పట్టువీడని జీవన్‌రెడ్డి.. విఫలమైన ఏఐసీసీ, పీసీసీ దౌత్యం
‘ఇందిరా భవన్’ పేరు తొలగింపు.. సంకేతం స్పష్టం!
కాంగ్రెస్‌కు నేడు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి రాజీనామా
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ధ్రువతారగా వెలిగిన మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి ఎపిసోడ్ ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరింది. వారం రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ ఆయన పార్టీ వీడటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఏఐసీసీ, పీసీసీ స్థాయి నేతలు మంగళవారం ఉదయం స్వయంగా రంగంలోకి దిగి గంటల తరబడి చర్చలు జరిపినా.. ఆయన మాత్రం ‘సారీ.. నా దారి నాదే’ అని కుండబద్దలు కొట్టారు.

జగిత్యాలలోని జీవన్‌రెడ్డి నివాసం మంగళవారం హైడ్రామాకు వేదికైంది. ఉదయాన్నే పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్ నేరుగా ఆయన ఇంటికి వెళ్లి సుదీర్ఘంగా చర్చించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ఆ వెంటనే ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్ రెడ్డి, సచిన్ సావంత్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరులు విడతల వారీగా భేటీ అయ్యారు. అయితే, ఈ బుజ్జగింపులేవీ జీవన్‌రెడ్డిని కరిగించలేక పోయాయి. ‘దశాబ్దాల పరాభవం చాలు.. ఇక నా వల్ల కాదు’ అంటూ ఆయన నిక్కచ్చిగా చెప్పేసినట్టు సమాచారం.
‘ఇందిరా భవన్’ పేరు తొలగింపు..
మాటల కంటే చేతలే బలమైనవని జీవన్‌రెడ్డి నిరూపించారు. అధిష్టాన నేతలు వచ్చి వెళ్లిన కొద్దిసేపటికే, తన నివాసానికి దశాబ్దాలుగా ఉన్న ‘ఇందిరా భవన్’ పేరును తొలగించి, కేవలం తన పేరును మాత్రమే ఉంచుకున్నారు. ఫ్లెక్సీలనూ తొలగించడంతో ఆయన కాంగ్రెస్‌తో ఉన్న బంధాన్ని తెంచుకున్నట్టేనని అనుచరులు భావిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నేడు (మార్చి25 బుధవారం) జీవన్ రెడ్డి తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే తన అనుచర గణానికి ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు. ఒకవేళ అధిష్టానం ముందే మేల్కొని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని, ఇప్పుడు నిర్ణయం మార్చుకోవడం అసాధ్యమని ఆయన సన్నిహితులతో వ్యాఖ్యానించారు.



