Monday, June 2, 2025
E-PAPER
Homeఅంతరంగంఅనుబంధాలు

అనుబంధాలు

- Advertisement -

మానవ జీవన యానంలో ఎత్తు పల్లాలు, ఆటుపోట్లు, కష్టసుఖాలు, అవమానాలు, ప్రశంసలు అనివార్యం. దీన్ని అర్థం చేసుకుంటూ వాటిని సమతూకంలో పెట్టుకుంటే జీవితంలో ఎదిగే అవకాశం ఉంటుంది. అవగాహనే లేకుంటే తప్పులను సవరించుకోవాలనే ఆలోచన రాదు. మనిషి సంఘజీవి. కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు, ఇరుగుపొరుగు వారితో కలయిక అనేవి అనివార్యం. కనుక ఇలాంటి సంబంధాలను కాపాడుకోవల్సిన అవసరం చాలా ఉంది. కానీ ఇవేవీ పట్టించుకోకుండా చాలామంది తప్పటడుగులు వేస్తున్నారు. తర్వాత అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనకు తెలియకుండానే నోరు జారడం, ఇతరులను మానసిక క్షోభకు గురి చేయడం, అవమానపరిచిన సంఘటనలు జీవితంలో కోకోల్లలు ఉండొచ్చు. కుటుంబ సభ్యుల మధ్యనే అలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల పిల్లలు ప్రదర్శిస్తున్న వైఖరి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుండి వ్యస్టీ కుటుంబ వ్యవస్థ వైపుగా పరిణామ క్రమం జరుగుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. నేటి బిజీ జీవితంలో పిల్లలకు కనీసం తమ తల్లిదండ్రుల పట్ల తమ బాధ్యతను గుర్తించడానికి సమయం ఉండడం లేదు. ఇక విదేశాల్లో ఉన్న వాళ్లైతే కన్నవారు చనిపోయినా ‘రాలేమని, వచ్చి మాత్రం ఏం చేస్తాము’ అనే కబురు పంపుతున్న సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో. సమాజాన్ని వాణిజ్య ధోరణి పట్టిపీడిస్తున్న నేటి తరుణంలో, ఆస్తులు, అంతస్తులు, లాభాలు, ప్రయోజనాలు వంటి స్వార్థపూరిత వాతావరణంలో పెరుగుతున్న పిల్లల నుండి ఇంతకు మించి గొప్పగా ఆశించడం అత్యాశే అవుతుంది.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న కారల్‌ మార్స్క్‌ మాటలు పిల్లలు – తల్లిదండ్రులకు మధ్య ఉన్న సంబంధానికి కూడా వర్తిస్తుంది. రాబోయే కాలంలో పరిస్థితి మరింత దిగజారే అవకాశమూ లేకపోలేదు. అక్కడక్కడ మినహాయిస్తే దాదాపు అన్ని కుటుంబాల్లో ఇదే ధోరణి కనిపిస్తోంది. కొందరు తల్లిదండ్రులు పిల్లలే కదా అని చూసీ చూడనట్లు ఊరుకుంటుంటే కొందరు నిలదీసి ప్రశ్నిస్తారు. మరికొందరైతే అవమానభారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
కొందరు పిల్లలు ఆస్తుల కోసం రక్త సంబంధాలను మరిచి గొడవలు పెట్టుకుంటున్నారు. చివరకు చంపుకునే అంత వరకు వెళుతున్నారు. అన్న, చెల్లి, అక్క, తమ్ముడు వంటి అనుబంధాలను మర్చిపోతున్నారు. చాలా మంది ఆస్తులు సంపాదించడమే ప్రపంచంగా బతికేస్తున్నారు. పిల్లలు ఇలా తయారు కావడానికి తల్లిదండ్రుల పెంపకం కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. వాళ్లు తమ తల్లిదండ్రులను ఎంత బాధ్యతగా, కంటికి రెప్పలా కాపాడుకుంటారో అదే పిల్లలకూ అలవడుతోంది. తల్లిదండ్రులే తమ పిల్లలు బాగా చదువుకొని బాగా డబ్బు సంపాదించాలి, మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. పిల్లలు ఓ స్థాయిలో ఉండాలని, తమ కంటే గొప్పగా బతకాలని కోరుకోవడంలో తప్పేం లేదు. కానీ చిన్నతనం నుండి పిల్లలకు అదే నూరిపోయకూడదు. అలా చేయడం వల్ల తర్వాత కాలంలో డబ్బే సర్వస్వంగా కనిపించి, కనిపెంచిన తల్లిదండ్రులనే మర్చిపోయే స్థితికి ఎదుగుతున్నారు.
కనుక పిల్లల్ని పెంచేటపుడు చదువు, ఉద్యోగంతో పాటు మానవ సంబంధాలు, సమాజిక విలువలు కూడా కచ్చితంగా నేర్పించాలి. ఇతరుల పట్ల సానుభూతిగా ఉండడం, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం, చేతనైన సాయం చేయడం వంటిని పిల్లలకు నేర్పించాలి. ప్రభుత్వాలు కూడా మానవ సంబంధాలను, కుటుంబ బంధాలను మెరుగుపరచడానికి కొన్ని ప్రత్యేక పద్ధతులు అవలంభించాలి. పాఠ్యాంశాలలో ఇటువంటి విషయాలను జోడించాలి. మనుషుల మధ్య బంధాలు పునరుద్ధరించడానికి, కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. మానవ సంబంధాలను మరింతగా విస్తరించేందుకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -