శనికత రాజకీయాలకు అతీతంగా విస్తరించింది. పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కులు, లింగ సమానత్వం లాంటి రంగాల్లో ఆయన క్రియాశీలకంగా పనిచేశాడు. ఈ విస్తత కార్యక్రమాల ద్వారానే ఆయన విశాల ప్రజాగౌరవాన్ని పొందాడు. కేరళలో వామపక్ష రాజకీయ పరిధిని విస్తరించడం ద్వారా అనేక సామాజిక ముఖ్యాంశాల్ని రాజకీయ ప్రధాన స్రవంతిలోకి తీసుకుని రావడంలో ఆయన సహాయపడ్డారు.
శాసనసభ్యునిగా, వీఎస్‌ అనేక గుర్తించదగిన సేవలందించారు. ఆయన 1967, 1970లలో కేరళ శాసనసభకు అంబలప్పుజ నియోజకవర్గం నుండి, 1991లో మరారికులం నుండి, పాలక్కాడ్‌ జిల్లాలోని మలాంపుజ నియోజకవర్గం నుండి 2001 నుండి 2021వరకు ఎన్నికయ్యాడు. అదేవిధంగా 2016 నుండి 2021 వరకు కేరళ అడ్మినిస్ట్రేటివ్‌ రిఫార్మ్స్‌ కమిషన్‌ ఛైర్మెన్‌గా కూడా ఆయన సేవలందించారు. ముఖ్యమంత్రిగా ఆయన తన పదవీ కాలంలో పార్టీ, వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్డీఎఫ్‌) రూపొం దించిన విధానాలను అమలు చేయడం ద్వారా కేరళను ముందుకు నడిపించాడు. సంక్షోభ సమయాల్లో కూడా ఆయన అచంచలమైన శక్తి సామర్ధ్యాలతో ప్రభుత్వాన్ని నడిపించాడు. ప్రతిపక్ష నాయకుడిగా, ఆయన ప్రజల సమస్యలపై పోరాడి, శాసనసభ సమావేశాల్లో జరిగిన చర్చల్లో క్రియాశీలక పాత్రను పోషించాడు.
కేరళ రాజకీయ చరిత్రలో వీ.ఎస్‌ అచ్యుతానందన్‌ ఒక మహోన్నత వ్యక్తి. కామ్రేడ్‌ వీ.ఎస్‌ మరణం పార్టీకి, కేరళతో పాటు దేశానికి కూడా తీరని లోటు.అయినా,ఆయన వారసత్వం శాశ్వతంగా ఉంటుంది. న్యాయం,సమానత్వం,ప్రజల లక్ష్యానికి కట్టుబడి ఉన్న తరతరాలకు ఆయన వారసత్వం స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.
పినరయి విజయన్‌
(”పీపుల్స్‌ డెమోక్రసీ”సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్‌,9848412451

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -