అందరి భాగస్వామ్యంతో నివారణ చర్యలు : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 80 లక్షల మంది మరణిస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. అందరి భాగస్వామ్యంతో కాలుష్య నివారణ చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ మేరకు గురువారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో తెలంగాణ ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో గాలి నాణ్యత సూచీ, గాలి నాణ్యత నిర్వహణపై నిర్వహించిన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ విషయంలో ప్రజల సహకారం లేకుండా ఏ ప్రభుత్వమైనా లక్ష్యం చేరుకోలేదని తెలిపారు. ఈ విషయంలో సంబంధిత శాఖల అధికారులు దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, నిపుణులతో కలిసి క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి సూచనలు చేయాలని కోరారు. జ్ఞానం విధానంగా మారాలనీ, ఆ విధానం కార్యాచరణ రూపం దాల్చాలనీ, ఆ కార్యాచరణతో ఫలితాలు రావాలని భట్టి తెలిపారు. గాలి నాణ్యత కొలమానాలు కేవలం దానికే పరిమితం కాదనీ, ఆ కొలమానాలు ప్రజల ఆరోగ్యం, ఉత్పత్తి, ఆర్థికవృద్ధిపై ప్రభావం చూపిస్తాయని తెలిపారు.
గాలి నాణ్యత పర్యవేక్షణకు రాష్ట్రంలో 40 కొత్త స్టేషన్లను ఏర్పాటు చేసినట్టు భట్టి వెల్లడించారు. త్వరలో గాలి నాణ్యత డాష్ బోర్డులను ప్రారంభించనున్నట్టు తెలిపారు. వాయు కాలుష్యంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతి ఏటా నాలుగు ట్రిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లుతోందని చెప్పారు. రాష్ట్రంలో గాలి శుభ్రత కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నట్టు తెలిపారు. స్వచ్ఛమైన రవాణా కోసం ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ, ఈ -బస్సులు, మెట్రో విస్తరణ, పరిశ్రమల నియంత్రణ, పునరుత్పాదక శక్తిని ఎక్కువగా ఉపయోగించుకోవడం, 2030 నాటికి 20 వేల మెగావాట్ల లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు వెల్లడించారు. నివాస ప్రాంతంలో జరిగే పరిశ్రమల ప్రమాదం పెద్ద విపత్తుగా మారొచ్చని ఆయన హెచ్చరించారు. దీని నివారణకు పరిశ్రమల పునర్వ్యవస్థీకరణ, జోనింగ్ సంస్కరణలు, మెరుగైన భూ వినియోగ ప్రణాళికలను తీవ్రంగా పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాశ్ జ్యోతి, రాష్ట్ర పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీం, రవాణాశాఖ కార్యదర్శి ఇలంబర్తి, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి జి.రవి తదితరులు పాల్గొన్నారు.



