అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
ప్రతి మహిళా ఎస్‌హెచ్‌జీలో చేరాలి : సీతక్క
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో అదనంగా 490 వెంటిలేటర్లు, తొమ్మిది ఎంఆర్‌ఐ యంత్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలియజేశారు. రోగుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన అన్నీ చర్యలు చేపడుతున్నామని వివరించారు. శాసనసభ సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. సోమవారం శాసనసభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ మేరకు ప్రభుత్వ దవాఖానల్లో వెంటిలేటర్లపై కూనంనేని సాంబశివరావు, డాక్టర్ మురళీనాయక్, లక్ష్మారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, పాల్వాయి హరీశ్, మీర్ జుల్ఫీకర్ అలీ తదితరులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి దామోదర రాజనర్సింహ సమాధానమిచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో సుమారు 1790 వెంటిలేటర్ బెడ్లు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో వైద్య సేవలు మెరుగుపడ్డాయని వివరించారు.
దీంతో ప్రభుత్వ హాస్పిటళ్లకు చికిత్స కోసం వచ్చే పేషెంట్ల సంఖ్య పెరిగిందనీ, తదనుగుణంగా ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్ బెడ్ల అవసరం మరింత అధికమైందన్నారు. అవసరాలకు అనుగుణంగా మరో 490 వెంటిలేటర్లను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. గాంధీ, ఉస్మానియా, ఎంజీఎం వంటి ప్రభుత్వ జనరల్ హాస్పిటళ్లు, జిల్లా హాస్పిటళ్లలో వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. నిమ్స్‌కు సామర్థ్యానికి మించి రోగులు వస్తున్నారని తెలిపారు. చివరి నిమిషంలో ప్రయివేటు, కార్పొరేట్ హాస్పిటళ్ల నుంచి వెంటిలేటర్ మీద నిమ్స్‌కు వచ్చే రోగుల సంఖ్య ఎక్కువైందని వివరించారు. రోగుల అవసరాల మేరకు నిమ్స్‌లో అదనంగా మరో 125 వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. నిమ్స్‌లో కొత్తగా సుమారు 850 పోస్టులను భర్తీ చేయబోతున్నామన్నారు. గాంధీ, ఉస్మానియా, ఆదిలాబాద్ రిమ్స్, ఎంజీఎంలో మాత్రమే ఎంఆర్‌ఐ యంత్రాలు ఉన్నాయనీ, మరో 9 ప్రభుత్వ దవాఖానాల్లో వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నామని వివరించారు.
గతేడాది కొత్తగా 213 అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చామనీ, దీంతో అత్యవసర స్పందన 18 నిమిషాల నుంచి 13 నిమిషాలకు తగ్గిందని గుర్తు చేశారు. ఈ ఏడాది మరో 79 కొత్త అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నామనీ, ఇవి అందుబాటులోకి వచ్చాక ఎమర్జన్సీ రెస్పాన్స్ టైమ్ 10 నిమిషాలకు తగ్గుతుందని వివరించారు. ఈ రెండేండ్లలో కొత్తగా 16 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామనీ, ఇప్పుడు డయాలసిస్ సెంటర్లలో వందకుపైగా డయాలసిస్ మిషన్లను అదనంగా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలోని ఏ పాయింట్ నుంచైనా 20 నిమిషాల ప్రయాణంలోనే డయాలసిస్ సెంటర్ ఉండేలా, ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. డయాలసిస్ రోగులకు ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదని అభిప్రాయపడ్డారు. క్యూర్ ఏరియాలో బస్తీ దవాఖాన్లను బలోపేతం చేస్తున్నామనీ, వీటికి మందులు, ఇతరాల సరఫరా ఇంతకుముందు పీహెచ్‌సీల నుంచి జరిగేదనీ, ఇకపై సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ నుంచి నేరుగా అందిస్తామని తెలియజేశారు. దీంతో కృత్రిమ కొరతను నివారించవచ్చని అన్నారు.
ఎస్‌హెచ్‌జీ సభ్యురాలిగా ప్రతి మహిళ : మంత్రి సీతక్క వ్యాఖ్య
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటుపై సభ్యులు ప్రశ్న లేవనెత్తగా.. మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. మహిళా సాధికారతకు, సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని స్పష్టం చేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48గంటల్లోనే ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కషి చేస్తున్నామన్నారు. ప్రతి మహిళా ఎస్‌హెచ్‌జీ సభ్యురాలుగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని వెల్లడించారు. 15 సంవత్సరాలు దాటిన బాలికల నుంచి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరిని మహిళా సంఘం సభ్యులుగా చేర్చుతున్నామని తెలిపారు. కిశోర బాలికలు, వద్ధులు, వికలాంగులకు ప్రత్యేక మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
సంఘాలకు రూ. 12 నుంచి 15 కోట్ల వరకు అప్పులు ఇస్తున్నట్టు చెప్పారు. ప్రయివేటు వడ్డీల బారిన పడేకంటే సంఘాల్లో చేరితే తక్కువ వడ్డీకే అప్పులు తీసుకోవచ్చని అన్నారు. ఇందిరమ్మ చీరలను సంక్రాంతిలోపు సరఫరా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. గ్రామాల్లోని బుక్‌కీపర్లకు సైతం రుణాలు ఇస్తామన్నారు. సంఘాల్లో అవినీతిని అరికడతామనీ, ప్రతి విషయంలోనూ పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. పేదరిక నిర్మూలనకు అవసరమైన అన్నీ చర్యలు తీసుకోనున్నట్టు వివరించారు. కేరళ మాదిరిగా రాష్ట్రంలో సర్వే నిర్వహిస్తామని ప్రకటించారు. అత్యంత పేద కుటుంబాలను గుర్తించి కేరళ తరహాలో వారికి అవసరమైన అన్నీ వసతులు కల్పించడం ద్వారా పేదరికం నుంచి బయట పడేస్తామన్నారు. సీఎం ఆలోచనలను అమలు చేస్తామన్నారు. మహిళలకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామనీ, ఇంటి పునాది వేయలేని పరిసితుల్లో లబ్దిదారులుంటే వారికి రూ. లక్ష రుణం అందజేస్తామని తెలిపారు.
గట్టిగా నిలదీస్తామంటూ…జారుకున్నారు..!! : బీఆర్‌ఎస్ సభ్యులపై మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్
సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ బీరాలు పలికిన బీఆర్‌ఎస్ సభ్యులు, ఇప్పుడు సభ నుంచే జారుకున్నారని శాసనసభలో మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. బీఏసీలో అనేక ప్రశ్నలు లేవనెత్తి, ఇప్పుడు అసలు కనిపించడమే లేదన్నారు. ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగే సమయంలో ప్రధాన ప్రతిపక్ష సభ్యులు గైర్హాజరు కావడం సరికాదన్నారు. నిజాలను ప్రజల ముందుంచేందుకే ప్రభుత్వం సభలో కృష్ణా జలాలపై ప్రజెంటేషన్ ఏర్పాటు చేసిందని తెలిపారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే సభలో చెప్పాలనీ, కానీ బయట చెప్పడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ‘స్పీకర్’ను అగౌరవ పరిచేలా వ్యవహరించిన బీఆర్‌ఎస్ సభ్యులపై చర్యలు తీసుకోవాలని సభాపతికి విజ్ఞప్తి చేశారు. ప్రశ్నోత్తరాల్లో ఆర్‌కె పురం రోడ్డు ప్రాజెక్టుతో నష్టపోయిన కుటుంబాలకు పునరావాసం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలల లక్ష్యాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పారు.



