– మూడేండ్లయినా సమకూరని భవనం
– ప్రాక్టికల్స్‌కు, డార్మెటరీకి అసౌకర్యం
– విద్యార్థినులకు అన్ని కష్టాలే
– రెండెకరాల్లో ప్రాక్టికల్స్..35 ఎకరాలు కేటాయించినా నిరుపయోగం
– యూనివర్సిటీకి కనీసం 50 ఎకరాలు అవసరం
నవతెలంగాణ- మహబూబ్‌నగర్
ప్రాంతీయ ప్రతినిధి / వనపర్తి
అది వెనకబడిన తరగతుల విద్యార్థినుల విద్యావికాసం కోసం ప్రత్యేకంగా మహాత్మాజ్యోతిరావు పూలే సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఎస్సీ అగ్రికల్చర్ మహిళా డిగ్రీ కళాశాల. జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీకి అనుబంధంగా ఏర్పాటు చేసిన కాలేజీ. మూడేండ్లుగా పక్కా భవనం లేక ప్రారంభం నుంచి కోళ్ల షెడ్డులోనే కొనసాగుతోంది. దాదాపు 340 మంది విద్యార్థినులు చదువుతున్న కాలేజీకి రెండెకరాల స్థలాన్ని మాత్రమే గత ప్రభుత్వం కేటాయించింది. అది కూడా కోర్సులో భాగంగా విద్యార్థినుల ప్రాక్టికల్స్‌కు పూర్తిస్థాయిలో ఉపయోగకరంగా లేదు. నేల మీద మట్టిని కూడా విద్యార్థులు ముట్టుకోలేరు. వేరే చోట 35 ఎకరాలు కేటాయించినా అది పూర్తిగా గుట్టలతో నిరుపయోగంగానే ఉంది. ఫలితంగా వ్యవసాయ కళాశాలలో చేరిన విద్యార్థినులకు సాగుపై పూర్తిస్థాయిలో అవగాహన లేకుండానే ఒక బ్యాచ్ విద్యార్థులు తమ చదువును పూర్తి చేసుకొని వెళ్లిపోయే దుస్థితి ఏర్పడింది.
కాంగ్రెస్ ప్రభుత్వం కాలేజీ స్థలాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మహాత్మా జ్యోతిరావుపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 డిసెంబర్‌లో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. వనపర్తి జిల్లాలో విద్యా వ్యవస్థకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉండటంతో ప్రత్యేకంగా అగ్రికల్చర్ యూనివర్సిటీని ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రతి ఏడాదీ ఈ కళాశాలలో 120 మంది విద్యార్థినులకు అడ్మిషన్స్ కల్పిస్తున్నారు. 2022లో నుంచి ఆన్‌లైన్‌్ ద్వారా ఇప్పటివరకు మూడు బ్యాచుల అడ్మిషన్స్ పూర్తయ్యాయి. నాలుగో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. 338 మంది విద్యార్థినులు కళాశాలలో అభ్యసిస్తున్నారు. ఇందులో కృషి విజ్ఞాన కేంద్రానికి అనుసంధానంగా 27 మంది, డాట్ సెంటర్ కేంద్రం అనుసంధానంగా 27 మంది విద్యార్థినులను.. ఐదు గ్రామాల చొప్పున అగ్రికల్చర్ కమ్ ఫీల్డ్ చేయిస్తున్నారు. నర్సరీ, సాయిల్ టెస్ట్, ఇన్కమ్ జనరేట్‌కు సంబంధించిన ప్రత్యేక కోర్సులు ఇక్కడ అందిస్తున్నారు. మొత్తంగా విద్యార్థినులు, ఉద్యోగులతో కలిపి దాదాపు 400 మంది కొనసాగుతున్నారు.
బిల్డింగ్ లేక.. అవస్తలు
2022 డిసెంబర్‌లో ప్రారంభమైన అగ్రికల్చర్ మహిళా డిగ్రీ కళాశాలకు బిల్డింగ్, వ్యవసాయ యోగ్యమైన అవసరమైన భూమి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. ప్రారంభంలో తాత్కాలికంగా రెండు కోళ్ల షెడ్డులను అద్దెకు తీసుకొని ఏర్పాటు చేశారు. దాంతోపాటు కళాశాల వినియోగానికి 35 ఎకరాలను ప్రభుత్వం అప్పట్లోనే కేటాయించింది. నాగవరం శివారులోని భూమిని యూనివర్సిటీ పేరుతో ఏర్పాటు చేసింది. కానీ ఆ భూమిలో మొత్తం గుట్టలు ఉండటంతో వినియోగానికి అనువుగా లేదని యూనివర్సిటీ అథారిటీ అధికారులు తేల్చారు. కనీసం 40 నుంచి 50 ఎకరాల భూమి కేటాయిస్తే తప్ప విద్యార్థినులు పూర్తిస్థాయిలో విద్యను అభ్యసించే అవకాశం లేదు.
