Monday, September 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమూఢనమ్మకాల నిరోధక చట్టం తేవాలి

మూఢనమ్మకాల నిరోధక చట్టం తేవాలి

- Advertisement -

కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సోమ సుందర్‌ మార్ల
జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో సదస్సు


నవతెలంగాణ-మియాపూర్‌

మూఢనమ్మకాల నిరోధక చట్టం తేవాలని రిటైర్డ్‌ ఇండ్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్త, జన్యుశాస్త్రం అధిపతి డాక్టర్‌ సోమ సుందర్‌ మార్ల అన్నారు. ఆదివారం జన విజ్ఞాన వేదిక హైదరాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మాదాపూర్‌ డివిజన్‌లోని సీఆర్‌ ఫౌండేషన్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మూఢనమ్మకాలను ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలను తీసుకొస్తుందని అన్నారు. స్వతంత్ర భారతదేశంలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సైన్స్‌ని అభివృద్ధి చేయాలని రాజ్యాంగంలో సైతం పొందుపరచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. యువత మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తూ సైన్స్‌ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు మూఢ నమ్మకాలను నిరోధిస్తూ చట్టాలను తీసుకొచ్చినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అలాంటి ప్రయత్నం చేయలేదన్నారు.

మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేయడం ద్వారా విద్యార్థి దశ నుంచే సైన్స్‌ వైపు పిల్లల నైపుణ్యం, సృజనాత్మకత పెరుగుతుందని తెలిపారు. కానీ నేడు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా యువతను పూర్తిగా మూఢనమ్మకాల వైపు నెట్టే విధంగా ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైంటిఫిక్‌ టెంపర్‌ను పెంచే విధంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ తగినంతగా పని జరగడం లేదన్నారు. భవిష్యత్తులోనైనా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో ప్రొఫెసర్‌ డాక్టర్‌ శరత్‌ బాబు, డాక్టర్‌ కోయ వీ.రావు మాట్లాడారు. మూఢ నమ్మకాల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలను చెప్పారు. సైన్స్‌ గొప్పతనాన్ని తెలిపారు. సైన్స్‌కు సంబంధించిన వివిధ అంశాలపై సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక హైదరాబాద్‌ నగర ప్రధాన కార్యదర్శి రవీందర్‌ బాబు, లింగస్వామి, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -