Thursday, May 29, 2025
Homeజాతీయంజులై 9 సమ్మెకువ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘాల మద్దతు

జులై 9 సమ్మెకువ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘాల మద్దతు

- Advertisement -


కార్మిక నేతల సమావేశం గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలకు నిర్ణయం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జులై 9న జరిగే కేంద్ర కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మెకు అఖిల భారత వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. మంగళవారంనాడిక్కడ అఖిల భారత వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ)నుంచి బి. వెంకట్‌, విక్రమ్‌ సింగ్‌, భారతీయ ఖేత్‌ మజ్దూర్‌ యూనియన్‌ (బీకేఎంయూ) నుంచి గుల్జార్‌ సింగ్‌ గోరియా, నిర్మల్‌, ఏఐఏఆర్‌ఎల్‌ఏ నుంచి నివాస్‌, ప్రసేంజిత్‌ కుమార్‌, అఖిల భారత వ్యవసాయ కూలీల సంఘం (ఏఐఎస్కేఎస్‌) నుంచి ఆసిత్‌ గంగూలీ తదితరులు పాల్గొన్నారు. జులై 9న జరిగే సార్వత్రిక సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ.. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది.


కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం)తో సమన్వయం చేసుకుని జులై 9న దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో 1,000 తాలూకా, మండల, సబ్‌ డివిజనల్‌ కేంద్రంగా లక్షల మందితో భారీ ఉద్యమాలు చేయాలని నిర్ణయించారు. బీజేపీ ప్రభుత్వ కార్మిక, వ్యవసాయ వ్యతిరేక విధానాలను ఎదుర్కోవటమే లక్ష్యంగా ఈ ఆందోళన జరుగుతుందని నేతలు వివరించారు. దేశంలో వ్యవసాయ కార్మికుల, గ్రామీణ పేదల శ్రమను కార్పొరేట్‌ లాభాల కోసం తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. కేంద్రంలో 2014 నుంచి అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం పరిశ్రమలతో పాటు వ్యవసాయ రంగంలోనూ అనేక ప్రతికూలమైన విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. కోవిడ్‌ సమయంలో ప్రవేశపెట్టిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలు, కార్మిక కోడ్‌లు వంటి చర్యలు ప్రజా వ్యతిరేకమైనవని అన్నారు. చారిత్రాత్మక ఉద్యమంతో మోడీ ప్రభుత్వం నల్ల రైతు చట్టాలను పక్కన పెట్టి దొడ్డిదారిన మరోరూపంలో అమలుకు సిద్ధమవుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


లేబర్‌ కోడ్‌లతో కార్మికుల హక్కులు కాలరాసి, పారిశ్రామిక యజమానులకు అధికారాలు ఇవ్వడమని విమర్శించారు. గ్రామీణ ఉపాధిని పటిష్టం చేయడానికి బదులు నిధులు పెంచకుండా ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. పని దినాలను 200కి పెంచాలన్న డిమాండ్‌ను పట్టించుకోవటం లేదనీ, అలాగే రోజుకు రూ.600గా ఇవ్వాలనే డిమాండ్‌ను పట్టించుకోలేదని తెలిపారు. పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీనే 150 రోజులు పని, వేతనం పెంపు, ఆధార్‌ తప్పనిసరి వద్దని చెప్పినప్పటికీ, మోడీ సర్కారు వీటిని అటకెక్కించిందన్నారు. గ్రామీణ ఉపాధి, ఆహార భద్రత, గృహ హక్కు, విద్యుత్‌ ప్రయివేటీకరణ వ్యతిరేకత, దళిత, ఆదివాసీ, మహిళా హక్కులు, వ్యవసాయ కార్మికుల పట్ల కేంద్ర చట్టం, కౌలు రైతులకు గుర్తింపు, మద్దతు ధర, గిరాకీ ధరలతో కూడిన రాయితీలు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లతో గ్రామీణ పేదలు జులై 9న నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపు ఇచ్చారు.


ప్రధాన డిమాండ్లు
1. ఉపాధి బలోపేతం: రూ.2.5 లక్షల కోట్ల బడ్జెట్‌, 200 రోజులు పని, రూ.600 వేతనం
2. జనభద్రత కోసం ఆహార భద్రత: ప్రతి ఒక్కరికీ 10కిలోల బియ్యం, నాణ్యమైన నిత్యావసరాలు, డిలీట్‌ రేషన్‌ కార్డుల పునరుద్ధరణ.
3. భూమి, నివాస హక్కు : భూమిలేని రైతులకు భూమి, నిర్బంధ భూ స్వాధీనం నిషేధం.
4. విద్యుత్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా : గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ మీటర్ల తొలగించాలి. ప్రయివేటీకరణను తక్షణమే ఆపాలి.
5. దళిత, ఆదివాసి, మహిళల హక్కులకు రక్షణ : మనువాదాన్ని తిరస్కరించాలి. హిందూత్వ భావజాలాన్ని తిప్పికొట్టాలి.
6. వ్యవసాయ కార్మికుల కోసం కేంద్ర చట్టం : సామాజిక భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం.
7. లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి : కనిష్ఠ వేతనం రూ. 26,000, ఒప్పందం, పథకాల కార్మికుల పరిపాలన.
8. ఎంఎస్పీ హామీ, రాయితీలు : రైతులకు గ్యారంటీ కలిగిన మద్దతు ధర, ఉచిత రుణాలు, వ్యవసాయ పరికరాలకు రాయితీలు.
9. భూమి లేని రైతులకు గుర్తింపు : భూదారులుగా గుర్తించి, వారికి సామాజిక భద్రత, బ్యాంకు రుణాలు.
10. ప్రతి పౌరుడికీ రూ.10,000 కనీస భద్రత : నెలకు కనీస ఆదాయ భద్రతగా అమలు చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -