న్యూఢిల్లీ : విమానాల్లో సీట్ల ఎంపిక పేరుతో విమానయాన సంస్థలు వసూలు చేస్తున్న అదనపు చార్జీలకు అడ్డుకట్ట వేస్తూ కేంద్ర పౌరవిమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్లను ఎలాంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు కేటాయించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా విండో సీట్లు, లెగ్‌రూమ్ ఎక్కువ ఉండే సీట్లపై అధిక ధరలు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో పారదర్శకత కోసం ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. దీంతో పాటు ఒకే పీఎన్‌ఆర్‌పై టికెట్లు బుక్ చేసుకున్న వారు కలిసి కూర్చునేలా సీట్లు ఇవ్వాలని, విమానాల రద్దు లేదా ఆలస్యం జరిగినప్పుడు ప్రయాణికుల హక్కుల గురించి ప్రాంతీయ భాషల్లో సమాచారం అందించాలని స్పష్టం చేసింది.



