– పశ్చిమాసియాలో యుద్ధాన్ని ఖండిస్తూ జన్ ఆక్రోశ్ ర్యాలీలో సీపీఐ(ఎం) తీర్మానం
– గ్యాస్ ధర తగ్గించాలి !
– సిలిండర్లు అందుబాటులో వుండేలా చూడాలని డిమాండ్
న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో యుద్ధాన్ని రగిల్చిన అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. గాజా, వెనిజులాపై దాడులకు పాల్పడి, తదనంతరం ఇరాన్‌పై యుద్ధానికి దిగిన అమెరికా, ఇజ్రాయిల్ తాజాగా క్యూబాపై కన్ను వేయడాన్ని కూడా సిపిఎం తీవ్రంగా నిరసించింది. ఈ మేరకు రామ్‌లీలా మైదాన్‌లో మంగళవారం జరిగిన జన్ ఆక్రోశ్ ర్యాలీలో ఒక తీర్మానాన్ని సీపీఐ(ఎం) ఆమోదించింది. గ్యాస్ ధరతో పాటూ నిత్యావసరాల ధరలు తగ్గించాలని, గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా అందరికీ అందుబాటులో వుండేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరింది. తీర్మానం పూర్తి పాఠం : ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ జరుపుతున్న యుద్ధం మన జీవితాలపై పెను ప్రభావాన్నే చూపుతోంది. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం పరిస్థితులను అంచనా వేయడంలో, అవసరమైన చర్యలు తీసుకోవడంలో విఫలం కావడంతో, చిన్న చిన్న గ్రామాల్లో కూడా గ్యాస్ సిలిండర్లకు కొరత ఏర్పడింది. అంతేకాకుండా, ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్ ధరలను పెంచేసింది. ఫలితంగా కూరగాయలు, బియ్యం, ఇతర నిత్యావసరాల ధరలు పెరిగిపోయి మనపై భారాన్ని పెంచాయి. ఇరాన్‌ఫై జరుగుతున్న దాడుల్లో ఆ దేశ కీలక నేతలతో సహా వేలాదిమంది మరణించారు. వారి దురాక్రమణలో అన్నింటికంటే అమానవీయమైన సంఘటన అంటే పాఠశాలపై దాడి జరపడం, ఆ దాడిలో 160మందికి పైగా విద్యార్ధినులు, టీచర్లు మరణించారు.
ఇరాన్‌పై దాడికి ముందు, గాజాపై ఇజ్రాయిల్, అమెరికా ఊచకోతకు పాల్పడ్డాయి. వెనిజులా అధ్యక్షుడు మదురో దంపతులపై అమెరికా దాడి చేసి, వారిని కిడ్నాప్ చేసింది. భారత నావికాదళం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతున్న ఇరాన్ నౌకపై బాంబుదాడులకు పాల్పడ్డారు. క్యూబాపై ఆర్థిక దిగ్బంధనాన్ని అమెరికా మరింత ఉధృతం చేసింది. ఇప్పుడు క్యూబాలో సోషలిస్టు వ్యవస్థనే నిర్మూలిస్తామని బెదిరిస్తోంది.
ఈ దాడులన్నింటినీ ఖండించడానికి బదులుగా, బీజేపీ ప్రభుత్వం అమెరికా, ఇజ్రాయిల్‌తో అంటకాగుతోంది. బీజేపీ హయాంలో భారతదేశం అమెరికాకు లొంగివుండే మిత్రపక్షంగా మారిపోయింది.
ఇరాన్, పాలస్తీనాలపై అమెరికా, ఇజ్రాయిల్ దాడులను బిజెపి ప్రభుత్వం ఖండించాలని మేం డిమాండ్ చేస్తున్నాం. గల్ఫ్, పశ్చిమాసియాల్లో నివసిస్తున్న భారతీయుల ప్రాణాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి. ఈ యుద్ధాన్ని తక్షణమే ఆపాలి.ధరల పెరుగుదలను అణచివేయాలని, గ్యాస్ ధర తగ్గించాలని, అవసరంలో వున్న వారందరికీ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో వుండేలా చూడాలని జన్ ఆక్రోశ్ ర్యాలీకి ఇక్కడ హాజరైన మనమందరం డిమాండ్ చేస్తున్నాం.
అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



