హెచ్-1బీ వీసా నియామకాలు ఆపేయండి
ప్రభుత్వ వర్సిటీలు, సంస్థలకు టెక్సాస్ గవర్నర్ ఆదేశం
టెక్సాస్ : వచ్చే సంవత్సరం వరకూ హెచ్-1బీ వీసా నియామ కాలను నిలిపివేయాలని అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ మంగళవారం యూనివర్సిటీలు, ప్రభుత్వ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి యాజమాన్యాలు హెచ్-1బీ వీసా పిటిషన్లను ఉపయోగించుకుంటాయి. టెక్సాస్ రాష్ట్రంలో వేలాది మంది హెచ్-1బీ వీసాదారులు నివసిస్తున్నారు. వీసా కార్యక్రమాన్ని ప్రక్షాళన చేయాలని డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు గవర్నర్ ఈ ఆదేశాలు జారీ చేశారు. తక్కువ వేతనాలతో పనిచేసేందుకు అంగీకరించే విదేశీ ఉద్యోగులు ఈ వీసా కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటూ అమెరికన్ల ఉద్యోగావకాశాలను దెబ్బ తీస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రపంచంలోని వివిధ దేశాలలోని నిపుణులను ఆకర్షించేందుకు, వారికి నిర్దిష్ట విధులను అప్పగించేందుకు, ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతోందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ‘రాష్ట్ర ప్రభుత్వం ఇతరులకు ఆదర్శంగా నిలవాలి.
పన్ను చెల్లింపులదారుల డాలర్లతో కల్పిస్తున్న ఉద్యోగావకాశాలను ముందుగా టెక్సాస్ వాసులతోనే భర్తీ చేయాలి’ అని అబ్బాట్ తన ఆదేశాలలో పేర్కొన్నారు. అబ్బాట్ తాజా ఆదేశాల నేపథ్యంలో…అమెరికాలో ఉద్యోగాలు చేయాలని ఉవ్విళ్లూరే విదేశీయులకు తీవ్ర ఆశాభంగం ఎదురైంది. విదేశీ ఉద్యోగుల నియామకాలపై విధించిన నిషేధం 2027 మార్చి 31 వరకూ అమలులో ఉంటుంది. అయితే టెక్సాస్ వర్క్‌ఫోర్స్ కమిషన్ అనుమతితో పరిమితంగా కొన్ని నియామకాలు చేపట్టవచ్చు. అమెరికా వీసా కార్యక్రమం దుర్వినియోగానికి గురవుతోందని, కాబట్టి కొత్త పిటిషన్లను అనుమతించవద్దని అబ్బాట్ తన ఆదేశాలలో స్పష్టం చేశారు. అమెరికా ఉద్యోగాలను అమెరికన్లే చేయాలన్నది తన అభిమతమని ఆయన తెలిపారు.
‘ప్రభుత్వ హెచ్-1బీ వీసా కార్యక్రమం దుర్వినియోగం అవుతోందని ఇటీవల వార్తలు వస్తున్నాయి. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే లభించేలా చూసేందుకు ట్రంప్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సమీక్షిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని హెచ్-1బీ వీసా పిటిషన్లను తక్షణమే నిలిపివేయాల్సిందిగా నేను అన్ని ప్రభుత్వ సంస్థలనూ ఆదేశిస్తున్నాను’ అని చెప్పారు. మార్చి 27వ తేదీ నాటికి సవివరమైన నివేదికలు అందించాల్సిందిగా ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీలను ఆయన ఆదేశించారు. టెక్సాస్ యూనివర్సిటీలు, పబ్లిక్ స్కూల్స్ (కిండర్‌గార్టెన్ నుంచి 12వ గ్రేడ్ వరకూ)లో ఎంతమంది హెచ్-1బీ వీసా ఉద్యోగులు పనిచేస్తున్నదీ తెలుపుతూ పూర్తి జాబితాను అందజేయాలని గవర్నర్ అంతకుముందు డిమాండ్ చేశారు. టెక్సాస్ ప్రజలతో తేలికగా నింపే ఉద్యోగాలను ఇతరులతో భర్తీ చేయకుండా చూడాల్సిన అవసరం ఉన్నదని ఆయన చెప్పారు.



