Thursday, January 1, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమరోప్రపంచం పిలుస్తోంది...

మరోప్రపంచం పిలుస్తోంది…

- Advertisement -

నిన్నటితో పాత సంవత్సరం ముగిసింది. నేడు మన జీవితంలోకి కొత్త ఏడాది ప్రవేశించింది. ఎప్పటిలాగే పేద, మధ్య తరగతి మదిలో ఉదయించే ప్రశ్నలెన్నో- ఈసారైనా దేశం ఊపిరి పీల్చుకుంటుందేమోనన్న చిన్న ఆశ. ప్రజలే కేంద్రంగా పాలన మారుతుందేమోననే ఆశ. రాజ్యాంగం, ప్రజా స్వామ్యం, న్యాయం వంటి మౌలిక సూత్రాలకు మళ్లీ అర్థం దొరుకుతుందే మోననే ఆశ. ప్రజలెదుర్కొంటున్న సమస్యలు యాదృచ్ఛికం కాదు. అవి ఏలికలు అనుసరిస్తున్న విధానాల ఫలితం. ఆ వాస్తవ పరిస్థితులను ఎదు ర్కోకుండా ముందుకు నడవడం అసాధ్యం. ఈ కొత్త సంవత్సరం మన ముందుంచిన సత్యం కఠినమే. ప్రజాస్వామ్యం పేరుతో అధికారిక కేంద్రీ కరణ బలపడుతోంది. మతం పేరుతో విభజన రాజకీయం రాజ్యమేలు తోంది. పేదల ‘ఎజెండా’ వెనక్కిపోతోంది. కార్పొరేట్‌ ప్రయోజనమే ముం దుకొస్తోంది. ఈ పరిస్థితుల్లో దేశం ఎలా నడవాలి? ఇదే కొత్త సంవత్సరపు అసలు ప్రశ్న. ప్రతిఒక్కరూ నిల్చున్నచోటే ఉండకూడదు. ప్రశ్నతో, సంఘీ భావంతో, ఆశయాన్ని భుజాన వేసుకుని కదలాలి ముందుకు.

ఇవాళ దేశం నిలిచిన మలుపులో భయం అలవాటుగా మారింది. అన్యాయం సాధారణమయ్యింది. అస మానత అభివృద్ధిగా ముస్తాబయింది. ప్రశ్న దేశద్రోహంగా ముద్రించ బడింది. వీటన్నింటిని ఎదిరించి నిల బడాలి. విద్యార్థులు తమ భవిష్య త్తును కేవలం పోటీపరీక్షల గదుల్లో వెతకడం మానాలి. ఆలోచించే శక్తిని, ప్రశ్నించే ధైర్యం పెంచుకోవాలి. మేధావులు, బుద్ధిజీవులు తటస్తత ముసు గులో దాగిపోవడం సరికాదు. మౌనం కూడా రాజకీయ వైఖరేనన్న నిజాన్ని గుర్తించాలి. మహిళలు భద్రత కోసం వేడుకునే స్థితి ఉండకూడదు. ఉద్యో గులు, కార్మికులు, తమ హక్కులు దయాదాక్షిణ్యాలు కాదని, అవన్నీ పోరా టాలతోనే సాధ్యమని గుర్తించాలి. రైతులు విధానాల ముందు తలవంచ కుండా సంఘటితంగా నిలబడాలి. ప్రజాస్వామ్యంలో మార్పు పైనుంచి కిందికి రాదు, కిందినుంచే పైకి వస్తుంది. ప్రజాస్వామ్యం ఓటుతో ముగిసేది కాదు, అది ప్రతిరోజూ జరిగే పోరాటం. ఈ పోరాటం విధ్వంసం కోసం కాదు, ఇది రాజ్యాంగాన్ని కాపాడుకునే యాత్ర. ఇది రైతు మద్దతు ధరకు, కార్మికుని హక్కుకు, విద్యార్థి చైతన్యానికి, మహిళా గౌరవానికి అర్థం చేకూర్చే ప్రస్థానం.

దేశం తీవ్రమైన అసమానతల మధ్య ఊగిసలాడుతోంది. ఒక సామాన్య కుటుంబం కొత్త ఏడాదిని సంబరాలతో కాదు- లెక్కలతో స్వాగతిస్తోంది. జీతం ఎంత పెరిగిందో కాదు, ఖర్చులు ఎంత పెరిగాయో ముందు చూసు కుంటున్నది. పిల్లల ఫీజులు, ఇంటి అద్దె, కరెంటు బిల్లు, నిత్యావసర ధరలు- ఇవే వారి ఆర్థిక బడ్జెట్‌. ప్రభుత్వాల అభివృద్ధి మాటలు టీవీల్లో కనిపిస్తాయి, వేదికలపై వినిపిస్తాయి. కానీ, ఈ కుటుంబానికి బడ్జెట్‌ అంటే ప్రభుత్వాలు వల్లించే గణంకాలు కాదు, నెలవారి ఖర్చు. ఉద్యోగ భద్రత, ఆరోగ్య వ్యయం, చదువుకు రుణం, పింఛన్‌ మీద అనిశ్చితి. ఏ చిన్న జబ్బు వచ్చినా మొత్తం బడ్జెట్‌ కూలి పోతుందన్న ఆందోళన. అయినా ఈ కుటుంబమే పన్నులు కడుతోంది. చట్టాన్ని పాటి స్తోంది. దేశం బాగుండాలని ఆశిస్తోంది. ఆశలు వ్యక్తిగతం కావు, ఇవి దేశపు ఆరోగ్య సూచికలు. ఒక పేదవాడు మరింత పేదరికంలోకి కూరుకు పోవడం పాలనావైఫల్యం. ఒక కుటుం బం భయంతో, అప్పులతో, అభద్రతతో బతుకుతుంటే- అది అభివృద్ధి కానే కాదు. పెట్టుబడిదారి సమాజం మనిషిని కేవలం వినియోగదారునిగా మార్చిన దుస్థితికి అద్దం.

అభివృద్ధి అనే మాట దేశంలో ఎంతగట్టిగా వినిపిస్తున్నా, పేదరికం మాత్రం మౌనంగా కేకలు వేస్తూనేవుంది.నిరుద్యోగుల కల చెదిరి పోతోంది. రైతుకు రుణభారమే మిగిలిపోతోంది.దళితులు,ఆదివాసులు, మైనార్టీలపై ‘అభద్రత’ కత్తి వేలాడుతూనే ఉంది. రాజ్యాంగం స్థానంలో రాజకీయ అహంకారం పెరుగుతోంది. ఈ సమయంలో కొత్త సంవత్సరం సంఘీభావం, సంస్కరణలను కోరుతోంది. దేశ భవిష్యత్తు వ్యక్తిగత కలలతోనే కాదు, సామూహిక చైతన్యంతో నిర్మితమవు తుంది. ప్రశ్న.. నేరం కాదు. నిరసన.. దేశద్రోహం కాదు. ఇవి మనకు రాజ్యాంగమిచ్చిన హక్కులు. వాటిని వినియోగించు కోకపోతే ప్రజాస్వామ్యం కాగితాలకే పరిమితమవుతుంది. అందుకే ప్రజలు ఓటేసి మౌనంగా ఉంటామంటే కుదరదు, ఆ దశను దాటాలి. ప్రశ్నించడం, నిరసించడం, ఐక్యంగా నిలబడ టం- ఇవే దేశాన్ని ముందుకు నడిపే శక్తులు. మీడియా కూడా కార్మికుడి చెమటను, రైతు కన్నీటిని, యువత ఆశలను, మహిళల శ్రమను వార్తలుగా కాదు- విలువలుగా చూపిస్తూ ముందుకు పోవాలి. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికీ ఒకేలా రావచ్చు.కానీ, బాధ్యతలు మాత్రం ఒక్కోవర్గానికి ఒక్కోలా ఉంటాయి. కొత్త ఏడాదంటే పాత అన్యాయాలను మర్చిపోవడం కాదు, వాటిని మార్చే సంకల్పం. ఈ సందర్భంగా శ్రీశ్రీ మాటల్ని ఒక్కసారి మననం చేసుకోవాలి.
”మరోప్రపంచం..మరోప్రపంచం..
మరోప్రపంచం..పిలిచింది.
పదండి ముందుకు..
పోదాం పోదాం పైపైకి…”

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -