ఆ మిట్ట మధ్యహ్నం తెలుగు క్లాస్‌లో అతడి కవితల్ని పాఠంగా చదవకపోయుంటే నాలో ఈ రెండు వాక్యాలు కదలకపోయి ఉండేవి. అతడు నా లోలోపల పెను బాధను రంగిలించక పోయుంటే ఇవ్వాళ నాలో కవితా సజనదీపం వెలిగేదే కాదు. బొత్తిగా ఏమీ తెలియని పదిహేనేళ్ళ నన్ను పెన్ను పట్టుకొని తెల్సితెలియని మాటల్ని రాసేలా కదిలించింది మాత్రం అలిశెట్టి ప్రభాకర్ కవితలే. ఆయన బాధను రాశాడు. పట్టించుకోని లోకం బాధలను రాసేసి పోయాడు.
నా బాధని నేనెందుకు రాయకూడదనే ప్రయత్నమే ఇక్కడిదాక తీసుకొచ్చింది. అలిశెట్టి ప్రభాకర్ నాకొక స్ఫూర్తి. ఆయన బొమ్మలన్న, కవితలన్న ఎనలేని ప్రేమ.
ఆయన నడిచొచ్చిన దారులంటే గౌరవం. నా పదవ తరగతి తెలుగులో ‘నగర గీతం’ పాఠం నా భావాలకు రాపిడి పుట్టించింది. నాలోపలి ఆలోచనలు వాక్యాలుగా మలిచింది. ఆ తర్వాత అలిశెట్టిని చదువుతున్న కొద్దీ సమాజ లోతులను అర్థం చేసుకోవడం మొదలయ్యింది. నగరంలో ఇరుకు లోతులను తవ్వితీశాడు. మతం చేసే హింసలను అక్షరాల ప్రశ్నలతో బహిర్గతం చేయగలిగాడు. ప్రభుత్వాల తప్పులను ఎత్తిచూపాడు. అవసరమైన చోట చురకలు పెట్టాడు. మాములు పదాలతో బీభత్సమైన శబ్దం చేయగలిగాడు. అలిశెట్టిని చదువుకున్న తర్వాత జీవితం కవిత్వం వేరు కాదని తెల్సింది. సమాజాన్ని పరిశీలనగా చూడాల్సిన అవసరముందని తెల్సింది. చిన్న చిన్న వాక్యాలు కరెంట్ షాక్ కొట్టిస్తాయని. అబద్దాలను అతలాకుతలం చేస్తాయని అర్ధమయ్యింది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై అలిశెట్టి విరుచుకుపడిన విధానమే నాకు స్పూర్తినిచ్చి ఇవ్వాళ నల్లని చీరకట్టుకున్న తల్లి కవిత, జత కళ్ళు జతలజతల కళ్ళు కవిత రాయగలిగాను. చాలి చాలని ఖర్చులను భరిస్తున్న నన్ను రెండు ఆకాశాల కవిత రాసేలా చేసింది. అమ్మలోపల దుఃఖపు పొరను చూడగలిగానంటే అలిశెట్టి తన భార్యను అర్థం చేసుకున్న తీరును చదివడమే. అలిశెట్టి నగరాన్ని రాసిన విధానమే ఊర్లో నాన్నని చెమట పద్యంగా రాసుకునేలా చేసింది. మినీ కవితలు రాసిన దీర్ఘకవితలు రాసిన ఏది రాసిన అలిశెట్టి చేయాల్సిన పని చేశాడు. రాయగలిగింది అవసరమైనది రాశాడు. నిలబడాల్సిన ప్రజల గొంతుగా నిలబడ్డాడు. అలిశెట్టి ఆయుధాలను విసిరేసిపోలేదు వాక్యాలతో అజ్ఞానాన్ని మూఢత్వాన్ని, నిర్లక్ష్యాన్ని, కదిలించిపోయాడు. బక్కపల్చగా కెమెరా పట్టుకొని కనిపించే అలిశెట్టి రాసిన బలమైన వాక్యాలను నిరంతరంగా మననం చేసుకోవాలి. మనలోపలికి అవాహన చేసుకోవాలి. బతికినంత కాలం వాస్తవాలను దశ్యాలు దశ్యాలుగా కళ్ళలోకి.. గుండెల్లోకి దింపిన ఆ అక్షరాలు బహుశా నా ఒక్కడికే కాదు ఈ తరానికి రాబోయే తరానికి ఆదర్శమే.
– పేర్ల రాము, 9642570294
అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం
- Advertisement -
- Advertisement -