– పంచాయతీ కార్యదర్శి రాజు యాదవ్
నవతెలంగాణ–మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటా తాగునీరు అందిస్తున్న విషయం తెలిసిందే. మండలంలోని మల్లారం గ్రామంలో కొందరు మిషన్ భగీరథ పైప్ లైన్ కు అక్రమంగా బిగించిన చిన్న మోటార్లు వెంటనే స్వచ్ఛంధంగా తొలగించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే పంచాయతీ శాఖాపరమైన చర్యల తప్పవని మల్లారం గ్రామ కార్యదర్శి చెలుకల రాజు హెచ్చరించారు. శుక్రవారం గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామపంచాయతీ పరిధిలోని మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన పైప్ లైన్లకు కొందరు చిన్న కరెంటు మోటార్లు బిగించి నీటిని అక్రమంగా వాడుకుంటున్నారన తెలిపారు. ఈ మోటార్లు పెట్టడంతో కింద ఉన్న ఇండ్లకు నీటి సరఫరా అందడం లేదన్నారు. గ్రామ పంచాయతీకి వచ్చిన ఫిర్యాదుల మేరకు త్వరలోనే మిషన్ భగీరథ విజిలెన్స్ కమిటీ గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తుందని తెలిపారు. అక్రమంగా మోటార్లు పెట్టినవారు ఇప్పటికైనా వాటిని తొలగించాలని కోరారు. లేనిచో తెలంగాణ పంచాయతీరాజ్ 2018 యాక్టు ప్రకారం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.



