సభ్యసాచి ఘోస్‌కు పాల్వాయి హరీశ్‌బాబు వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గంలో బెంగాలీ భాష టీచర్లను నియమించాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. తమ నియోజకవర్గంలో బెంగాలీ క్యాంపుల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో బెంగాలీ భాషను బోధించే ఉపాధ్యాయులు లేరనీ, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా బెంగాలీ టీచర్లను నియమించాలని కోరారు. ఈ సందర్భంగా ఘోష్ మాట్లాడుతూ..త్వరలోనే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
తప్పుడు వార్తల్ని, ప్రచారాలను ఖండిస్తున్నాం : పాల్వాయి
బీఆర్‌ఎస్ సోషల్‌మీడియాలో తనపైనా, సహచర ఎమ్మెల్యే పాయల్ శంకర్‌పైనా తప్పుడు వార్తలు సృష్టించడాన్నీ, ప్రచారం చేయడాన్నీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు తెలిపారు. గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గోవాలో రహస్యంగా మహేశ్‌కుమార్‌గౌడ్‌తో తాను, పాయల్ శంకర్ భేటీ అయ్యి రేవంత్‌రెడ్డి సర్కారును కూల్చే కుట్ర చేస్తున్నామని తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తమ అసమర్థతలను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై తప్పుడు ప్రచారాలు చేయడం తగదని సూచించారు. తమపై అసత్య ప్రచారాలకు దిగేవారిపై చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు.