No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeజాతీయంఆధార్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేయండి

ఆధార్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేయండి

- Advertisement -

తొలగించబడిన ఓటర్లకు సుప్రీం ఆదేశాలు
రాజకీయ పార్టీలు సాయం చేయాలని సూచన
న్యూఢిల్లీ :
బీహార్‌లో ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు, వాటిని చేర్చాలని కోరుతూ ఆధార్‌ ధృవపత్రాన్ని చూపుతూ ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. వ్యక్తిగతంగా దరఖాస్తులు అందజేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆ దరఖాస్తుతోపాటు ఎన్నికల కమిషన్‌ పేర్కొన్న 11 పత్రాల్లో ఏ ఒక్కదాన్నయినా లేదా ఆధార్‌ కార్డు కాపీని అందజేయవచ్చని వివరణ ఇచ్చింది. ఈ దరఖాస్తులు పెట్టుకోవడానికి ఓటర్లకు వారి పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలింగ్‌ ఏజెంట్లు సహాయపడేలా చూడాలని బీహార్‌లో గుర్తింపు పొందిన 12 రాజకీయ పార్టీలను జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోమాల్యా బాగ్చిలతో కూడిన బెంచ్‌ ఆదేశించింది. ఈ విషయంలో ఇప్పటికే పిటిషనర్లు కాకపోతేే, గుర్తింపు పొందిన ఆ రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రతివాదులు గా వుంటాయని కోర్టు పేర్కొంది.

రాజకీయ పార్టీలకు 1.6 లక్షల మందికి పైగా పోలింగ్‌ కేంద్రాల ఏజెంట్లు ఉన్నప్పటికీ, వారి నుంచి రెండు అభ్యంతరాలు మాత్రమే రావడం పట్ల కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. మరోవైపు పోలింగ్‌ కేంద్రాల ఏజెంట్లు పేర్కొన్న అభ్యంతరాలను అధికారులు గుర్తించడం లేదని కొన్ని పార్టీలు తెలిపాయని కోర్టు పేర్కొంది. ఏజెంట్లు అందజేసే అభ్యంతరాలను పోలింగ్‌ కేంద్రాల అధికారులు (బీఎల్‌ఓ) అందుకున్నట్లుగా రసీదులు జారీ చేయడం లేదని కొందరు పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దానిపై కోర్టు స్పందిస్తూ, భౌతికంగా దరఖాస్తులు అందజేసినప్పుడు రసీదులు ఇవ్వాల్సిందేనని కోర్టు బీఎల్‌ఓలను ఆదేశించింది.
ఈసీ తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ న్యాయవాది రాకేశ్‌ ద్వివేది మాట్లాడుతూ ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసేందుకు ఎన్నికల కమిషన్‌కు సహకరించడానికి ముందుకు రావాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలదనీ, వారు సహకరించడం లేదని అన్నారు.

ఈరోజు వరకు ఒక్క రాజకీయ పార్టీ కూడా ఒక్క అభ్యంతరం లేవనెత్తుతూ దరఖాస్తు ఇవ్వలేదని, కోర్టును ఆశ్రయించలేదని చెప్పారు. దానిపై సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, ఎఎం సింఘ్వి తీవ్రంగా స్పందించారు. బీహార్‌లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా తరపున తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని కపిల్‌ సిబల్‌ చెప్పారు. కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌, సీపీఐ, ఎన్సీపీ తదితర పార్టీలు సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్‌పై తాను వాదనలు వినిపిస్తున్నానని సింఘ్వి తెలిపారు. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) తరపున న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ మాట్లాడుతూ, చాలామంది రాష్ట్రానికి వెలుపల వలస కార్మికులుగా పనిచేస్తూ వుంటారని, వారు దరఖాస్తులు అందజేయలేరని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని పార్టీలకు పోలింగ్‌ కేంద్రాల స్థాయి ఏజెంట్లు లేరన్నారు. అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన ఆర్జేడీకి కూడా సగం నియోజకవర్గాల్లోనే ఏజెంట్లు ఉన్నారని తెలిపారు. దానిపై కోర్టు స్పందిస్తూ ఆధార్‌ కార్డులతో ఆన్‌లైన్‌లో ఏ ఓటరైనా తమ పేర్లు చేర్చాలని కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

స్వాగతించిన సీపీఐ(ఎం)
బీహార్‌లో ముసాయిదా ఓటర్ల జాబితా అంశంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడాన్ని సీపీఐ(ఎం) స్వాగతించింది. మిగిలిన సమయం చాలా పరిమితంగా ఉన్నందున ఓటర్ల జాబితా నుంచి 65 లక్షల పేర్లను తొలగించడం వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చలేకపోవచ్చని పేర్కొంది. అయినా ఈ విషయంలో సుప్రీం కోర్టు జోక్యాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad