Thursday, March 26, 2026
E-PAPER
Homeజాతీయంఫైనాన్స్‌ బిల్లు ఆమోదం

ఫైనాన్స్‌ బిల్లు ఆమోదం

- Advertisement -

– ఆదాయపు పన్ను విధానంలో మార్పులు
– ఆదాయపు పన్ను శాఖ అధికారులకు మరిన్ని అధికారాలు
– ఫైనాన్స్‌ బిల్లు నిబంధనలు కేవలం కార్పొరేట్లకు మాత్రమే సహాయపడతాయి: ప్రతిపక్షాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 32 సవరణలతో కూడిన ఫైనాన్స్‌ బిల్లు-2026ను లోక్‌సభ ఆమోదించింది. ఫైనాన్స్‌ బిల్లు ఆమోదంతో లోక్‌సభలో బడ్జెట్‌ ఆమోద ప్రక్రియ పూర్తయింది. ఈ బిల్లును గురువారం రాజ్యసభ పరిశీలించనుంది. రాజ్యసభ ఫైనాన్స్‌ బిల్లును ఆమోదించడంతో, 2026-2027 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ సిఫారసులకు చట్టబద్ధమైన ఆమోదం లభిస్తుంది. ఫైనాన్స్‌ బిల్లు ఆమోదంతో దేశ ఆదాయపు పన్ను విధానంలో గణనీయమైన మార్పులు రానున్నాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారులకు మరిన్ని అధికారాలు లభిస్తాయి. ఎటువంటి కాలపరిమితి లేకుండా పాత ఆదాయపు పన్ను మదింపు కేసులను కూడా తిరిగి తెరిచే అధికారం అధికారులకు ఉంటుంది. సాంకేతిక సమస్యల కారణంగా కోర్టులు లేదా ట్రిబ్యునల్స్‌ ద్వారా చెల్లనివిగా ప్రకటించబడిన కేసులలో విచారణను పున్ణప్రారంభించడానికి సహాయపడే నిబంధనలు కొత్త ఫైనాన్స్‌ బిల్లులో ఉన్నాయి. ఇది కోర్టులను తప్పించుకునే చర్య అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫైనాన్స్‌ బిల్లులోని నిబంధనలు కేవలం కార్పొరేట్లకు మాత్రమే సహాయపడతాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

లోక్‌సభలో ఎఫ్సీఆర్‌ఏ సవరణ బిల్లు
లోక్‌సభలో విదేశీ విరాళాలు (నియంత్రణ) చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించిన బిల్లును బుధవారం కేంద్ర హోం సహాయ మంత్రి నిత్యానంద్‌ రారు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పారదర్శకతను పెంచడానికి, విదేశాల నుంచి వచ్చిన నిధుల సరైన వినియోగాన్ని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. విదేశీ నిధులతో బలవంతపు మత మార్పిడులకు పాల్పడే వ్యక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఈ బిల్లు ప్రమాదకరమైనదని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. బిల్లు ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకించారు. దీనిద్వారా సర్వఅధికారాలు కేంద్ర ప్రభుత్వానికి అప్పగించబడుతున్నాయని, ఈ బిల్లు క్రూరమైనదని పేర్కొన్నారు. ఎలాంటి రాజ్యాంగ రక్షణ లేకుండా కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారం లభిస్తుందని ప్రతిపక్ష ఎంపిలు పేర్కొన్నారు. ఈ బిల్లు అధికార కేంద్రీకరణను నిర్ధారిస్తుందని స్పష్టం చేశారు.

రాజ్యసభలో కేంద్ర సాయుధ పోలీసు బలగాల బిల్లు
అలాగే రాజ్యసభలో కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సాధారణ పరిపాలన) బిల్లును ప్రవేశపెట్టారు. కేంద్ర సాయుధ బలగాల నాయకత్వంలో ఐపిఎస్‌ అధికారుల నియామకానికి సంబంధించిన నిబంధనలు ఉన్న ఈ బిల్లును ప్రతిపక్షం తీవ్రంగా వ్యతిరేకించింది. 2025 నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వును ఉల్లంఘించే ఉద్దేశంతోనే ఈ బిల్లును తీసుకువచ్చారని ప్రతిపక్ష సభ్యులు విమర్శించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో ఐపిఎస్‌ అధికారుల డిప్యుటేషన్‌ను తగ్గించాలన్నది సుప్రీంకోర్టు ఉత్తర్వు. అయితే ఈ కొత్త బిల్లుతో సీఆర్పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్బీ, సీఐఎస్‌ఎఫ్‌ వంటి కేంద్ర సాయుధ బలగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

రాజ్యసభలో ట్రాన్స్‌జెండర్‌ వర్గం హక్కులను ఉల్లంఘించే బిల్లు ఆమోదం
ట్రాన్స్‌జెండర్‌ వర్గం హక్కులను ఉల్లంఘించే వివాదాస్పద సవరణ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించింది. ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య, మంగళవారం లోక్‌సభ, బుధవారం రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించాయి. ఈ బిల్లు ‘ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) చట్టం, 2019’కి ప్రధాన సవరణలు చేయాలని కోరుతోంది. ఈ బిల్లును ఒక ప్రత్యేక కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను తిరస్కరిస్తూ, రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లు ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల స్వీయ-నిర్ణయాధికారాన్ని ఉల్లంఘిస్తుందని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. ఈ కొత్త బిల్లులో అనేక వివాదాస్పద నిబంధనలు ఉన్నాయి. వాటిలో ‘తమ సొంత నమ్మకాల ఆధారంగా తమ లింగ గుర్తింపును నిర్ణయించుకునే వారిని’ ట్రాన్స్‌జెండర్‌ నిర్వచనం నుండి మినహాయించడం కూడా ఒకటి. కొత్త సవరణ ప్రకారం, ఒక వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌ అని ధ్రువీకరించే సర్టిఫికేట్‌ను, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ లేదా డిప్యూటీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ నేతృత్వంలోని వైద్య బోర్డు సిఫార్సు మేరకు జిల్లా మేజిస్ట్రేట్‌ జారీ చేయాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రపాలిత ప్రాంత పరిపాలన యంత్రాంగం వైద్య బోర్డులను ఏర్పాటు చేస్తాయి. వైద్య మండలి సిఫార్సు విశ్వసనీయంగా లేకపోతే, జిల్లా మేజిస్ట్రేట్‌ ఇతర నిపుణులను పరీక్షలు నిర్వహించమని కూడా ఆదేశించవచ్చు.

ట్రాన్స్‌జెండర్‌ సమాజంతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా చట్టానికి సవరణ తీసుకురావడం ఆమోదయోగ్యం కాదని ప్రతిపక్ష సభ్యులు పేర్కొన్నారు. ఈ సవరణలో, గౌరవప్రదంగా జీవించడానికి రాజ్యాంగం వాగ్దానం చేసిన హక్కులను ట్రాన్స్‌జెండర్‌ సమాజానికి నిరాకరించే నిబంధనలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం, దేశంలో సుమారు ఐదు లక్షల మంది ట్రాన్స్‌జెండర్లు ఉండగా, కేవలం 32,000 మంది మాత్రమే గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 31 శాతం మంది ఆత్మహత్యకు ప్రయత్నించారని అంచనా. వీరిలో 50 శాతం మంది 20 ఏళ్లలోపు వయసులోనే ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ గణాంకాలు దేశంలో ట్రాన్స్‌జెండర్‌ సమాజం ఎదుర్కొంటున్న భారీ సవాళ్లను స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర సంక్షోభాలు, వివక్షను ఎదుర్కొంటున్న సమాజాన్ని ఈ కొత్త సవరణ మరింతగా ఏకాకిని చేస్తుందని కూడా ప్రతిపక్షం ఆరోపించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -