Wednesday, January 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయండాలర్లు సంపాదిస్తున్నా మూలాలు మర్చిపోని కవి అఫ్సర్‌

డాలర్లు సంపాదిస్తున్నా మూలాలు మర్చిపోని కవి అఫ్సర్‌

- Advertisement -

– మఖ్దూం పురస్కార సభలో గోరటి వెంకన్న
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

అమెరికాలో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో విధులు నిర్వహిస్తూ డాలర్లు సంపాదిస్తున్నా, తన మూలాలను మరచిపోని కవి అఫ్సర్‌ అని సుప్రసిద్ధ కవి, తెలంగాణ శాసన మండలి సభ్యులు గోరటి వెంకన్న అన్నారు. ప్రభుత్వ సిటీ కాలేజీ మఖ్దూం మొహియుద్దీన్‌ నేషనల్‌ అవార్డు ప్రదాన సభలో ఆయన మాట్లాడారు. మఖ్దూం అవార్డును అఫ్సర్‌కు ప్రదానం చేయడం అవార్డుకే గౌరవమన్నారు. అఫ్సర్‌ కవిత్వంలో తాత్వికత, వేదన, ఆవేదన ఉంటుందన్నారు. పోతులూరి, వేమన, మఖ్దూం వారసత్వంతో అంతర్జాతీయ స్థాయిలో మంచి సాహితీవేత్తగా గుర్తింపు పొందాడని తెలిపారు. కవిగానే కాక కథకుడిగా, పరిశోధకుడిగా, విమర్శకుడిగా అఫ్సర్‌ నిర్వహించిన పాత్ర ప్రశంసనీయమని చెప్పారు. చారిత్రాత్మక సిటీ కాలేజీ ఇలాంటి అవార్డు నెలకొల్పటం అభినందనీయమన్నారు. మీ కోసం మీరు బతకడంకాదు, లోకం కోసం బతకండి అంటూ విద్యార్ధులకు హితవు చెప్పారు. పదవే గీతమా…పదవే నా ప్రాణమా అన్న మఖ్దూం అనువాద గీతంతో పాటు తాను రచించిన ఎన్నో పాటలు పాడి సభను అలరింపజేశారు.

మఖ్దూం తెలంగాణలోని ప్రతి ఉద్యమంలో భాగమయ్యారు : మఖ్దూం పురస్కార గ్రహీత అఫ్సర్‌
పురస్కార గ్రహీత అఫ్సర్‌ మాట్లాడుతూ తనకు ఎన్ని పురస్కారాలు వచ్చినా మఖ్దూం మొహియుద్దీన్‌ జాతీయ అవార్డు స్వీకరించటం సంతృప్తినిచ్చిందనీ, తనను ఎంపిక చేసిన పురస్కారకమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. సిటీ కళాశాల అంటే ఓ చరిత్ర. శతవసంతాల చరిత్ర గల కళాశాల ఇదని గుర్తు చేశారు. ఇక్కడి నుండి అధ్యాపకుడిగా మఖ్దూం మొహియుద్దీన్‌ ప్రస్థానం ప్రారంభంకావడం విశేషమన్నారు. తాను ఒక కుగ్రామం నుంచి అమెరికా దాకా వెళ్ళానని, భాష, జ్ఞానం తోడుంటే ఎక్కడి దాకయినా ప్రయాణం చెయ్యొచ్చన్నారు. తన తండ్రికి మఖ్దూంతో సాన్నిహిత్యం ఉండేదని చెప్పారు. మఖ్దూం కేవలం ఒక కవి మాత్రమే కాదనీ, తెలంగాణలోని ప్రతీ ఉద్యమంలో భాగమయ్యారని గుర్తు చేశారు. అందుకు ఆయన సాహిత్యాన్ని ఓ సాధనంగా చేసుకున్నారని చెప్పారు. ఇన్నేళ్ళ తర్వాత కూడా మఖ్దూం మొహియుద్దీన్‌ను ఇలా అవార్డు ద్వారా స్మరించుకోవడం మరిచిపోలేని విషయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు కనీసం ఒక్క మఖ్దూం కవితనైనా చదవాలని కోరారు.

సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య సిహెచ్‌. ప్రసాద్‌ మాట్లాడుతూ అర్హత గలవారికి అవార్డును ఇవ్వడం ఆ అవార్డుకే గౌరవమన్నారు. కవిగా, కార్మికోద్యమ నాయకుడిగా, అధ్యాపకుడిగా, శాసన సభ్యుడిగా తెలుగు సమాజంపై మఖ్దూం వేసిన ప్రభావం అసామాన్యమైందని అన్నారు. మఖ్దూం రచించి రవీంద్ర భారతిలో ప్రదర్శింపజేసిన నాటకాన్ని చూసిన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఎంతో ముగ్ధుడై శాంతినికేతన్‌లో విద్యాభ్యాసానికి రమ్మని ఆహ్వానించారని గుర్తు చేశారు. విదేశాల్లో మన భాషను బోధిస్తున్న కవి అఫ్సర్‌కు మఖ్దూం మొహియుద్దీన్‌ జాతీయ అవార్డును ప్రదానం చేయటం ముదావహమన్నారు. మట్టివాసనతో జాతి నిర్మాణానికి పాటు పడిన మఖ్దూం మొహియుద్దీన్‌ ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.

ఆత్మీయ అతిథి డాక్టర్‌ యాకూబ్‌ మాట్లాడుతూ మఖ్దూం ప్రగతిశీల భావజాలాన్ని మాత్రమే కాకుండా జాతీయ సమైక్యతను, దేశభక్తిని తన సాహిత్యం ద్వారా, ఆచరణ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాడని తెలిపారు. సాహిత్యం సమాజ దిశను మార్చాలని మఖ్దూం చేసిన ప్రయత్నాలు గొప్పవని చెప్పారు.
విశిష్ట అతిథి సినీ దర్శకులు, రచయిత వేణు ఊడుగుల మాట్లాడుతూ కార్పొరేట్‌ కాలేజీలను తలదన్నే మంచి కళాశాల సిటీ కళాశాల అన్నారు. అఫ్సర్‌ తనకు స్పూర్తినిచ్చిన కవి అనీ, అతనికి ఈ పురస్కారం ఇవ్వటం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. ఆత్మీయ అతిథి కటుకోజ్వల ఆనందాచారి ప్రసంగిస్తూ ఈ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసిన మఖ్దూం మొహియుద్దీన్‌ అభ్యుదయ రచయిత, ప్రపంచ నియంతల విధానాలకు వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. నాటి మఖ్దూం మొహియుద్దీన్‌ పోరాటపటిమను స్ఫూర్తిగా తీసుకుని నేటి రచయితలు రచనలు చేయాలని సూచించారు.
సిటీ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌, అవార్డు కమిటీ కన్వీనర్‌ డాక్టర్‌ విప్లవ దత్‌ శుక్లా మఖ్దూం జీవిత రేఖలను పరిచయం చేయగా, మరో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శాంతి మాట్లాడుతూ మఖ్దూం మొహియుద్దీన్‌ అడుగుజాడల్లో నడవాలని విద్యార్థులకు సూచించారు. కమిటీ సభ్యులు డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు, ఐక్యూయేసి సమన్వయకర్త డాక్టర్‌ జె.నీరజ సభను సమన్వయం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -