Sunday, April 19, 2026
E-PAPER
Homeజాతీయంఆసియా కుబేరుడిగా అదానీ..2వ స్థానానికి పడిపోయిన ముకేశ్ అంబానీ!

ఆసియా కుబేరుడిగా అదానీ..2వ స్థానానికి పడిపోయిన ముకేశ్ అంబానీ!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఆసియా సంపన్నుల జాబితాలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా గణాంకాల ప్రకారం.. అదానీ నికర ఆస్తి విలువ 92.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఇప్పటివరకు ప్రథమ స్థానంలో ఉన్న ముకేశ్ అంబానీ (90.8 బిలియన్ డాలర్లు) రెండో స్థానానికి పడిపోయారు. గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిసినప్పటికీ.. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు అదరగొట్టాయి. దీనివల్ల గౌతమ్ అదానీ సంపద కేవలం ఒక్కరోజులోనే 3.56 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 29,600 కోట్లు) పెరిగింది. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఫ్లాట్‌గా ముగియడంతో అంబానీ సంపదలో పెద్దగా మార్పు రాలేదు.

ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ 19వ స్థానంలో నిలవగా, ముకేశ్ అంబానీ 20వ స్థానానికి చేరారు. ఈ ఏడాది అదానీ సంపద 8.10 బిలియన్ డాలర్లు పెరగగా, అంబానీ మాత్రం 16.9 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూశారు. ఆశ్చర్యకరంగా 2026లో ప్రపంచంలోని టాప్-20 ధనవంతులలో ఏడుగురు తమ సంపదను కోల్పోయారు. వీరిలో ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ అత్యధికంగా 44 బిలియన్ డాలర్లు నష్టపోగా, వారెన్ బఫెట్, బిల్ గేట్స్, లారీ ఎల్లిసన్ వంటి దిగ్గజాల ఆస్తి కూడా ఈ ఏడాది తగ్గుముఖం పట్టడం గమనార్హం. కాగా.. ఎలాన్ మస్క్ 656 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ అపర కుబేరుడిగా కొనసాగుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -