Saturday, November 8, 2025
E-PAPER
Homeజాతీయంవీధి కుక్కలపై చర్యలు తీసుకోవాలి

వీధి కుక్కలపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

బహిరంగ ప్రదేశాల నుంచి షెల్టర్లకు తరలించాలి
స్కూల్స్‌, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ఆస్పత్రుల్లోకి రాకుండా కంచెలు వేయాలి
రహదారులపైకి కుక్కలు, పశువులను నిరోధించే చర్యలుండాలి : సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బహిరంగ ప్రదేశాల్లోని వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వాటిని విద్యా సంస్థలు, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ఆస్పత్రులు, క్రీడా సముదాయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల సమీపం నుంచి షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. వీధి కుక్కలు ఆయా ప్రదేశాల్లోకి రాకుండా కంచెలు వేయాలని సూచించింది. ఈ ప్రదేశాల్లో కుక్కలు లేవని నిర్ధారించుకునేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని చెప్పింది. ఏ కారణం చేతనైనా మళ్లీ వాటిని పట్టుకున్నచోటే వదిలివేయొద్దని ఆదేశించింది. కుక్కల తరలింపునకు కోర్టు ఎనిమిది వారాల సమయం ఇచ్చింది. వీధి కుక్కల కేసులో శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయమూ ర్తులు జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ ఎన్‌.వి.అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రహదారులపైకి కుక్కలు, పశువులు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని వివరించింది. జాతీయ రహదారులపై తిరుగు తున్న పశువులను షెల్టర్లకు తరలించాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, జాతీయ రహదారుల శాఖ, స్థానిక సంస్థలు, హైవే గస్తీ బృందాలకు ఆదేశాలు ఇచ్చింది. రెండు వారాల్లోగా మున్సిప ల్‌ సిబ్బంది వీధి కుక్కలు ఉండే స్థలాలను, భవనాలను గుర్తించాలని సూచించింది. ఆయా ప్రాంతాల్లో తిరిగే వీధి కుక్కలను స్టెరిలైజేషన్‌ చేసి, రీ లొకేషన్‌ చేయాలని స్పష్టం చేసింది. అమికస్‌ క్యూరీ నివేదికలో పేర్కొన్న విషయాలు కోర్టు ఆదేశాల్లో భాగంగా పరిగణించబడతాయని సుప్రీంకోర్టు వివరించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నివేదికలో గుర్తించిన లోపాలను సరిచేయడానికి తీసుకున్న చర్యల వివరాలతో సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చేయాలని సూచించింది. అలాగే రాజస్తాన్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. అన్ని రాష్ట్రాల నోడల్‌ అధికారులకు జాతీయ రహదారులు, హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేల మీద కనిపించే నిరాశ్రయ జంతువులను తొలగించాల్సింది గా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమం కోసం జాయింట్‌ కోఆర్డినేటెడ్‌ డ్రైవ్‌ చేపట్టాలని ఆదేశించింది. రహదారుల నుంచి తరలించిన పశువులు, కుక్కలకు అవసరమైన సంరక్షణ అందించాలని తెలిపింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఆదేశాల అమలుపై కచ్చితమైన బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే సంబంధిత అధికారులపై వ్యక్తిగత చర్యలు తీసుకోబడుతాయని సుప్రీంకోర్టు హెచ్చ రించింది. ఎనిమిది వారాల్లోగా అమలు విధానం, చర్యలపై స్టేటస్‌ రిపోర్ట్‌ సమర్పిం చాలని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 13కు వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -