భారతదేశ ఆర్థికవ్యవస్థకు వ్యవసాయం- చేనేత రెండూ రెండు కవల పిల్లలవంటివి అని మహాత్మా గాంధీó అభివర్ణించాడు. ప్రజల కూడు గూడు అవసరాలు తీర్చే ఉత్పత్తి రంగాలే కాదు, ప్రజలకు చేతినిండా పని కల్పించే ఉపాధి రంగాలుగా కూడా ఈ రెంటిని మనం గమ నించాలని ఆనాడే ఉద్భోదించారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యంలో వ్యవసాయానికి, చేనేతకు, చేతివృత్తులకు పెద్దపీట వేసిన ప్రాముఖ్యాన్ని మనం కాదనలేం.1948లో గాంధీని ఆరెస్సెస్ వ్యక్తి గాడ్సే పొట్టన పెట్టుకున్న తర్వాత కూడా గాంధీ పాటించిన విలువలకు కాలం చెల్లలేదనే విషయాన్ని మనం గమనించాలి.
ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత్‌పై కక్ష కట్టిన రీతిలో సుంకాల శరాఘాతాన్ని క్షణక్షణం ఊపిరాడని రీతిలో సంధిస్తున్నాడు. ఒక్కసారి గాంధీ కాలానికి మనం వెళ్తే, బ్రిటిష్ ఆర్థిక దోపిడీని అరికట్టేందుకు ప్రజలకు విదేశ వస్త్ర బహిష్కరణకు పిలుపునిచ్చిన విషయం మనం మరువలేం. ఎంత ఖరీదువైనప్పటికీ ఆనాటి ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆ వస్త్రాలను గుట్టుగుట్టలుగా పోసి వాటిని తగలెట్టారు. అయితే పరిస్థితి మారింది. దేశంలో పారిశ్రామికరంగం శీఘ్రగతిని అభివృద్ధి చెందింది. 1990లో ప్రవేశించిన నూతన ఆర్థిక విధానాలతో కార్పొరేట్ రంగం విజృంభించింది. ఎంతగా అంటే కడకు ప్రజాపాలనా రంగాన్ని కబళించేటంతగా.. ట్రంప్ భాష, వ్యవహారశైలి ఫక్తు కార్పోరేట్ మాదిరి గానే వ్యవహరిస్తున్నట్టు ప్రజలు, దేశాలు ఏమైపోయినా సరే సొంతలాభమే ముఖ్యం) కనబడుతున్నది. కార్పోరేట్లకు – ప్రజలకు (శ్రమజీవులకు) మధ్యన రాజకీయపరమైన ఓ పాలనా వ్యవస్థ ఉంటుందనే విజ్ఞతనే ఆయన మరచిపోతున్నాడు.తొండముదిరి ఊసరవెల్లి అయింది.
యాదృచ్ఛికమే అయినప్పటికీ భారత ప్రధాని మోడీ హరిత విప్లవ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్ శత జయంతి సభలో మాట్లాడుతూ రైతన్నల ప్రయోజనాల విషయాలపై రాజీపడే ప్రసక్తేలేదని అన్నారు. వ్యవసాయం, పాడి, మత్స్య పరిశ్రమలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుని తీరుతామని చెప్పారు. పరోక్షంగా ఈ ప్రధాని మాటలు ట్రంప్ సుంకాల బెదిరింపులను తిప్పికొట్టి నట్లయింది.అన్నదాతల అభివృద్ధి కోసం ఎంత మూల్యం చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నట్టు కూడా మోడీ తెలిపారు. తత్సందర్భంగా పి.ఎం కిసాన్, పి.ఎం. ఫసల్ బీమా యోజన, పి.ఎం కృషి సించారు, ఎం.ఎం.ధన్ ధాన్యయోజన వంటి పథకాలను ఏకరువు పెట్టాడు. అంతేకాదు పదివేల రైతు ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేసా మని, తద్వారా ఆర్థిక తోడ్పాటే కాదు రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచినట్టు చెప్పుకొచ్చారు.
మరి అంతాబాగానే ఉంటే నిత్యం రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నట్టు? బి.బి.సి. సర్వే ప్రకారం మనదేశంలో ప్రతి గం టకు సగటున ఇద్దరు లేక మగ్గురు రైతులు చనిపోతున్నారు.మోడీ పాలనకు వ్యతిరేకంగానే రైతులు పంటపొలాలను వదిలి రాజధాని రోడ్లపైకి వచ్చి నెలల తరబడి ఎందుకు, వానకు చలికి తట్టుకుని గుడారాలు వేసుకుని దీక్షలు చేసారు. రైతులను రౌడీలని, తుకిడేతుకిడే గ్యాంగ్‌లని నిం దించారు. రైతులపై లాఠీచార్జి, బాష్ప వాయుగోళాలు ప్రయోగించడం, రాజధాని ఢిల్లీకి రాకుండా రోడ్లపై మేకులు దిగ్గొట్టడం, వాహనాలతో తొక్కించడం అంతా జరిగింది. ఆ దారుణకృత్యంలో దాదాపు 700 పైగా రైతులు మృతిచెందారు. రైతులను కార్పోరేట్లను బలిపెట్టే నల్లచట్టాలను తొలగిస్తానని ప్రధాని మోడీ మాట ఇచ్చినప్పటికీ వాటిని తొలగించలేదు.ఆ భయానక చట్టకత్తులు నేటికీ రైతుల కుత్తుకలపై వేలాడుతూనే ఉన్నాయి.
మరిప్పుడు ఈ మోడీ మాటలేమిటి?..అంటే రైతులు, విశాలమైన కష్టజీవులు ప్రజల మద్దతు లేకుండా దేశాన్ని కాపాడలేనని అర్థమ వుతున్నదా? లేదా ఇదో కొత్తనటనా..? తేలవలసి ఉంది. ఇంకా.. అదే రోజు జాతీయ చేనేత దినోత్సవం (ఆగస్టు 7) కనుక చేనేత రథం ప్రగతి మార్గంలో పయనిస్తున్నట్టు మోడీ పేర్కొన్నారు. ఎంతవింత? 2,600 ఎగ్జిబిషన్‌ల ద్వారా 43 లక్షల మంది చేనేత కార్మికులకు మార్కెట్ సౌక ర్యం లభించిందని, 1,700 కోట్లు అమ్మకాలు జరిగాయని వెల్లడించారు. అంటే ఈ సంఖ్య మూడింట ఒక వంతు మాత్రమే. మిగతా ఎనభై లక్షల చేనేత కార్మిక కుటుంబాల పరిస్థితి ఏమిటి? అగమ్యగోచరం..? చెప్పకనే చెప్పినట్లయింది..అటు వ్యవసాయానికైనా ఇటు చేనేతకైనా గాంధీజీ చెప్పినట్టు చేయాల్సిన్న ముఖ్యపనులు రెండు. కల్తీలేని నాణ్యమైన విత్తనాలు, నూలు, పట్టు వంటి ముడి సరుకులు సరసమైన ధరలకు సరఫరా చేయడం, రైతన్నలు, నేతన్నలు సృష్టించే పంటలకు, వస్త్రాలకు గిట్టుబాటు ధరలతో మార్కెట్ సౌకర్యం కల్పించడం. ప్రభుత్యాలు ఇవేమి చేయకుండా ఎవరెంత సర్కస్ చేసినా..? ఎన్ని మాయమాటలు చెప్పినా మరో కొత్త నాటకానికి తెరతీయడమే. అంతిమంగా రైతన్నలను, నేతన్నలను కార్పోరేట్ వధ్యశిలకు అప్పగించడమే.
కె.శాంతారావు
9959745723
రైతు-నేతన్నలపై మరో కొత్త నాటకం?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES