సాధారణంగా మనం అనుకున్నది వెంటనే జరగకపోతే కొంత ఆందోళన ఉంటుంది. అయితే కొందరు ప్రతి విషయానికి ఆందోళన చెందుతుంటారు. ఈ ఆందోళన పరిధులు దాటితే మాత్రం ఇదొక మానసిక సమస్యగా మారుతుంది. ముఖ్యంగా ఒకే విషయం గురించి అదే పనిగా ఎక్కువగా ఆలోచించడం, కలత చెందడం, రిలాక్స్ అవ్వడానికి ఇష్టపడకపోవడం, ఎప్పుడూ డల్‌గా అనిపించడం, ఊపిరి ఆడనట్లు ఉండడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఏకాగ్రత లోపించడం వంటివి దీని ముఖ్య లక్షణాలు.
ఇలా అతిగా ఆందోళన చెందే వ్యక్తుల మనస్తత్వం చాలా వరకు సున్నితంగా ఉంటుంది. అందుకే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా ఆందోళనలో ఉన్న వ్యక్తికి అనేక రకాల ఆలోచనలు వస్తుంటాయి. అంతకు మించి ఎన్నో భావోద్వేగాలు కూడా కలుగుతాయి. ఇలాంటి సమయంలో మనసులో ఉన్న బాధ, ఆలోచనల గురించి ఇతరులతో పంచుకుంటే కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే ఎవరైనా ఆందోళన చెందుతున్నట్టు అనిపిస్తే మొదట వారి మనసులో ఉన్న బాధ, ఆలోచనలు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఫలితంగా వారు వాటి నుండి తేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే వారు చెప్పేదాన్ని బట్టి మనం ఎలా స్పందించాలనే విషయంలో కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది.
ఆందోళన చెందే వ్యక్తులు చాలా వరకు కాసేపటి తర్వాత ఎదుటి వ్యక్తి సాంత్వన కలిగించే మాటల వల్ల తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటారు. కానీ కొందరు మాత్రం అలా కాదు… అలాంటి వారు నిపుణుల సహాయం తీసుకోవాలి. వారిని ఒంటరిగా పంపించకుండా ఎవరైనా తోడుగా వెళ్లాలి. దీనివల్ల ‘నీకు నేను తోడున్నాను’ అనే భరోసాతో పాటు వారిలో నమ్మకాన్ని కలిగించవచ్చు. ఈ నమ్మకం వల్ల మీరు చెప్పే మాటలు కూడా వారి మనసుని బాగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇవి వారిని సాధారణ స్థితికి తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
సాధారణ స్థితిలోనే మనం చెప్పే మాట ఎదుటి వ్యక్తి వినకపోవచ్చు. అలాంటిది అతిగా ఆందోళన చెందే వ్యక్తులు చెప్పిన వెంటనే మన మాట వినాలని ఆశించడం అత్యాశ అవుతుంది. కనుక ఒకటికి పదిసార్లు వారికి నచ్చజెప్పాలి. మన మాట వినేలా చేసుకోవడానికి అవసరమయ్యే సహనాన్ని కలిగి ఉంటూనే వారిలోనూ మానసిక ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయాలి. మనలో ఉన్న సహనం కూడా వారిలో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడే సాధనమే అని గుర్తుంచుకోవాలి.
అతిగా ఆందోళన చెందే వ్యక్తులకు సాధారణ సమయాల్లో నిర్ణయాత్మక శక్తి బాగానే ఉంటుంది. కానీ ఏదైనా విషయం గురించి లోతుగా ఆలోచించేటప్పుడు లేదా ఆందోళనకి గురైనప్పుడు మాత్రం వారు తమ నిర్ణయాత్మక శక్తిని కోల్పోయే అవకాశాలున్నాయి. అందుకే ఆ సమయంలో వారు దేనికి సంబంధించైనా సరే ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తపడాలి. మరీ అవసరమైతే వారికి బదులుగా వారి సమక్షంలో వారి సమ్మతితో మీరే నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచిదే. అలాగే వారి మనోభావాలు పంచుకోవడం, సరదాగా కలిసి బయటకు వెళ్లడం, పాటలు వినడం ఇలా వారికి నచ్చే పనుల్లో తోడుగా ఉండడం వల్ల మానసికంగా వారిలో మరింత త్వరగా మార్పు వస్తుంది. ఫలితంగా వారు ఆందోళన నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది.
ఆందోళన
- Advertisement -
- Advertisement -


