Saturday, December 13, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకవిత ఆరోపణలపై విచారణ జరిపించాలి

కవిత ఆరోపణలపై విచారణ జరిపించాలి

- Advertisement -

పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ డిమాండ్‌
ఆ మేరకు సీఎంకు విజ్ఞప్తి చేస్తానని వ్యాఖ్య
పంచాయతీల్లో గెలుపే తమ పనికి గీటురాయని వెల్లడి
గెలిచిన కాంగ్రెస్‌ మద్దతుదారులకు అభినందనలు
రెండు, మూడు విడతల్లోనూ గెలిపించాలని విజ్ఞప్తి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ నేతల అవినీతికి సంబంధించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డిని కోరతానని ఆయన వ్యాఖ్యానించారు. ఆమెకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉండటంలో తప్పు లేదనీ, అయితే మనిషి అత్యాశ ఉండకూడదని ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మంత్రి అజారుద్దీన్‌, కార్పొరేషన్‌ చైర్మెన్లు మల్‌రెడ్డి రాంరెడ్డి, రియాజ్‌, మెట్టు సాయి కుమార్‌, అధికార ప్రతినిధి లింగం యాదవ్‌ తదితరులతో కలిసి మహేశ్‌ కుమార్‌ విలేకర్ల సమావేశం నిర్వహించారు. నూతన సర్పంచ్‌లుగా గెలిచిన కాంగ్రెస్‌ మద్దతుదారులకు ఆయన అభినందనలు తెలిపారు. మొదటి విడత ఎన్నికల్లో 4,230 పంచాయతీలకు గాను కాంగ్రెస్‌ మద్దతుదారులు 2,600 పైచిలుకు స్థానాల్లో గెలిచినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఇది నిదర్శనమని హర్షం వ్యక్తం చేశారు.

ఏకగ్రీవమైన చోట్ల కూడా 90 శాతం కాంగ్రెస్‌ మద్దతుదారులే గెలిచారని చెప్పారు. చాలా చోట్ల బీజేపీ, బీఆర్‌ఎస్‌ లోపాయికారీగా కలిసి పోటీ చేశాయని ఆయన విమర్శించారు. వెయ్యికి దగ్గరగా బీఆర్‌ఎస్‌, 200 లోపు బీజేపీ, 40 స్థానాలు సీపీఐ (ఎం), 30 స్థానాల్లో సీపీఐ అభ్యర్థులు గెలిచినట్టు వివరించారు. రెండో విడత, మూడో విడత ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్‌ మద్దతుదారులకు పట్టం కట్టాలని పీసీసీ చీఫ్‌ విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలనకే ప్రజలు పట్టం కట్టారని మహేశ్‌ కుమార్‌ చెప్పారు. 15 నెలల్లో 80 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామనీ, ఉచిత బస్సు మొదలుకొని సన్న బియ్యం పంపిణఈ వరకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. వీటితోపాటు కాంగ్రెస్‌ అమలు చేస్తున్న సామాజిక న్యాయానికి మెచ్చి జూబ్లిహిల్స్‌ ఉప ఎన్నికల్లో నవీన్‌ యాదవ్‌కు 25 వేలకుపైగా మెజార్టీ ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ పట్ల పెట్టుబడిదారులకు నమ్మకం పెరిగిందనీ, గ్లోబల్‌ సమ్మిట్‌తో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో వచ్చిన పెట్టుబడులు ఎన్ని? అని ఆయన ప్రశ్నించారు.

14న న్యూఢిల్లీలో ధర్నా
న్యూఢిల్లీలోని రామ్‌ లీలా మైదానంలో ఈనెల 14న జరిగే మహాధర్నాలో సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీఏసీ సభ్యులు పాల్గొంటారని మహేశ్‌ కుమార్‌ తెలిపారు. ఓట్‌ చోరీకి వ్యతిరేకంగా 14 లక్షల వరకు సంతకాల సేకరణ జరిగిందని ఆయన ప్రకటించారు. ధర్నా అనంతరం రాష్ట్రపతికి వినతి పత్రం అందజేసే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఓట్‌ చోరీతోనే తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని ఆరోపించారు. రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి సర్పంచ్‌ ఎన్నికల్లో ఓట్లు ఎక్కడికిపోయాయని ఆయన ప్రశ్నించారు. సర్పంచ్‌ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్‌ రెడ్డి సంతృప్తిగా ఉన్నారని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -