Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంఏఐతో మానవాళికి తీవ్ర ముప్పు

ఏఐతో మానవాళికి తీవ్ర ముప్పు

- Advertisement -

కృత్రిమ మేధ గాడ్‌ఫాదర్‌ హెచ్చరిక
వాషింగ్టన్‌ :
సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ)తో మానవాళికి తీవ్ర ముప్పు పొంచి ఉందని ‘గాడ్‌ఫాదర్‌ ఆఫ్‌ ఏఐ’గా గుర్తింపు పొందిన జాఫ్రీ హింటన్‌ హెచ్చరించారు. లాస్‌ వెగాస్‌లో జరిగిన ఏఐ4 సమావేశంలో బ్రిటిష్‌-కెనడియన్‌ కంప్యూటర్‌ శాస్త్రవేత్త జాఫ్రీ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఏఐ మానవాళిని తుడిచిపెట్టే అవకాశం ఉందన్నారు. దీనిని నివారించడానికి భావోద్వేగ స్పందనలు కలిగి ఉండేలా ఏఐ వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. మానవుల సంరక్షణ పట్ల వాటికి అవగాహన కల్పించాలని కోరారు. ప్రస్తుతం ఏఐ వ్యవస్థలు మానవుల నియంత్రణలోనే ఉన్నాయని.. ఎప్పటికీ ఇలాగే కొనసాగుతాయని మాత్రం చెప్పలేమని జాఫ్రీ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏఐ మానవమేధస్సును అధిగమించిన తర్వాత మనం పెట్టిన పరిమితులను దాటగలిగే మార్గాలను అన్వేషిస్తుందని హెచ్చరించారు. ఇటీవల ఓ ఏఐ వ్యక్తిగత రహస్యాలు బయటకు చెప్పేస్తానంటూ దాన్ని తయారు చేసిన ఇంజినీర్‌ను బెదిరించడాన్ని జాఫ్రీ గుర్తు చేశారు. భవిష్యత్తులో మానవులు ఇటువంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చన్నారు. ఈ నేపథ్యంలో తల్లిబిడ్డల రీతిలో భావోద్వేగ స్పందనలు కలిగి ఉండేలా ప్రత్యేక ఏఐ వ్యవస్థను రూపొందిచాలని సూచించారు. తద్వారా మానవాళికి ముప్పు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. కాగా.. ఎఐతో ప్రమాదాలు ఉన్నప్పటికీ ఆరోగ్య రంగంలో దాని వినియోగంతో ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చన్నారు. ఔషధ అభివృద్ధి, క్యాన్సర్‌ చికిత్సలో పురోగతి, ముందస్తు రోగ నిర్ధరణ, చికిత్స ప్రణాళికకు ఎంతగానో సహకరిస్తుందని అన్నారు. వచ్చే 5 నుంచి 20 ఏండ్లలో ఏఐ సాంకేతికత అత్యంత అభివృద్ధి చెందిన స్థితిలో మానవ మేధస్సును అధిగమించి, మానవుల నియంత్రణను దాటి వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad