Tuesday, November 11, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్అందెశ్రీ మృతి బాధాకరం : సీఐటీయూ

అందెశ్రీ మృతి బాధాకరం : సీఐటీయూ

- Advertisement -

ప్రజాకవి, రచయిత అందెశ్రీ(అందె ఎల్లయ్య) మరణం బాధాకరమని సీఐటీయూ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు ఆ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. చదువుకోకపోయినప్పటికీ ప్రజల జీవన పరిస్థితులపై, వారి కష్టాలపై 3 వేలకుపైగా పద్యాలు రాసిన గొప్ప కవి అందెశ్రీ అని కొనియాడారు. మాయమై పోతున్నడమ్మ మనషి అన్నవాడు పాట ప్రజల పాటగా నిలబడిందని గుర్తుచేశారు. ఆయన మరణం తెలంగాణ ప్రజలకు తీరని లోటు అని తెలిపారు. ఆయన మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

తెలంగాణ ఉద్యమానికి ఊపిరి : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
తెలంగాణ ఉద్యమానికి అందెశ్రీ ఊపిరిగా నిలిచారనీ, వామపక్షవాది, తాను అభిమానించే అందెశ్రీ అకాల మరణం తెలంగాణ ప్రజలు జీర్ణించుకోవడం కష్టమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ వేగుచుక్క రాలిపోవడం ప్రగతిశీల ఉద్యమాలకు, కళా ప్రపంచానికి తీరని లోటు అని తెలిపారు.

దిగ్భ్రాంతికరం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని
కవి, నంది అవార్డు గ్రహీత అందెశ్రీ మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అందెశ్రీకి సంతాపం తెలిపిన వారిలో సీపీఐ జాతీయ కార్యదర్శులు చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, కె.రామకృష్ణ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ, తెలంగాణ సాంస్కృతిక సలహామండలి సభ్యులు, తెలంగాణ ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ, తదితరులున్నారు.

పలు పార్టీలు, ప్రజా సంఘాల సంతాపం
అందెశ్రీ మరణం పట్ల రాష్ట్ర రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి, సీపీఐ(ఎంఎల్‌)మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటురంగారావు, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేశ్‌రాజా, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె.వి.చలపతిరావు తదితరులు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. టీజీవో ఉపాధ్యక్షులు మాచర్ల రామకృష్ణ గౌడ్‌, టీఆర్‌టీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కటకం రమేశ్‌, మారెడ్డి లింగారెడ్డి, ఎస్‌ఎల్‌టీఏటీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చక్రవర్తుల శ్రీనివాస్‌, గౌరీశంకర్‌రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్‌ తదితరులు అందెశ్రీ మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.

అందెశ్రీ మరణం పట్ల టీఎస్‌ యూటీఎఫ్‌ సంతాపం
అందెశ్రీ మరణం పట్ల టీఎస్‌ యూటీఎఫ్‌ తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నిరక్షరాస్యుడైన ఎల్లయ్య పశువుల కాపరిగా జీవనం ప్రారంభించి స్వయం కృషితో, తన గళంతో, కలంతో గొప్ప రచయితగా ఎదిగారు. ఆశు కవితలు చెప్పడలో దిట్ట అయిన ఎల్లయ్య ”అందెశ్రీ” కలం పేరుతో అనేక పాటలు రాశారు. తెలంగాణా ఉద్యమ గీతాలతోపాటు అనేక సామాజిక గీతాలు రచించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన ”జయ జయహే తెలంగాణ ” గీతం తెలంగాణా రాష్ట్ర గీతంగా ఎంపికై, ప్రతిరోజు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఆలపించబ డుతున్నది. ”మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ”, ”కొమ్మ చెక్కితె బొమ్మరా, కొలిచి మొక్కితె అమ్మరా” లాంటి పాటలు అందెశ్రీ సామాజిక దృష్టికి ఉదాహరణ. పలు సంస్థల నుంచి సాహితీ పురస్కారాలు, గౌరవ డాక్టరేట్లు అందుకున్న అందెశ్రీ మరణం తెలంగాణ ప్రజలకు, ప్రత్యేకించి సాహిత్యాభిమానులకు తీరని లోటు….’ పేర్కొన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సంతాపం
అందెశ్రీ మరణం పట్ల ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తొంట సత్యనారాయణ, పెంట అంజయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సూర్యదేవర నాగయ్య, చాగంటి ప్రభాకర్‌ తదితరులు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -