Monday, January 12, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమహిళా హక్కుల సాధనలో ఐద్వా క్రియాశీలక పాత్ర

మహిళా హక్కుల సాధనలో ఐద్వా క్రియాశీలక పాత్ర

- Advertisement -

సంఘం జాతీయ కోశాధికారి ఎస్‌.పుణ్యవతి..14వ మహాసభల నేపథ్యంలో పాట ఆవిష్కరణ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆవిర్భావం నుంచి మహిళల హక్కుల కోసం పోరాడటంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పోరాటాల బాటన సాగుతుందని ఆ సంఘం జాతీయ కోశాధికారి ఎస్‌.పుణ్యవతి తెలిపారు. ఐద్వా 14వ అఖిల భారత మహాసభల నేపథ్యంలో ప్రత్యేకంగా రూపొందించిన పాటను ఆదివారం హైదరాబాద్‌లోని ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1981 మార్చిలో చెన్నరు (నాడు మద్రాస్‌)లో ఆవిర్భావం నుంచి అనేక పోరాటాలు చేసిందని తెలిపారు. అప్పటికే తెలంగాణలో, ఆంధ్ర ప్రాంతంలో వివిధ పేర్లతో మహిళల కోసం పోరాటాలు చేశాయని చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అనేక ప్రజా పోరాటాల్లో మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, చాకలి ఐలమ్మ, మంత్రాల రాములమ్మ, రంగమ్మ తదితరులు పోరాటాలు చేశారని గుర్తుచేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ఆంధ్ర ప్రాంతంలో జమిందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, వెస్ట్‌ బెంగాల్లో తెబాగా పోరాటంతో పాటు వివిధ రాష్ట్రాల్లో పేద ప్రజల పక్షాన జరిగిన పోరాటాల్లోనూ మహిళలది క్రియాశీలక పాత్ర అని చెప్పారు. స్త్రీలకు సమాన హక్కుల కోసం అవిశ్రాంత పోరాటాలు ఐద్వా చేసిందన్నారు. ఒకవైపు అనేక పోరాటాల నేపథ్యంలో హక్కులు సాధించుకుంటే, ప్రజాస్వా మ్యంలో కీలకమైన ఓటు హక్కును కూడా తొలగిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్‌లో సర్‌ పేరుతో 65 లక్షల మంది ఓటర్లను తొలగిస్తే అందులో 65 శాతం మంది మహిళలే ఉన్నారని తెలిపారు.

ఈ నేపథ్యంలో మరోసారి ఐద్వా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతన్న వేళ జరుగనున్న అఖిల భారత మహాసభలు మరింత కీలకం కానున్నాయని తెలిపారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి 28 వరకు జరుగనున్న ఐద్వా అఖిల భారత మహాసభలకు బృందాకారత్‌తో పాటు ఐద్వా జాతీయ నాయకులు, దేశవ్యాప్తంగా 1,000 మంది వరకు ప్రతినిధులు, పరిశీలకులు హాజరు కానున్నట్టు తెలిపారు. ఈ మహాసభల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నట్టు వెల్లడించారు. ఐద్వా పోరాటాలతో దేశవ్యాప్తంగా పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం, గృహ హింస వ్యతిరేక చట్టం, నిర్భయ చట్టం, రాష్ట్రంలో తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకు ఆస్తి హక్కు కల్పించే చట్టం, పొదుపు సంఘాలకు రూ.10 లక్షలు ప్రభుత్వం నుంచి ఇప్పించడం, ఒంటరి మహిళలకు పెన్షన్‌, చీఫ్‌ లిక్కర్‌ను నిలువరించడం వంటి అనేకం ఉన్నాయని ఆమె గుర్తుచేశారు. ఎక్కడ మహిళలు లైంగిక వేధింపులకు గురైనా ఐద్వా పోరాడుతున్నదని తెలిపారు. కేరళ తరహాలో విద్య, వైద్యం ప్రభుత్వ అధీనంలో ఉండాలనీ, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

ఉద్యమ పాట : ఆర్‌.అరుణజ్యోతి
ఐద్వా ఆఖిల భారత 14వ మహాసభల సందర్భంగా మహిళా ఉద్యమాల గురించి చెప్పే పాటను విడుదల చేసినట్టు ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్‌.అరుణజ్యోతి చెప్పారు. ఈ పాట రచన, గాయకులు రేలారే ప్రసాద్‌ ఆలపించారని తెలిపారు. సంగీతాన్ని అఖిలాష్‌ గోస అందించారనీ, ఐద్వా సమర్పణలో మహిళలను చైతన్య పరిచే ఈ పాటను ప్రతి ఒక్కరు వినాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.ఎన్‌.ఆశాలత, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.స్వర్ణలత, నాయకులు లీలావతి, పద్మశ్రీ రాజకుమారి, నీరజ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -