Magazines

గాజాలో మళ్లీ సరుకుల కొరత ముప్పు

1 గంట క్రితం

goods in Gaza
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 2 నిమిషాల చదవడం

రెండు రోజులుగా నిలిచిన వాణిజ్య సరుకుల రవాణా

హమాస్‌ పన్నులే కారణమంటున్న ఇజ్రాయిల్‌

ఆంక్షలు విధించింది ఇజ్రాయిలేనంటున్న

గాజా ట్రక్కుల యూనియన్‌

చలికాలం వేళ ఆహారం, దుస్తుల కోసం ప్రజల అవస్థలు

జెరూసలేం: యుద్ధంతో అతలాకుతలమైన గాజాలో ప్రజలకు మరో కష్టకాలం ఎదురుకానుంది. రెండు రోజులుగా వాణిజ్య సరుకుల రవాణా నిలిచిపోవడంతో ఆహారం, పండ్లు, మాంసం, చలికాలపు దుస్తుల కొరత పెరిగే ప్రమాదం ఏర్పడింది. సరుకుల రవాణా నిలిచిపోవడానికి హమాస్‌ విధిస్తున్న పన్నులే కారణమని ఇజ్రాయిల్‌ ఆరోపిస్తుండగా, ఆంక్షలు విధించింది ఇజ్రాలేనని గాజా ట్రక్కుల యూనియన్‌ చెప్తోంది. గాజాలోకి వచ్చే సరుకులను ఇజ్రాయిల్‌ సైన్యం తనిఖీ చేసి అనుమతిస్తుంది. మానవతా సహాయక సంస్థలు పిండి వంటి నిత్యావసరాలను అందిస్తుండగా, పండ్లు, మాంసం వంటి ఆహార పదార్థాలను వ్యాపారులు దిగుమతి చేస్తున్నారు. ఈ సరఫరా నిలిచిపోతే మార్కెట్లలో వస్తువుల ధరలు పెరిగి, పేద కుటుంబాలపై భారం పడుతుందని సహాయక సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మానవతా సాయం ఒక్కటే ప్రజల అవసరాలను తీర్చలేదని నార్వేజియన్‌ రెఫ్యూజీ కౌన్సిల్‌ ప్రతినిధి షైనా లో తెలిపారు. హమాస్‌ పన్నులు, బెదిరింపుల కారణంగా వ్యాపారులే సరుకుల రవాణాను నిలిపివేశారని ఇజ్రాయిల్‌ సైన్యానికి చెందిన కోగాట్‌ సంస్థ చెప్తోంది. అయితే, ఇజ్రాయిల్‌ విధించిన ఆంక్షలే అసలు కారణమని గాజా ప్రయివేటు ట్రక్కుల యూనియన్‌ అధిపతి నాహెద్‌ షెహైబర్‌ ఆరోపించారు. గాజాలోకి వచ్చే ఒక్కో ట్రక్కుకు 10,000 ఇజ్రాయిలీ షెకెల్స్‌ (సుమారు 3,226 డాలర్లు) చెల్లించాలని అక్కడి ఆర్థిక శాఖ కోరినట్టు షెహైబర్‌ తెలిపారు. అది పన్ను కాదని, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కోసం కోరుతున్న విరాళమని ఆ శాఖ ఉప కార్యదర్శి ఖలీద్‌ అల్‌-రఖబ్‌ చెప్పినట్టు వెల్లడించారు. సుమారు 20 లక్షల మంది నివసించే గాజాకు రోజుకు 250 ట్రక్కుల సరుకులు అవసరమని కోగాట్‌ అంచనా వేసింది. అయితే, కాల్పుల విరమణ ఒప్పందంలో రోజుకు కనీసం 600 ట్రక్కులను అనుమతించాలని నిర్దేశించారు. గతేడాది ఆగస్టులో కరువు పరిస్థితులు ప్రకటించిన గాజాలో ఆహార సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. 2023 అక్టోబర్‌ నుంచి ఇజ్రాయిల్‌ దాడుల్లో 74,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్టు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. సరుకుల రవాణా పునరుద్ధరించకపోతే ప్రజల కష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్