Tuesday, March 31, 2026
E-PAPER
Homeమానవిభిన్న రంగాల్లో రాణిస్తున్న 'అమ్మ'

భిన్న రంగాల్లో రాణిస్తున్న ‘అమ్మ’

- Advertisement -

మహిళలు ఎన్నో సాధించాలని కలలు కంటారు. అయితే సమాజంలోని అడ్డంకులు, కట్టుబాట్లతో వాటిని నిజం చేసుకోలేక వెనకడుగు వేస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం ఆ అడ్డంకులను ఎదిరించి అనుకున్న లక్ష్యం చేరుకుంటారు. అలాంటి వారిలో మేఘా షా ఒకరు. ఎన్నో అడ్డంకులు ఎదురై చాలాకాలం తన కలలను నిజం చేసుకోలేకపోయారు. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత భర్త ఇచ్చిన సహకారంతో వాటిని నిజం చేసుకున్నారు. బైక్‌ రైడర్‌గా, లాయర్‌గా, ట్రావెలర్‌గా, కంటెంట్‌ క్రియేటర్‌గా, ఫ్యాషన్‌ డిజైనర్‌గా భిన్న రంగాలలో రాణిస్తున్న ఆమె స్ఫూర్తిదాయక పరిచయం నేటి మానవిలో…

అహ్మదాబాద్‌లోని మర్వాడి కుటుంబంలో పుట్టారు మేఘా షా. ఇంట్లో అందరూ ముద్దుగా ‘మినీ’ అని పిలుస్తారు. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం ‘హీల్స్‌ ఆన్‌ వీల్స్‌’గా అందరూ ఆమెను గుర్తుపడతారు. అమ్మాయిలంటే ఇంటి బాధ్యతలకే పరిమితమవ్వాలనే సంప్రదాయ పద్ధతుల్లో పెరిగారు ఆమె. దాంతో మొదటి నుండి మేఘా ఏమైనా చేయాలంటే ఇంట్లో ముందుగా ‘వద్దు’ అనే మాటే వినిపించేది. ఇంట్లో వాళ్లు ఏం చెప్తే అదే చెయ్యాలి అనే ఆంక్షలు ఉండేవి. ఆమె చదువు ఇదే పద్ధతిలో కొనసాగింది. ఇలా ఇంట్లో ఎన్ని ఆంక్షలు ఉన్నా ఆమె తన కలలను మాత్రం పక్కన పెట్టలేదు. ఉన్న పరిమితుల్లోనే సాధ్యమైనంత వరకు తనను తాను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించారు. దీని కోసం నిరంతరం శ్రమించారు.

భర్త ప్రోత్సాహంతో…
మేఘా జీవితంలో జరిగిన గొప్ప మార్పు ఏమిటంటే పెండ్లి తర్వాత ఆంక్షలు తగ్గాయి. దానికి తోడు తన కలలను నిజం చేసుకోవాలనే బలమైన సంకల్పం ఆమెకు తోడుగా వుంది. మొదటి సారి ఆమె మోటర్‌ సైకిల్‌ యాత్ర అయితే విచిత్రంగా మొదలయింది. భర్తతో కలిసి ఆమె ఎక్కువగా స్పోర్ట్స్‌ బైక్‌పైనే బయటకు వెళ్లేవారు. అయితే ఎప్పుడూ ఆమె వెనక సీట్లోనే కూర్చునేది. ‘ఎప్పుడూ వెనక సీట్లోనే ఎందుకు కూర్చోవాలి, నేనెందుకు బైక్‌ నడపకూడదు’ అనే ఆలోచన వచ్చింది. దాంతో బైడ్‌ నడపాలని నిశ్చయించుకున్నారు. వెంటనే బైక్‌ కొనేశారు. అయితే అప్పటికి ఆమెకు సాధారణ బైక్‌ నడపడం కూడా రాదు. అయినప్పటికి భర్త ప్రోత్సహించడంతో సొంతంగానే బైక్‌ నేర్చుకున్నారు. అలా మూడు నెలల్లో నేర్చుకొని ఒక్కరే భూటాన్‌ వెళ్లారు. అప్పటి నుండి వీకెండ్‌ వస్తే సిటీలో ఉండేవారు కాదు. క్రమంగా మోటర్‌ సైకిల్‌ ఆమె జీవనశైలిలో ఓ భాగమైపోయింది.

అమ్మైన తర్వాత…
మేఘాకు పదకొండ్లే పాప ఉంది. సాధారణంగా పెండ్లి తర్వాత కుటుంబం, పిల్లల బాధ్యతతో తమ కలలను పక్కన పెట్టేస్తారు చాలా మంది మహిళలు. ఈ విషయంలో మేఘా ఏమంటారంటే ‘నేను అమ్మనయ్యాక మరింత దృఢంగా మారా. ఇంటి బాధ్యతలను చూసుకుంటూనే నా కలలను సాకరం చేసుకుంటున్నాను. ఇందులో నా భర్త అందిస్తున్న సహకారం మాత్రం మరువలేనిది’ అంటున్నారు. ఇప్పటి వరకు ఆమె దేశంలో లక్ష కిలోమీటర్లకు పైగా ప్రయాణించేశారు. 2024లో 52 మంది రైడర్స్‌తో కలిసి అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 200 కిలోమీటర్లు ప్రయాణించారు. దాంతో వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.

‘హీల్స్‌ ఆన్‌ వీల్స్‌’
బైక్‌ రైడింగ్‌ ప్రారంభించినప్పటి నుండి మేఘా తనకు సంబంధించిన వివరాలన్నీ ‘హీల్స్‌ ఆన్‌ వీల్స్‌’ అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడం మొదలుపెట్టారు. అలా ఆమెకు తెలియకుండానే ఫ్యాషన్‌పై మక్కువ పెంచుకున్నారు. అందాల పోటీల్లోనూ పాల్గొన్నారు. 2024లో మిసెస్‌ ఇండియా అవార్డును సైతం అందుకున్నారు. ఆ సంబర్భంగా ఆమె ఏమంటారంటే ‘హీల్స్‌ ఆన్‌ వీల్స్‌ అనే పేరుకు నిజంగా న్యాయం చేస్తున్నాను. మహిళలు అందంతో పాటు ధైర్యంగా ఉండగలరని నేను గట్టిగా నమ్ముతున్నాను. గంటల తరబడి సాధన, తీవ్రమైన పోటీతో చాలా సవాళ్లనే ఎదుర్కొన్నాను. అయితే మనం చేరాల్సిన గమ్యం కంటే దాని కోసం చేసే ప్రయాణమే ఎంతో అందంగా ఉంటుందని అంటారు కదా! ఆ ఆద్భుతమైన అనుభవంలోని ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదించాను. మన స్త్రీత్వాన్ని సమాజం గుర్తించదు. దాన్ని మనమే గుర్తించాలి. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరు అనే నమ్మకం మరోసారి బలపడింది’ అంటారు.

బైక్‌ ర్యాలీ అంటే…
మేఘా ప్రస్తుతం ‘లేడీస్‌ ఆఫ్‌ హార్లే డేవిడ్‌సన్‌’ ఇండియా బృందానికి డైరెక్టర్‌గా బాధ్యతలు చూస్తున్నారు. తనలా రైడర్లుగా మారాలనుకునే మహిళలకు తన వంతు సహకారం అందిస్తున్నారు. ‘నా దృష్టిలో బైక్‌ ర్యాలీ అంటే కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు. ఒకరికొకరు సహకరించుకుంటూ, అనుభవాలను పంచుకుంటూ ముందుకు సాగడం. ఇతరులతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడం.. నేను అదే నమ్ముతాను’ అంటారు ఆమె. ఓ తల్లిగా, భార్యగా కుటుంబ బాధ్యతలు చూస్తూనే పట్టుదల, ఆత్మవిశ్వాసంతో అడ్డంకులను అధిగమించి ఒక శక్తిగా ఎదిగి భిన్న రంగాలలో రాణిస్తున్న మేఘ జీవితం నేటి మహిళలకు స్ఫూర్తిదాయకం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -