– డీటీసీ అక్రమాస్తులు రూ.200 కోట్లకు పైనే!
– అధికారుల ఆకస్మికదాడుల్లో వెల్లడి
– నిందితుడు మూడ్ కిషన్ అరెస్ట్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ వలకు మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డీటీసీ) మూడ్ కిషన్ అక్రమాస్తులపై మంగళవారం ఏసీబీ అధికారులు పంజా విసిరారు. కిషన్, ఆయన బంధుమిత్రులకు చెందిన ఆస్తులపై జరిపిన దాడుల్లో దాదాపు రూ.200 కోట్లు విలువైన అక్రమాస్తులు వెలుగు చూశాయి. ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారుసిన్హా తెలిపిన వివరాల ప్రకారం.. డీటీసీగా మహబూబ్‌నగర్‌లో పని చేస్తున్న కిషన్.. అవినీతి, అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయల ఆస్తులను సంపాదించినట్టు ఏసీబీకి సమాచారమందింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలోగల కిషన్ నివాసాలతో పాటు మహబూబ్‌నగర్, సంగారెడ్డి, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న కిషన్ అక్రమాస్తులపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తం 12 ప్రాంతాల్లో జరిగిన ఈ దాడులలో కిషన్ కూడబెట్టిన విలువైన వ్యవసాయ భూములు, ఇండ్లు, హౌటళ్లలో భాగస్వామ్యాలు, లాకర్లలో నిల్వ ఉంచిన బంగారం, రూ.1 కోటికి పైగా నగదు, విలువైన వాహనాలు బయటపడ్డాయి. ఈ ఆస్తులను ప్రాథమికంగా గణించిన అధికారులకు రూ.12.72 కోట్లుగా తేలింది. అయితే వీటి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.200 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితుడు కిషన్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.. బుధవారం కోర్టులో హాజరు పర్చనున్నారు.
కాగా ఏసీబీ దాడుల్లో వెల్లడైన కిషన్ ఆస్తుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్‌లోని లహరీ ఇంటర్నేషనల్ హౌటల్‌లో 50 శాతం షేర్లు, రాయల్‌ఓక్ ఫర్నీచర్ స్పేస్‌లో ఓనర్‌షిప్, అశోకా టౌన్‌షిప్‌లో రెండు ఫ్లాట్లు, సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ తహసీల్దార్ పరిధిలో 31 ఎకరాల వ్యవసాయ భూమి, నిజామాబాద్ మునిసిపల్ పరిధిలో 10 ఎకరాల కమర్షియల్ ల్యాండ్, సంగారెడ్డిలోని నిజాంపేట్ మండలంలో 4000 చదరపు గజాల్లో ఉన్న పాలీహౌజ్, షెడ్, రూ.1.37 కోట్ల మేర బ్యాంకు బ్యాలెన్స్, 1000 గ్రాములకు పైగా ఉన్న బంగారు ఆభరణాలు, ఒక హౌండా సిటీ కారు, ఒక ఇన్నోవా క్రిస్టా కారు ఉన్నాయి.
ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



