కృష్ణా నది నుంచి 135 టీఎంసీలు రావాలి
45 టీఎంసీలకు ఎలా ఒప్పుకుంటారు?
పాలమూరు రంగారెడ్డికి అన్యాయం
ప్రజా క్షేత్రంలో ఎండగడతాం
కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో అన్నింటా విఫలం
భూములు అమ్ముకునేందుకే ఫార్మాసిటీ రద్దు
ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క
రేవంత్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లలో అన్నింటా విఫలం చెందిందని బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు (కేసీఆర్) అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ నీటి దోపిడీపై మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ప్రజాక్షేత్రంలో ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ తప్పిదాలను ఎండగడతామని స్పష్టంచేశారు. పాలమూరు జిల్లాలో కృష్ణానది 300 కి.మీ ప్రవహిస్తున్నా, నీటి వాటాల విషయంలో 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, 20 ఏండ్లు పాలించిన టీడీపీ పార్టీలు అన్యాయం చేశాయని ఆరోపించారు. 1974లో బచావత్ ట్రైబ్యునల్ 17 టీఎంసీలు జూరాలకు సుమోటోగా కేటాయించినా, దాన్ని ఏ సర్కారు పట్టించుకోలేదన్నారు. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకుని వేసిన పునాదిరాళ్లు ఇంకా కనిపిస్తునే ఉన్నాయని ఎద్దేవా చేశారు.
”రెండేండ్లు గడిచినా పాలమూరు-రంగారెడ్డిలో తట్టెడు మట్టి తీయలేదు. కేటాయింపులు ఉన్నా వాటిని అమలు చేయలేదు. పెండింగ్ ప్రాజెక్ట్‌లు అని పేరు పెట్టారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దోదావరి, కృష్ణా నదీ జలాలపై సమీక్ష చేశాం. యుద్ద ప్రాతిపదికన పెండింగ్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం ప్రారంభించి జిల్లా వ్యాప్తంగా కల్వకుర్తి, నెట్టెంపాడు బీమా ద్వారా 6.5 లక్షల ఎకరాలకు నీరందించాం. మిషన్ కాకతీయ ద్వారా 1.5 లక్షల ఎకరాలను స్థిరీకరించాం. కాని నేడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ నీటి వాటాలు సాధించడంలో రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టిందని విమర్శించారు. బచావత్ ట్రిబ్యునల్ లెక్కల ప్రకారం మొత్తం 174 టీఎంసీలకు గాను తాము అధికారంలో ఉన్నప్పుడు 90.81 టీఎంసీలు కేటాయించాలని అడిగామని గుర్తు చేశారు. మిగిలిన నీటిలో కర్ణాటకకు 25, మహారాష్ట్ర 14 టీఎంసీలు తీసుకోగా తెలంగాణకు రావాల్సిన 45 టీఎంసీలతో కలిపి దాదాపు 135 టీఎంసీలు రావాల్సి ఉందని అన్నారు. కాని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 45 టీఎంసీలు ఇవ్వాలని లేఖ ఎలా రాస్తారని ప్రశ్నించారు.
బచావత్ ట్రిబ్యునల్ ద్వారా సంక్రమించిన హక్కులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకోలేక పోతున్నదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ చంద్రబాబు మాటలు పట్టించుకుని పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్ వెనక్కి పంపిందని ఆందోళన వ్యక్తం చేశారు. డిల్లీ స్థాయిలో దాన్ని ప్రతిఘటించాల్సిన సర్కార్ ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు. ”దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడితే ఎస్‌ఆర్‌సీ యాక్ట్ ప్రకారం కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పిస్తారు. వాటిని బుల్డోజ్ చేశారు. నీటి పంపకాల్లో మొదలు అన్నింటా కొత్త రాష్ట్రాలకు అవకాశాలు ఇవ్వాలి. కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టక పోవడంతో సుప్రీంకు వెళ్లాం. అప్పటి కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సూచన మేరకు విత్‌డ్రా చేసుకున్నాం. సెక్షన్ 3 వేశారు. ట్రిబ్యునల్‌లో వాదనలు జరుగుతున్నాయి. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం రాజీ పడింది. గోదావరి మీద నల్లమల్ల సాగర్, కృష్ణాలో పాలమూరు-రంగారెడ్డికి ఏపీ చేస్తున్న నీటి దోపిడిపై మరో ఉద్యమం తప్పదు” అని కేసీఆర్ హెచ్చరించారు. నాలుగైదు రోజుల్లో జల దోపిడిపై షెడ్యూల్ ప్రకటించి ప్రజా క్షేత్రంలో పోరాడతామని చెప్పారు. కవులు, కళాకారులు, మేధావులను ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తామని ప్రకటించారు.
హామీల అమలును నిలదీస్తాం
అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేసీఆర్ విమర్శించారు. వాగ్దానాలు, పచ్చి మోసాలు, అర్రాసు పాటలు పాడి అడ్డదారిన అధికారం చేపట్టారని ఆరోపించారు. మహిళలకు రూ.2,500, రైతుబంధు రూ.15 వేలకు పెంపు, కళ్యాణ లక్ష్మి పథకానికి అదనంగా తులం బంగారం, రూ.4 వేల పెన్షన్ పెంపు ఇలా ప్రజలను మభ్య పెట్టారని విమర్శించారు. ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని అమలు చేయలేదని అన్నారు.
ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. తాము వంద శాతం సమ్మిళిత అభివృద్ధితో ముందుకు పోయామని గుర్తు చేశారు. రెండేండ్లలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడక ముందు యూరియా బస్తాల కోసం చెప్పులు లైన్లో పెట్టిన పరిస్థితి తిరిగి రెండేండ్ల కాగ్రెస్ పాలనలో దావురించిందని మండిపడ్డారు. తెలంగాణలో ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం 20 శాతం క్రైం రేట్ పెరిగిందనీ, పట్టపగలు హత్యలు, లైంగిక దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రియల్ ఎస్టేట్ కోసమే ఫార్మాసిటీ రద్దు
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఫార్మాసిటీ రద్దుకు కాంగ్రెస్ సర్కార్ పాల్పడిందని కేసీఆర్ విమర్శించారు. ”జీరో లిక్విడ్ బేస్ సాంకేతికత ప్రకారం ఫార్మా సిటీని తెచ్చాం. 14 వేల ఎకరాలు సేకరించాం. జీడిమెట్ల తదితర ప్రాంతాల నుంచి కంపెనీలను ఫార్మాసిటీకి పంపాలని నిర్ణయించాం. దానికి పర్యావరణ క్లియరెన్స్ వచ్చింది. చైనాలోని 70 వేల ఎకరాల్లో ఉన్న ఫార్మా సిటీని స్పూర్తిగా తీసుకుని ముచ్చర్లలో ఫార్మా నిర్మాణాన్ని చేపట్టాం. కాని కాంగ్రెస్ సర్కార్ ఫోర్త్ సిటీ పేరుతో భూములను అమ్ముకోవాలని చూస్తుంది.
400 ఏండ్ల మహానగరాన్ని నాశనం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. 120 మంది గురుకుల పాఠశాల విద్యార్థులు చనిపోతే, కొత్త నగర నిర్మాణమని ప్రజలను మభ్యపెడుతున్నారు” అని విమర్శించారు. పెట్టుబడుల పేరిట దొంగ ఎంవోయూలు కుదుర్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ”కాంగ్రెస్ ప్రభుత్వం.. సర్వభ్రష్ట ప్రభుత్వం… అన్నింటా విఫలమైంది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క… తప్పుడు మార్గంలో వెళితే తోలు తీస్తాం. తెలంగాణ తెచ్చిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎండగడతాం” అని కేసీఆర్ హెచ్చరించారు.



