-కిసాన్ సభ ప్రతినిధులకు ఆహ్వాన సంఘం స్వాగతం
చారిత్రాత్మక నల్గొండ గడ్డపై అఖిల భారత కిసాన్ సభ (AIKS) 36వ జాతీయ సదస్సును నిర్వహించడం ఎంతో గర్వకారణమని,దేశం నలుమూలల నుంచి విచ్చేసిన ప్రతినిధులకు ఆహ్వాన సంఘం అధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి హృదయపూర్వక స్వాగతం పలికారు.
1936ఏప్రిల్ 11న లక్నోలో స్వామి సహజానంద్ సరస్వతి అధ్యక్షతన,ఎన్.జి.రంగా వంటి నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటైన కిసాన్ సభ తొమ్మిది దశాబ్దాల ప్రస్థానాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
బెంగాల్ తెభాగా ఉద్యమం,కేరళ పున్నప్ర-వయలార్ పోరాటం,మహారాష్ట్ర వార్లీ ఆదివాసీ పోరాటంతో పాటు,నిరంకుశ నిజాం పాలన,రజాకార్లు మరియు భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం (దున్నేవాడిదే భూమి)దేశ చరిత్రలో మైలురాళ్ళని కొనియాడారు.
నేడు వ్యవసాయ ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరగడం,పంటలకు తగిన మద్దతు ధర లభించకపోవడం,అప్పుల భారంతో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
సమగ్ర వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని చట్టబద్ధమైన కనీస మద్దతు ధర (MSP)కల్పించాలని,ప్రభుత్వ సేకరణ వ్యవస్థను బలోపేతం చేయాలని,కౌలు రైతులు,వ్యవసాయ కూలీలు మరియు మహిళా రైతుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో సాగిన రైతుల పోరాటం అందించిన స్ఫూర్తితో,కార్పొరేట్ శక్తుల వ్యతిరేక విధానాలపై రైతులు,కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
నల్గొండలో జరిగే ఈ రెండు రోజుల జాతీయ సదస్సును ఒక ప్రజా ఉద్యమ ఉత్సవంగా నిర్వహించడానికి,కళాకారులు,ప్రజల సహకారంతో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.







కామెంట్లు (0)