తిరువనంతపురం : రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ సందర్భంగా ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 9,70,108 దరఖాస్తులు అందాయి. వీటిలో 4.05 లక్షల దరఖాస్తులు డిసెంబర్ 23న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణకు ముందు సమర్పించగా, 5.64 లక్షల దరఖాస్తులు ముసాయిదా విడుదలైన తర్వాత దాఖలయ్యాయి. ముసాయిదా జాబితా ప్రచురణకు ముందు అందిన దరఖాస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మొదటిసారి ఓటు వేయబోయే వారితో పాటు, వివిధ కారణాల వల్ల గతంలో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించబడిన వారు కూడా దరఖాస్తుదారులలో చాలామంది ఉన్నారు.
మరణించిన వ్యక్తులు, నకిలీ నమోదులు, నమోదిత చిరునామాలలో నివసించని వ్యక్తులతో సహా 5,528 మంది పేర్లను తొలగించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా అందాయి. ముసాయిదా జాబితా విడుదల చేయడానికి ముందు, 2,419 మంది ఓటర్లను తొలగించాలని దరఖాస్తులు దాఖలయ్యాయి. అయితే, ముసాయిదా జాబితాలో వారి పేర్లు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషన్ పేర్కొంది. అదేవిధంగా ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు దరఖాస్తులు సమర్పించడానికి, అభ్యంతరాలు తెలియజేయడానికి ఈనెల 30 చివరి తేదీ గురువారంతో ముగియాల్సిన అసలు గడువును పొడిగించింది. దీంతో రాబోయే రోజుల్లో దరఖాస్తుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు. అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, ఫిబ్రవరి 21న తుది ఓటర్ల జాబితాను ప్రచురించాలని కమిషన్ నిర్ణయించింది. 30వ తేదీ తర్వాత కూడా దరఖాస్తు దారులను ఓటర్ల జాబితాలో చేర్చడానికి అనుమతిస్తారు. అయితే అటువంటి పేర్లను అనుబంధ జాబితాలో చేర్చుతారు.
కేరళలో 9.70 లక్షల ఓటర్ల నమోదుకు దరఖాస్తులు
- Advertisement -
- Advertisement -



