Saturday, November 22, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఅమెరికా అంటే ట్రంప్‌ ఒక్కడే కాదు

అమెరికా అంటే ట్రంప్‌ ఒక్కడే కాదు

- Advertisement -

‘అమెరికాకు పూర్వ వైభవం’ తీసుకువస్తాను అన్న జాతీయవాద నినాదంతో అధికారంలోకి వచ్చిన ‘డొనాల్ట్‌ ట్రంప్‌’ పాలన వర్గ వైరుధ్యాలతో కూడుకుని, నయా ఉదార విధానాలను మరింత దూకుడుగా అమలు చేసే దిశగా కొనసాగుతున్నది. ప్రభుత్వ వ్యయంలో భారీ కోతలు, ఫెడరల్‌ విభాగాల్లో ఉద్యోగుల తొలగింపులు, విభాగాల మూసివేతల ద్వారా ట్రంప్‌ అధ్యక్షతన అమెరి కన్‌ అధికార యంత్రాంగం కార్మికవర్గ ప్రయోజనా లను పణంగా పెట్టి బడా బూర్జువా వర్గానికి లబ్ధి చేకూర్చడం లో తరించిపోతున్నది. తద్వారా, పెట్టుబడి దారీ పాలనపై ఉన్న శాస్త్రీయ విమర్శ సరైనవని రుజువు చేస్తుంది. ప్రభుత్వ వ్యయంలో ఎక్కడెక్కడ ఏ మేరకు కోతలు విధించవచ్చో సిఫార్సు చేయడానికి ఏకంగా ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియన్సీ’ని (ప్రభుత్వ పని సామర్ధ్యాన్ని పెంపొందించే విభాగం) ట్రంప్‌ నెలకొల్పాడు.

ఈ విభాగం ప్రజా సంక్షేమం, మానవీయ సాయం, నియంత్రణలను పర్యవేక్షించే యు.ఎస్‌.ఎయిడ్‌, వినియోగ దారుల ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణా బోర్డు వంటి విభాగాలకు కేటా యించే నిధుల్లో భారీగా కోతలు విధించింది. 2025 తొలినాళ్లలోనే దాదాపు పదివేల మంది ఫెడరల్‌ ఉద్యోగులను తొలగించింది. ఈ చర్యల మూలంగా అట్టడుగు స్థాయి ఉద్యోగులు తీవ్రంగా దెబ్బతిన్నారు. ‘పెట్టుబడి సంచయానికి తోడ్పడని రాజ్య విధానాలను బలిపెట్టడానికి పాలకవర్గాలు ఏ మాత్రం వెనుదీయవు’ అన్న కారల్‌ మార్క్స్‌ వ్యాఖ్యానాన్ని అమెరికన్‌ పాలక వర్గాలు సరైనదని నిరూపించాయి. పై చర్యల మూలంగా 160 బిలియన్‌ డాలర్ల ప్రభుత్వ వ్యయాన్ని ఆదా చేశామని ట్రంప్‌ అధికార యంత్రాంగం గొప్పలు పోతున్నది. కానీ ఉద్యోగుల తొలగింపు, నిర్వహణా విభాగాల మార్పులు, ప్రజా సంక్షేమంలో కోతల మూలంగా వాటిల్లిన నష్టం లెక్కకు అందనిది.

ప్రభుత్వ హయాంలో ఆదా అనేది లెక్కలను తొత్తడం తప్ప మరొకటి కాదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ‘పొదుపు చర్యల’ పేరిట నయా ఉదారవాద విధానాలు పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభ భారాన్ని కార్మిక వర్గం మీదకు నెట్టేస్తాయి. కార్మికవర్గ ఉమ్మడి బేర సారాల శక్తిని, ఆరోగ్యాన్ని, సామాజిక సంక్షేమ పథకాలను దెబ్బతీస్తాయి. పెట్టుబడి సంస్థాగత హింసోన్మాదానికి ప్రతిరూపమే ఈ చర్యలు. ట్రంప్‌ అధికార యంత్రాంగం, ‘ప్రభుత్వ పని తీరు సామర్థ్యం పెంపు విభాగం’ ప్రజా సంక్షేమం, మానవీయ సాయం, వినియోగ దారుల ఆర్థిక ప్రయోజనాల సంరక్షణా విభాగాలను కుదించడానికో, రద్దు చెయ్యడానికో నడుం బిగించాయి. ‘రాజ్యం-విప్లవం’లో లెనిన్‌ ప్రతిపాదిత సిద్ధాంతం చెప్పేది కూడా ఇదే- ‘పెట్టుబడిదారీ రాజ్యాలు ఆర్థిక సంక్షోభాన్ని చవిచూసినప్పుడల్లా పున:పంపిణీకి సంబంధించిన కార్యక్రమాలను కుదించో లేక రద్దుచేసో పెట్టుబడిదారీ కూలీన వర్గాధికారాన్ని మరింత బలోపేతం చేస్తాయి”.

పని సామర్థ్యాన్ని పెంపొందించే పేరిట అమెరికన్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. పైస్థాయి ఉద్యోగులు, విభాగాధిపతులు మాత్రం ‘ప్రోత్సాహకాల’ పేరిట దండుకోవడానికి నిధులు మిగుల్చుకున్నది. ఆర్థిక సంక్షోభం ఎదురైనప్పుడుల్లా పెట్టుబడిదారీ ఎజెండా ఎలా నడుస్తుందనేదానికి ఇది ఒక తాజా ఉదాహరణ.
2025 అక్టోబరు ఒకటి నుండి అమెరికన్‌ ఫెడరల్‌ ప్రభుత్వం మూసివేత (షట్‌డౌన్‌)కు గురయ్యింది. 2026 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్‌ అమెరికన్‌ కాంగ్రెస్‌ (చట్టసభ) ఆమోదం పొందకపోవడం మూలంగా ఫెడరల్‌ ప్రభుత్వం మూత పడాల్సిన పరిస్థితి ఎదురైంది. అమెరికా చరిత్రలోనే ఇది దీర్ఘకాలంపాటు సాగిన ప్రభుత్వ మూసివేత. ఈ షట్‌డౌన్‌ మూలంగా ఫెడరల్‌ ప్రభుత్వం వివిధ విభా గాలకు, రాష్ట్రాలకు చెల్లించాల్సిన నిధులు, గ్రాంట్లు, రుణాలు అన్నీ స్తంభించిపోయాయి. దాంతో బీమా సౌకర్యం ద్వారా ఆరోగ్య సేవలు, ప్రజలకందాల్సిన సంక్షేమ నిధులు నిలిచిపోయి లక్షలాది కార్మిక కుటుంబాలు ఇక్కట్ల పాలయ్యాయి. రాజ్యం సంపద కొమ్ము కాస్తూ ప్రజల పట్ల తన బాధ్యతలను విస్మరించే ‘బూర్జువా నియంతృత్వానికి’ కొనసాగింపే ఈ చర్య.

ట్రంప్‌ విధానాలు సంప్రదాయ మితవాద పోకడలతో (టారిఫ్‌ల మోత, సంక్షేమంలో కోత, సంపన్నులకు పన్నుల తగ్గింపు) పాటు ప్రయివేటు రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంపొందించే ‘రాజ్య పెట్టుబడిదారీ విధానానికి’ నకలు వంటివి. రక్షిత విధానాలు అవలంభిస్తున్నానని ట్రంప్‌ గొప్పలు పోతున్నాడు గానీ వాస్తవానికి వీటి మూలంగా కార్మిక వర్గానికి ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. అంతిమంగా ఇవి ద్రవ్య పెట్టుబడి అధిపత్యాన్ని బలోపేతం చేస్తాయి. బడా కార్పొరేట్లకు ప్రభుత్వ పెట్టుబడులు సమకూరుతాయి. అమెరికన్‌ కార్పొరేట్ల విధేయతను చాటిచెప్పుకోవడానికి, రాజకీయ, ఆర్థిక నియంత్రణను బలోపేతం చేసుకోవడానికి ట్రంప్‌ దూకుడుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ రెండూ కూడా బూర్జువా రాజ్యాన్ని బహిరంగంగా పెట్టుబడిదారుల ప్రయోజనానికి ఉపకరించే సాధనంగా మార్చడమే. తద్వారా, ప్రజలిచ్చిన ప్రజాస్వామిక తీర్పును ట్రంప్‌ అపహాస్యం చేస్తున్నాడు. పొదుపు చర్యలు, ఉద్యోగుల కుదింపు, రాజ్యం ప్రోద్బలంతో కార్పొరేట్‌ రంగాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నాలూ కార్మికవర్గ ప్రయోజనాలకు, ప్రజాస్వామిక స్ఫూర్తికి గొడ్డలిపెట్టు వంటివి. ఇవి కేవలం పెట్టుబడిదారీ ప్రయోజనాలను నెరవేర్చడానికి ఉద్దేశించినవే.

అమెరికాలో నెలకొని ఉన్న ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ సంక్షోభాల నేపథ్యంలో న్యూయార్క్‌ నగర మేయర్‌ ఎన్నికలు జరిగాయి. ‘డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన సోషలిస్టునని స్వయంగా ప్రకటించుకున్న జోహ్రాన్‌ మామ్దానీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఆర్థిక న్యాయం, ఇంటి అద్దెలు అందుబాటులోకి తీసుకురావడం వంటి ప్రగతిశీల సంస్కరణలు అమలు చేస్తానని వాగ్దానం చేశాడు. ఐదేండ్ల లోపు వయసున్న పిల్లలందరికీ ఉచిత వైద్యం, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం, ప్రభుత్వం తరఫున నిత్యావసర సరుకుల దుకాణాలు నిర్వహించడం, ఆహార పదార్ధాల ధరల తగ్గింపు తన తొలి ప్రాధాన్యతలుగా ఉంటాయని ప్రచారం చేశాడు. గాజాలో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న జాతి హత్యాకాండను బాహాటంగానే విమర్శించాడు. ఇంటి అద్దెలు పెరగకుండా చూడడం, అర్హులకు రెండులక్షల నివాస గృహాలు కట్టించడం, 2030 నాటికి కనీస వేతనాన్ని గంటకు 30 డాలర్లకు పెంచేలా చూడడం మమ్దానీ ఇచ్చిన హామీల్లో ఉన్నాయి.

అలాగే న్యూయార్క్‌ సిటీ యూనివర్శిటీలో ఫీజులు లేకుండా చూస్తానని, ఒక మిలియన్‌ డాలర్ల కంటే అధిక ఆదాయంగల వ్యక్తులు, కార్పొరేట్‌ సంస్థలపై పన్నులు పెంచడం ద్వారా వచ్చే ఆదాయంతో ఈ ప్రజాహిత పథకాలను అమలు చేస్తానని ప్రకటించాడు. దీంతో మమ్దానీని కమ్యూనిస్టుగా అభివర్ణిస్తూ అతన్ని ఓడించమని ట్రంప్‌ పిలుపునిచ్చాడు. సామాజికన్యాయం కోసం ప్రగతిశీల ఉద్యమాలలో పాల్గొన్నవారి మీద ‘కమ్యూనిస్టులు’ అని ముద్ర వేసి వారిని వెంటాడి వేధించడం, అక్రమంగా నిర్బంధించడం అనేది మెకార్దీ హయాంలో 1940-50వ దశకాల్లో పెద్ద ఎత్తున సాగింది. ఇవాళ మన దేశంలో కూడా దోపిడీకి, పీడనకు, అణిచివేతకు గురయ్యేవారి పక్షాన గళం విప్పిన వారందరినీ ‘అర్బన్‌ నక్సల్స్‌’గా మితవాద, మతతత్వ శక్తులు ముద్ర వేయడం ఈ కోవకు చెందినదే.
ఎన్నికల ప్రచారంలో ప్రజోపయోగమైన పథకాలతో పాటు, ప్రగతిశీలమైన వాగ్దానాలు చేసిన మమ్దానీ అధికారం చేపట్టాక తన మాట నిలబెట్టుకుంటాడా అని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డెమోక్రటిక్‌ పార్టీలోని సోషలిస్టులు గతంలో తాము చేసిన వాగ్దా నాలను అమలు చేయడంలో విఫలమై చివరికి అమెరికన్‌ సామ్రాజ్యవాదం రుద్దిన ఎజెండాకు లొంగిపోయిన చరిత్ర ఉన్నది. బెర్నీ సాండర్స్‌, అలెగ్జాండ్రియా అకేషియో కోర్టెజ్‌లు ఇందుకు తాజా ఉదాహరణ. తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాకగానీ సాండర్స్‌ గాజాలో సాగుతున్నది జాతి హత్యాకాండ అని ప్రకటించడానికి సిద్ధపడలేదు. అలాగే ఇజ్రాయిల్‌కు సైనిక సాయం అందించరాదని చట్టసభలో పెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా అలెగ్జాండ్రియా ఓటు వేశారు. డెమోక్రటిక్‌ సోషలిస్టులుగా చెప్పుకునే వీరు సోషలిస్టు దళాలను, సోషలిస్టు భావజాల మొగ్గు ఉన్న ప్రభుత్వాలను ‘నియంతృత్వ ప్రభుత్వాలు’ అని నిందించడంలో ముందుంటారు. వెనిజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురో, క్యూబా అధ్యక్షుడు డియాజ్‌ కెనెల్‌ మీద మమ్దానీ వ్యాఖ్యలు కూడా ఈ కోవకు చెందినవే. సామ్రాజ్యవాద ధోరణలను మమ్దానీ నికరంగా వ్యతిరేకించడంలేదు కానీ ఆర్థిక విధా నాల వరకు కార్మికవర్గ ప్రయోజనాలకు అనుగుణమైన వైఖరిని ప్రదర్శిస్తున్నాడు. కరడుగట్టిన సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ దేశమైన అమెరికాలో ఈ మేరకు నిలబడడం కూడా పరిగణనలోకి తీసుకోదగ్గ అంశమే.

అబ్రహం లింకన్‌కు ‘ఇంటర్నేషనల్‌ వర్కింగ్‌మెన్‌ అసోసియేషన్‌ (ఐ.డబ్ల్యు.ఎం.ఎ) ఒక లేఖ రాస్తూ ‘బానిసలపై అధికారాన్ని ప్రతి ఘటించడం అధ్యక్షుడిగా మీరు ఎన్నిక కావడానికి కలిసి వచ్చిన నినాదమైతే, బానిసత్వానికి మరణం తధ్యం అన్న సింహనాదం మీ మలి ఎన్నికకు తోడ్పడింది. అమెరికా స్వాతంత్య్ర పోరాటం మధ్యతరగతి ఆవిర్భావానికి దారితీసే నూతన శకానికి ఆరంభంగా మారింది. అలాగే బానిసత్వానికి వ్యతిరేకంగా జరిగే యుద్ధం అమెరికన్‌ కార్మిక వర్గానికి నూతన శకారంభం కావాలని యూరప్‌ కార్మికవర్గం భావిస్తున్నది. కార్మికవర్గ బిడ్డడు అయిన అబ్రహం లింకన్‌ బానిస సంకెళ్లలో మగ్గిపోతున్న ఒక జాతి ప్రజానీకం విముక్తికి తోడ్పడే, నూతన సామాజిక క్రమాన్ని రూపొందించే పోరాటాన్ని ఏకోన్ముఖంగా నడిపించడం ద్వారా నవశకానికి నాంది పలకాలని యూరప్‌ కార్మికవర్గం అభిలషిస్తుంది” అని విజ్ఞప్తి చేసింది. ఐ.డబ్లు.యం.ఎ జర్మనీ కరెస్పాండింగ్‌ సెక్రటరీ హోదాలో కారల్‌ మార్క్స్‌ స్వయంగా ఈ లేఖ రాశాడు. అబ్రహం లింకన్‌ ను రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్న అమెరికన్‌ ప్రజానీకాన్ని అభినందిస్తూ మార్క్స్‌ ఈ లేఖ రాశాడు. అబ్రహం లింకన్‌ సోషలిస్టు కాదు, సామ్రాజ్యవాద వ్యతిరేకీ కాదు. ఆయన రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధి. అయినా బానిసత్వం రద్దుకు కృషి చేసిన లింకన్‌ను అభినందించడానికి కారల్‌ మార్క్స్‌ చొరవ చూపాడు.

సీపీఐ(ఎం) 24వ మహాసభ రాజకీయ తీర్మానంలో పార్టీ ఈ విధమైన అంచనాకు వచ్చింది ”దిగజారిపోతున్న ప్రజల జీవన ప్రమా ణాల పరిస్థితులను ఆధారం చేసుకుని వివిధ దేశాల్లో మితవాద, నయా-ఫాసిస్టు శక్తులు బలపడుతున్నాయి. సరైన వామపక్ష రాజకీయ ప్రత్యా మ్నాయం లేకపోవడంతో, ప్రజల అసంతృప్తిని మితవాద శక్తులు సొమ్ము చేసుకుంటున్నాయి. నయా ఉదారవాద విధానాలను అమలు చేస్తున్న సోషల్‌ డెమోక్రాట్‌, కన్జర్వేటివ్‌ పార్టీల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. పర్యవసానంగా వీరు పచ్చి మితవాద శక్తుల వైపు మొగ్గుతు న్నారు. అనేక దేశాల్లో మితవాద శక్తులు అధికారంలోకి వచ్చాయి. యూరోపియన్‌ పార్లమెంటు ఎన్నికలలో కూడా వివిధ దేశాల్లో మితవాద శక్తులే గెలుపొందాయి. అర్జెంటీనాలో జేవియర్‌ మిల్లీ, ఇటలీలో జార్జియా మెలోనీ, అమెరికాలో ట్రంప్‌ల గెలుపు రాజకీయాలు మితవాదం వైపు మొగ్గుతున్న అంతర్జాతీయ ధోరణికి అద్దం పడుతున్నాయి” అని పార్టీ తీర్మానించింది.

వామపక్ష ప్రత్యామ్నాయ రాజకీయాలను పెంపొందించడం ద్వారా మాత్రమే మితవాద శక్తుల ఎదుగుదలను నిలవరించవచ్చని సీపీఐ(ఎం) అభిప్రాయపడింది. పార్టీ రాజకీయ వేదిక నుండి యువతరం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గళం విప్పి సోషలిజమే ప్రత్యామ్నాయమని చాటిచెప్పాలని, పార్టీ ప్రజా పునాదిని విస్తృత పరచుకుని మన ప్రభావాన్ని పెంచుకోవాలని మదురై మహాసభ పిలుపునిచ్చింది. ఈ మొత్తం పరిణామాల నేపథ్యం నుండి చూస్తే ఐర్లాండ్‌ అధ్యక్షురాలిగా కేథరిన్‌, న్యూయార్క్‌ నగర మేయర్‌గా మమ్దానీ ఎన్నిక, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘాల కూటమి గెలుపు, పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలో ఎస్‌.ఎఫ్‌.ఐ విజయం సోషలిస్టు చైతన్యానికి దారిగానే చెప్పాలి. దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రగతిశీల శక్తుల గెలుపును అభ్యుదయ శక్తుల బలోపేతానికి అంతర్జాతీయంగా కొనసాగుతున్న మితవాద శక్తుల పట్ల మొగ్గును ఎదుర్కోవడానికి సంకేతంగా చూడాలి.

ఎం.ఎ.బేబి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -