ఎప్పటిలాగే మనం
రోజూ మాట్లాడాలనుకుంటాం
అయినా కొన్ని వారాలదాకా
తంత్రీహాసంలో నిశ్శబ్దం
ఉక్కిరిబిక్కిరి చేస్తుంది
కారణం తెలియని కలవరం
చుట్టూరా పరిభ్రమిస్తుంది
ఈస్టిండియా పాలన గురించో
ఈశాన్య రాష్ట్రాల ఉద్యమం వల్లనో
అయినవీకానివీ ఆపాదించుకొని ఉద్రేకపడినందుకా
శాతవాహనులలో విష్ణుకుండినులలో
ఎవరు దమ్మను శిరసావహించారనే
రచ్చ నిట్టనిలువుగా చీలినందుకా
పక్షుల భాషను
అనువదించినప్పుడు జారిపోయిన
నుడికారం ఎత్తిచూపి విలాసంగా నవ్వినందుకా
మా ప్రాంగణంలో పిట్టలకు
మీ కాంపౌండులో మొక్కలకు
ఒకటే వయసైనా
గోలలో తేడా ఉందన్న ధిక్కారానికా
అవ్యవస్థపై నీ అసహనాన్ని కూడా
మధురిమగా తడిసే
నా మనోయవనిక మీద
ఏ అక్షరమూ నమోదుకాని విభావరిలో నేను
కల్లోల పడికూడా
నీ ఇష్టులంతా నా వాళ్ళుగా
నా పరిసరాలన్నీ నీవి అయినట్లుగా
భావనలు బల పరుచుకుంటున్నప్పుడు
ఒక ఇంద్రజాలం లా నువు కనెక్టవుతావు
కారణాలను ఒక తాత్విక గాథతో
కలిపి కుడతావు
అది మనసంతా నింపుకొని
నేనొక పరిమళభరితమైన వసంతాన్నౌతాను
నిజానికి మనం మన గురించి కాదు
మహా లోకాన్ని వ్యాఖ్యానించే
కావ్యాలంకారాలం
– డా కాచాపురం దుర్గాదేవి
7893093495