Wednesday, September 24, 2025
E-PAPER
Homeజాతీయంకృష్ణా జలాల్లో 763 టీఎంసీలు కేటాయించండి

కృష్ణా జలాల్లో 763 టీఎంసీలు కేటాయించండి

- Advertisement -

కేడబ్ల్యూడీటీ ముందు తెలంగాణ ప్రభుత్వ వాదనలు
ట్రిబ్యునల్‌ విచారణకు హాజరైన మంత్రి ఉత్తమ్‌
కృష్ణా-గోదావరి జలాల్లో హక్కుల కోసం రాజీలేని పోరాటం
అల్మట్టి ఎత్తు పెంపు అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కృష్ణా నది జలాల్లో తెలంగాణకు 763 టీఎంసీలు కేటాయించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. క్యాచ్‌మెంట్‌ ఏరియా, బేసిన్‌లోని జనాభా, కరవు ప్రాంతం విస్తీర్ణం, సాగు భూములు వంటి అంశాల ఆధారంగా లెక్కలు వేసామన్నారు. తద్వారా 75 శాతం డిపెండబుల్‌ వాటర్‌లో 555 టీఎంసీలు, 65 శాతం డిపెండబుల్‌ వాటర్‌లో 43 టీఎంసీలు, సగటు ప్రవాహాల నుంచి 120 టీఎంసీలు, గోదావరి డైవర్షన్‌ (మళ్లింపు) నుంచి మొత్తం 45 టీఎంసీలు తెలంగాణకు రావాలని కోరుతున్నామన్నారు. ఈ విషయంలో తెలంగాణకు న్యాయమైన వాటా రావాలని ,కృష్ణా జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ)-2 ముందు బలమైన వాదనలు వినిపిస్తున్నట్టు చెప్పారు. గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలో నీటి కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఆ చారిత్రాత్మక తప్పిదాన్ని సరిచేస్తూ, నిబద్ధతతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. కృష్ణా నదిలో ఏపీ, తెలంగాణ కేటాయింపుల వివాదంపై సోమవారం బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ విచారణ ప్రారంభించింది. మూడు రోజులు (23, 24,25) పాటు సాగే ఈ విచారణలో తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపిస్తోంది.

ఈ విచార ణకు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, అధికారులతో కలిసి ట్రిబ్యునల్‌ ముందు హాజరయ్యారు. తొలిరోజు విచారణ తరువాత, ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నీటి వాటాలపై ఫిబ్రవరి నుంచి రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపిస్తుందని చెప్పారు. ఇది తుది వాదనలుగా భావిస్తున్నామన్నారు. తెలంగాణకు న్యాయమైన వాటా రావాలని తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది వైథ్య నాథన్‌ ట్రిబ్యునల్‌ ముందు వాదనలు వినిపిస్తున్నారని చెప్పారు. ఉమ్మడి ఏపీకి మొత్తం 1,050 టీఎంసీలలో దాదాపు 70 శాతం అంటే…. 763 టీఎంసీలను తెలంగాణకు కేటాయించాలని కోరుతున్నట్టు చెప్పారు. జల వివాదాలకు సంబంధించిన ఒక ఒక ట్రిబ్యు నల్‌ ముందు నీటి పారుదల శాఖ మంత్రి హాజరుకావడం బహుశా దేశంలో ఇదే మొదటి సారి కావొచ్చని చెప్పారు. దీన్నిబట్టి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ అంశాన్ని ఎంతగానో సీరియస్‌గా తీసుకుంటుందో అర్థం అవుతుందన్నారు. తెలంగాణకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

అదనపు నీటిని వినియోగించే స్వేచ్చ కూడా మాదే…
కృష్ణా ట్రిబ్యునల్‌-2 ఉమ్మడి ఏపీకి మొత్తంగా 1,005 టీఎంసీలు కేటాయించిందని గుర్తు చేశారు. ‘వీటిలో 811 టీఎంసీలు 75 శాతం నీటి లభ్యత ఆధారంగా, 49 టీఎంసీలు 65 శాతం డిపెండబిలిటీ ఆధారంగా, 145 టీఎంసీలు సగటు ప్రవాహాల ఆధారంగా కేటాయించ బడ్డాయి. అదనంగా గోదావరి డైవర్షన్‌ (మళ్లింపు)తో మరో 45 టీఎంసీలు కలిపి మొత్తంగా 1,050 టీఎంసీలు కేటాయించబడ్డాయి.’ అని వివరించారు. అలాగే సగటు ప్రవాహాల కంటే ఎక్కువగా వచ్చే నీటిని వినియోగించు కోవచ్చని ట్రిబ్యునల్‌ స్వేచ్ఛ నిచ్చిందని చెప్పారు. అయితే తెలంగాణ ఏర్పాటు తరువాత కొత్తగా బేసిన్‌ పారామీటర్ల ఆధారంగా రాష్ట్ర వాటాను కోరుతున్నట్టు చెప్పారు.

రాష్ట్ర వాటా కింద కృష్ణాలో 70 శాతం అంటే 763 టీఎంసీలు రాష్ట్రానికి దక్కాలన్నారు. ‘తెలంగాణది శాస్త్రీయమైన డిమాండ్‌. జాతీయంగా, అంతర్జాతీయంగా అంగీకరించ బడిన పారామీటర్ల మీద ఆధారపడి మా వాటా కోరుతున్నాం. మొత్తంగా ఇది 763 టీఎంసీలు గా అవుతుంది. సగటు ప్రవాహాలపై మిగిలిన అదనపు నీటిని వినియోగించే స్వేచ్ఛ కూడా తెలంగాణదే’ అని ఆయన స్పష్టం చేశారు. ఏపీ తనకు కేటాయించబడిన 811 టీఎంసీల్లో పెద్ద భాగాన్ని బేసిన్‌ వెలుపలికి మళ్లించిందని విమర్శించారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం ఇలాంటివి ఆపాలని, బదులుగా ప్రత్యామ్నాయ వనరులను వినియో గించాలని ట్రిబ్యునల్‌ ముందు వాదిస్తున్నట్టు చెప్పారు.

రైతులు, కరువు ప్రాంతాలకు బీఆర్‌ఎస్‌ అన్యాయం
మొత్తం 811 టీఎంసీల్లో… కేవలం 299 టీఎంసీలను తెలంగాణకు, 512 టీఎంసీలు ఏపీకి కట్టబెడుతూ గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ లోని పెద్దలు(కేసీఆర్‌, హరీశ్‌ రావు) లు ఒప్పందం చేసుకున్నారని ఉత్తమ్‌ విమర్శించారు. పదేండ్లు ఈ ఒప్పందానికి బీఆర్‌ఎస్‌ కొనసాగించిందని ఫైర్‌ అయ్యారు. తద్వారా కృష్ణా పరిసర ప్రాంతాల్లోని రైతులకు, కరవు ప్రాంతాల ప్రజలకు తీరని అన్యాయం చేసిందన్నారు. అందుకే ఇప్పుడు ఆ ఫైలును మళ్లీ తెరిచి మొదటి నుంచి వాదనలు వినిపిస్తున్నట్టు చెప్పారు. ‘299 టీఎంసీలు అంగీకరించిన గత ఒప్పందం, మేం కోరుతున్న 763 టీఎంసీల మధ్య వ్యత్యాసమే ఈ అన్యాయానికి నిదర్శనం,” అని అన్నారు. కేంద్రజలశక్తి మంత్రిత్వశాఖ ఈ ఒప్పందాన్ని అంగీకరించిందని, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా తిరస్కరిస్తున్నట్టు స్పష్టం చేశారు.

ట్రిబ్యునల్‌ న్యాయమూర్తి బ్రిజేశ్‌ కుమార్‌ నేతృత్వంలోని విచారణలో తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ”మేము మా వాదనలను అన్ని ఆధారాలతో సమర్పించాం. ఈ సారి తెలంగాణకు న్యాయం జరుగుతుం దనే నమ్మకం ఉంది,” అని అన్నారు. ”డిపెండబుల్‌ ఫ్లోస్‌ అయినా, సగటు ప్రవాహాలు అయినా, అదనపు నీరు అయినా, గోదావరి డైవర్షన్లు అయినా… తెలంగాణ తమ హక్కు కోసం పోరాడుతుంది. చారిత్రక అన్యాయం ఇకపై కొనసాగదు. తెలంగాణ తన హక్కు దక్కించుకుంటుంది,” అని అన్నారు. రాష్ట్ర నీటి వాటాపై ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గదని తేల్చి చెప్పారు.

ఏ ప్రభుత్వం ఉన్నా ఒక్క చుక్కా వదులుకోం… ఆల్మట్టి ఎత్తును వ్యతిరేకిస్తున్నాం…
పొరుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణ నీటి వాటాపై రాజీపడబోదని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. ”కర్నాటకలో కాంగ్రెస్‌ ఉన్నా, ఏపీలో టీడీపీ, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నా… తెలంగాణ తమ హక్కుల కోసం కఠినంగా పోరాడుతుంది. ఒక్క చుక్క నీళ్లను కూడా వదులుకోదు,” అని తేల్చి చెప్పారు. అల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచే కర్ణాటక యోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అలాంటి నిర్ణయం తెలంగాణకు నేరుగా నష్టం చేస్తుందని హెచ్చరించారు. దీనిని అడ్డుకోవడానికి సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామన్నారు. ”మా ప్రభుత్వ అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది. తెలంగాణ వాటా తగ్గించే చర్య ఏదీ అనుమతించం. అల్మట్టి ఎత్తు పెంపు అనుమతించకుండా సుప్రీంకోర్టులో పోరాడతాం,” అని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్నదని, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వయంగా ఈ కేసుపై సమీక్ష సమావేశం నిర్వహించి, పూర్తి స్థాయి వాదనలు వినిపించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ఉత్తమ్‌ తెలిపారు. ”ఇది కేవలం న్యాయ పోరాటం మాత్రమే కాదు, రైతుల జీవనాధారానికి, కరవు ప్రాంతాల భవిష్యత్తుకు సంబంధించినది,” అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -