నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
రాయగిరిలో అమ్మ భరోసా కిట్టను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ భాస్కరరావు పంపిణీ చేశారు. బుధవారం ఆయన బొల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రాయగిరి గ్రామంలో అమ్మ భరోసా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. గర్భిణీ స్త్రీ తో ఆప్యాయంగా మాట్లాడి, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గర్భధారణ సమయంలో శ్రద్ధ తీసుకోవాలని, సమయానికి ఆహారం తీసుకుంటే పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండతాడని తెలిపారు.
అనంతరం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేసుకోవడం పూర్తి స్థాయిలో ఆరోగ్యకరమైన, అనవసర ఖర్చులు లేకుండా జరుగుతుంది అని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సమయంలో తల్లి, బిడ్డకు అవసరమైన మందులు, టీకాలు ఉచితంగా అందించబడతాయని తెలిపారు. ఇంకా, కాన్పు తర్వాత 102 వాహన సేవ ద్వారా తల్లిని బిడ్డతో కలిపి ఇంటి వద్ద దింపే సదుపాయం కూడా ఉందని వివరించారు.
ఆహార పదార్థాలపై కూడా కలెక్టర్ గర్భిణి స్త్రీ కి అవగాహన కల్పించారు. మెంతికూర, తోటకూర, పుంటికూర వంటి ఆకుకూరలను పప్పుతో కలిపి వారానికి కనీసం రెండు సార్లు తినాలని చెప్పారు. అలాగే గ్లాస్ పాలు, కొబ్బరి ముక్కలు (ఎండినవి లేదా తాజా), పల్లీలు బెల్లంతో కలిపి, ఖర్జూరాలు, డ్రైఫ్రూట్స్ తీసుకోవాలని సూచించారు. హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ సూచన మేరకు ఐరన్ ట్యాబ్లెట్స్ లేదా ఇంజక్షన్ రూపంలో తీసుకోవడం సూచించారు. ఈ రకమైన ఆహారం ద్వారా గర్భిణికి శారీరకంగా, మానసికంగా ఎదుగుదల ఉంటుందనారు. కాన్పు అయిన తర్వాత ఒక గంటలోపు ముర్రు పాలను తప్పకుండా ఇవ్వాలనే అంశంపై కూడా గర్భిణికి అవగాహన కల్పించారు.
ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకి సూచించారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు తరచూ గర్భిణుల ఇండ్లను సందర్శించి గర్భిణి స్త్రీల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని వారికీ తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డాక్టర్ యామిని శృతి, సిబ్బంది పాల్గొన్నారు