– ఏడు గురి పేర్లతో కేంద్రం ప్రకటన
– ప్రపంచానికి ఆపరేషన్ సిందూర్ సందేశం
– ఈనెల 22 నుంచి జూన్ మొదటి వారం వరకు పర్యటన
– కాంగ్రెస్ పంపిన జాబితాలో పేరు లేకున్నా…శశిథరూర్‌ను ఎంపిక చేసిన కేంద్రం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఆపరేషన్ సిందూర్ సందేశాన్ని ప్రపంచ దేశాలకు తీసుకెళ్లేందుకు, పాకిస్తాన్ కుట్రలను వివరించేందుకు దేశంలోని రాజకీయ పార్టీల నేతలతో కూడిన ఏడు అఖిలపక్ష బృందాలు విదేశాల్లో పర్యటించనున్నాయి. ఆ ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే ఏడుగురు ఎంపీల పేర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం అధికారికంగా ప్రకటించింది. ఎంపీలు శశిథరూర్ (కాంగ్రెస్), రవిశంకర్ ప్రసాద్ (బీజేపీ), బైజయంత్ పాండా (బీజేపీ) సంజరు కుమార్ ఝా(జేడీయూ), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్‌సీపీ -సీపీ), శ్రీకాంత్ శిండే (శివసేన) విదేశాల్లో భారత బందాలకు నాయకత్వం వహించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. వీరి నేతత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడు బృందాలు పది రోజుల వ్యవధిలో ఐదు దేశాలకు వెళ్తాయి. మే 22న ఈ బందాలు బయలుదేరి, జూన్ మొదటి వారంలో తిరిగి వస్తాయి. ఆరు నుంచి ఏడుగురు ఎంపీలు ఉన్న ప్రతి ప్రతినిధి బృందం నాలుగు నుంచి ఐదు దేశాలను సందర్శించవచ్చు అని వర్గాలు తెలిపాయి.అమెరికా ప్రతినిధి బృందానికి శశిథరూర్, రష్యా ప్రతినిధి బృందానికి కనిమొళి, సౌత్ ఆఫ్రికా (ఒమన్, కెన్యా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్) ప్రతినిధి బృందానికి సుప్రియా సూలే, ఆఫ్రికా ప్రతినిధి బృందానికి శ్రీకాంత్ షిండే, గల్ఫ్ దేశాల (సౌదీ అరేబియా, కువైట్, బర్మన్, అల్జీరియా)కు రవి శంకర్ ప్రసాద్, జపాన్ సింగపూర్, దక్షిణ కొరియా, మలేషియా, ఇండోనేషియాకు సంజరు కుమార్ ఝా నేతృత్వం వహిస్తారు. అమెరికా ప్రతినిధి బృందానికి శశిథరూర్ నాయకత్వం వహించనుండగా బృందంలో శాంభవి చౌదరి, సర్ఫరాజ్ అహ్మద్, సుదీప్ బందోపాధ్యారు, హరీష్ బాలయోగి, శశాంక్ మణి ప్రతిపాఠి, భువనేశ్వర్ కలిత, మిలంద్ దేవర ఉన్నారు. వీరితోపాటు అమెరికా మాజీ రాయబారి రణ్‌జిత్ సింగ్ సంధు, ఐఒఆర్ డెర్కటర్ వరుణ్ జెఫ్ కూడా ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన సల్మాన్ ఖుర్షీద్, మనీష్ తివారీ, అమర్ సింగ్, సీపీఐ(ఎం)కు చెందిన జాన్ బ్రిట్టాస్, టీఎంసీకి చెందిన సుదీప్ బందోపాధ్యాయ, ఎంఐఎంకు చెందిన అసదుద్దీన్ ఒవైసీ, బీజేడీ సస్మిత్ పాత్రా, ఐయుఎంఎల్‌కు చెందిన ఇటి మొహమ్మద్ బషీర్, శివసేనకు చెందిన ప్రియాంక చతుర్వేది, జెఎంఎంకు చెందిన సర్ఫరాజ్ అహ్మద్, ఆప్ కు చెందిన విక్రమ్‌జిత్ సాహ్నే, బీజేపికి చెందిన అనురాగ్ ఠాకూర్, అపరాజిత సారంగి, రాజీవ్ ప్రతాప్ రూడీ, సమిక్ భట్టాచార్య, బ్రిజ్ లాల్ కూడా వివిధ బృందాల్లో ఉన్నారు. ఏడు ప్రతినిధి బృందాల్లో నాలుగింటికి అధికార ఎన్డీఏ, మూడింటికి ప్రతిపక్ష ఇండియా బ్లాక్ సారథ్యం వహించనున్నాయి. ఒక్కో డెలిగేషన్ సుమారు ఐదు దేశాల్లో పర్యటిస్తుందని, ప్రతి టీమ్‌తోనూ పలువురు ప్రముఖ దౌత్యవేత్తలు ఉంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఎంపీల జాబితా పంపాలంటూ అన్ని పార్టీలను కేంద్ర ప్రభుత్వం కోరింది. అనంతరం ప్రతినిధుల బృందం జాబితాను ప్రకటించింది.
కాంగ్రెస్ పంపిన జాబితాలో పేరు లేకున్నా…: శశిథరూర్‌ను ఎంపిక చేసిన కేంద్రం
కాంగ్రెస్ పంపిన జాబితాలో శశిథరూర్ పేరు లేకపోయినా అనూహ్యంగా ఆయనను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రభుత్వం ”దుర్మార్గపు మనస్తత్వం”తో ”గేమ్స్ ఆడుతోందని” ఆయన ఆరోపించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌తో మాట్లాడినట్టుచెప్పారు. పాక్ ఉగ్రవాదంపై భారత్ వైఖరిని ప్రపంచదేశాలకు వివరించేందుకు విదేశాలకు పంపే ప్రతినిధుల బృందాలకు నలుగురు ఎంపీల పేర్లను ప్రతిపాదించాలని కోరినట్టు చెప్పారు. ఆయన విజ్ఞప్తి మేరకు శుక్రవారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోరు, సయ్యద్ నసీర్ హుస్సేన్, రాజ బ్రార్ పేర్లను పంపినట్టు చెప్పారు. కాంగ్రెస్ పంపిన ప్రతిపాదనలో థరూర్ పేరు లేదని వెల్లడించారు. అయితే, కేంద్రం అనూహ్యంగా ఆయన్ని ఎంపిక చేసిందంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
విదేశాలకు అఖిలపక్ష బృందాలు
- Advertisement -
- Advertisement -