వేసవిలో కష్టాలు
కాలేజీలో సరైన లైబ్రరీల ఏర్పాటు, ల్యాబ్‌లు, బిల్డింగ్, సాగు విస్తీర్ణానికి తగినంత భూమి లేదు. దాదాపు నాలుగు సంవత్సరాల విద్యా కోర్సులను అభ్యసించాల్సిన విద్యార్థినులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎండలు బాగా ముదిరినా, వేసవికాలం వచ్చినా షెడ్డులో విద్యాబోధన, ప్రాక్టికల్స్ నిర్వహణకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
కోతుల బెడద
కోళ్ల షెడ్డులో తరగతుల నిర్వహణ, విద్యార్థులుండే డార్మెంటరీ రూములపై, ల్యాబ్‌లోకి కోతులు చొరబడుతూ వస్తువులను ధ్వంసం చేస్తున్నాయి. దాంతో కోళ్ల షెడ్డు చుట్టూ సోలార్ ఎలక్ట్రికల్ వైర్స్ ఏర్పాటు చేసినా ఒక్కోమారు ప్రయోజనం లేదు. కోతుల బెడద నుంచి కాపాడుకునేందుకు ప్రత్యేకంగా మరమ్మతులు చేపట్టాల్సి ఉంది.
క్లాస్ రూంలు, ప్రత్యేక గదులు అవసరం
ఇక్కడ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఒకే రూమ్‌లో ఉంటున్నారు. ప్రత్యేకంగా క్లాస్‌రూములు అవసరమన్నాయి. ఈ ఏడాది కౌన్సెలింగ్ తర్వాత నూతనంగా వచ్చే విద్యార్థులకు మారో రెండు క్లాస్ రూమ్‌లు అవసరం. అలాగే విద్యార్థినుల వసతుల కోసం ప్రత్యేక గదులు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది.
వేధిస్తున్న రవాణా కొరత
జిల్లా కేంద్రానికి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కళాశాలకు వెళ్లేందుకు విద్యార్థినులు, అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నారు. యూనివర్సిటీ ఏర్పాటు సందర్భంగా జిల్లా కలెక్టర్ నిధులతో ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసినప్పటికీ దాని సేవలు సరిపోవడం లేదు. బస్సు సౌకర్యం అరకొరగా ఉండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. కళాశాలకు బస్సు సౌకర్యంతోపాటు ట్రాక్టర్, మినీ బస్సు వంటి సౌకర్యాలు కావాలని విద్యార్థినులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు కోరుతున్నారు.
ప్రధాన సమస్యలుగా ప్రహరీ, విద్యుత్
వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాల కావడంతో కాలేజీ చుట్టూ ప్రత్యేకంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసినప్పటికీ ప్రహరీ గోడ లేదు. ప్రాక్టికల్స్‌కు ల్యాబరేటరీలను వినియోగించేందుకు అవసరమైన విద్యుత్ సౌకర్యం లేదు. మిషన్స్ వినియోగానికి ప్రత్యేకంగా విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయాలి. తాత్కాలిక భవనం కావడంతో ఈ ఇబ్బందులు తప్పడం లేదు.
సమస్యలను ఎమ్మెల్యేకు, కలెక్టరుకు వివరించాం
ఎంజేపీటీబీసీడబ్ల్యూ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఉన్న సమస్యలను స్థానిక ఎమ్మెల్యే మెఘారెడ్డికి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి వివరించాం. ప్రధానంగా భవనం, విద్యార్థినుల శిక్షణకు అవసరమైన, వ్యవసాయ యోగ్యమైన భూమి కావాలి. రవాణా సౌకర్యం, విద్యుత్ సమస్య, కోతుల బెడద ఇతర సమస్యలపై విన్నవించాం. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని వారు ఇచ్చారు.
- ప్రశాంతి, ప్రిన్సిపాల్, ఎంజేపీటీబీసీడబ్ల్యూ
అగ్రికల్చర్ యూనివర్సిటీ, వనపర్తి