కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు
పూలే, అంబేద్కర్ స్ఫూర్తితో కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు
నవతెలంగాణ-మహబూబాబాద్
మనుషులంతా సమానమనే భావనను పెంపొందించడానికి ఏప్రిల్ నెల మొత్తాన్ని మహనీయుల మాసంగా పాటిస్తూ కులరహిత సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు పిలుపు నిచ్చారు. మహబూబాబాద్ జిల్లాలోని పెరుమాండ్ల జగన్నాధం భవన్‌లో మంగళవారం కేవీపీఎస్ ఆధ్వర్యంలో కులరహిత సాంస్కృతిక ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహించారు. కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ.. ఏప్రిల్ 11న జ్యోతిబాపూలే జయంతి, 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆ నెల మొత్తాన్ని మహనీయుల మాసంగా పాటించాలన్నారు. రాష్ట్రంలో కొనసాగు తున్న కుల వివక్ష, అంటరానితనాన్ని రూపుమాపేందుకు కులరహిత సాంస్కృతిక ఉత్సవాల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 200 గ్రామాల్లో వీడీసీల పేరిట అట్టడుగు తరగతులపై దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని, తక్షణమే ప్రభుత్వం వీడీసీలను నిషేధించాలని డిమాండ్ చేశారు. కులరహిత సాంస్కృతిక ఉద్యమాలలో కులవివక్ష అంటరానితనాన్ని వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, కవులు కళాకారులు, మేధావులు భాగస్వాములు కావాలని కోరారు. ప్రజల్లో చైతన్యం కలగడానికి సాంస్కృతిక సారధి కళాకారుల ద్వారా ప్రభుత్వమే విస్తృత ప్రచార కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోడిగుడ్డుపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ వైఫల్యం వల్ల సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు గ్యాస్ కొరత ఏర్పడిందన్నారు. తద్వారా విద్యార్థులకు భోజనం వడ్డింపు ఇబ్బందిగా మారిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కూడా సమస్య ఏర్పడిందని చెప్పారు. గ్యాస్ కొరతకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికాతో అంటకాగుతున్న లొంగుబాటు వైఖరే కారణమని చెప్పారు.
రాష్ట్ర బడ్జెట్‌లో దళితులకు భారీ ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కేటాయింపులు నిధుల విడుదల, ఖర్చులకు మధ్య ఎక్కడా పొంతన ఉండటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుడ్డేల రామ్మూర్తి, ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గుగ్గిళ్ళ పీరయ్య, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కార్యదర్శి నీరుడు సామేలు, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి ప్రభాకర్, డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఏర్పుల వీరస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి హరి నాయక్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి యమగాని వెంకన్న, సీఐటీయూ నాయకులు వెంకన్న, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి నక్క సైదులు తదితరులు పాల్గొన్నారు.
‘ఏప్రిల్’ను మహనీయుల మాసంగా పాటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



