Wednesday, March 4, 2026
E-PAPER
Homeఆటలుసఫారీలకు ఎదురుందా?

సఫారీలకు ఎదురుందా?

- Advertisement -

న్యూజిలాండ్‌తో సెమీఫైనల్‌ పోరు నేడు
రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

నవతెలంగాణ-కోల్‌కతా
దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌.. ప్రపంచ క్రికెట్‌లో ఎంతోమంది తటస్థ అభిమానులను సంపాదించుకున్న జట్లు. ఆధునిక క్రికెట్‌లో ఈ రెండు జట్లు వైట్‌బాల్‌ ఫార్మాట్‌లో ఐసీసీ టైటిల్‌ అందుకోలేదు. నిలకడగా సెమీఫైనల్స్‌కు చేరుకునే న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికాలు టైటిల్‌ పోరు ముంగిట బోల్తా పడటం సహజం. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో నేడు ఈ రెండు జట్లు ముఖాముఖి సవాల్‌కు సిద్ధమయ్యాయి. దీంతో తటస్థ అభిమానులు ఈ మ్యాచ్‌ను ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా అజేయంగా నిలువగా.. న్యూజిలాండ్‌ పడుతూ లేస్తూ సెమీస్‌కు చేరుకుంది. అయినా, మైదానంలో ఇరు జట్లలో ఎవరినీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తాజా ఫామ్‌, జోరుతో దక్షిణాఫ్రికా ఫైనల్లో బెర్త్‌కు ఫేవరేట్‌గా కనిపిస్తోంది. ఒత్తిడిని అధిగమిస్తూ.. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో సత్తా చాటడంలో రాటుదేలుతున్న న్యూజిలాండ్‌ నేడు ఈడెన్‌గార్డెన్స్‌లో మాయ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ సమరం నేడు.

జోరుమీదున్న దక్షిణాఫ్రికా
2024 టీ20 ప్రపంచకప్‌ రన్నరప్‌ దక్షిణాఫ్రికా.. ఈ రెండేండ్లలో దారుణంగా నిరాశపరిచింది. కానీ భారత పర్యటన తర్వాత సఫారీ శిబిరంలో పెను మార్పులు వచ్చాయి. జట్టులో ఓ స్పష్టత, ఆటగాళ్ల బాధ్యతపై అవగాహన పెరిగింది. కెప్టెన్‌ ఎడెన్‌ మార్‌క్రామ్‌ మునుపెన్నడూ లేనంత ఫామ్‌లో దంచికొడుతున్నాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో బలహీనతలు లేకుండా పోయాయి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా రాణించగల పేసర్లు లుంగిసాని ఎంగిడి, కగిసో రబాడలు సఫారీ బలం. స్లో బాల్స్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్న ఎంగిడిని ఎదుర్కొవటం న్యూజిలాండ్‌ బ్యాటర్లకు నేడు కఠిన సవాల్‌ కానుంది. బ్యాటింగ్‌ లైనప్‌లో క్వింటన్‌ డికాక్‌, ఎడెన్‌ మార్‌క్రామ్‌ సహా డెవిడ్‌ మిల్లర్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, రియాన్‌ రికెల్టన్‌, డెవాల్డ్‌ బ్రెవిస్‌లు కీలకం. స్పిన్‌కు అనుకూలించే ఈడెన్‌గార్డెన్స్‌ పిచ్‌పై స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌తో పాటు పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ ఎడెన్‌ మార్‌క్రామ్‌ మాయ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు న్యూజిలాండ్‌ కాస్త తడబడుతూ కనిపిస్తోంది. బ్యాట్‌తో, బంతితో కెప్టెన్‌ మిచెల్‌ శాంట్నర్‌ ప్రదర్శనే ఆ జట్టుకు కీలకంగా మారుతోంది.

పిచ్‌, వాతావరణం
ఈడెన్‌గార్డెన్స్‌లో నేడు సెమీఫైనల్‌ మ్యాచ్‌కు నల్ల మట్టి పిచ్‌ను వాడుతున్నారు. సహజంగా ఈ పిచ్‌పై స్పిన్‌కు కాస్త అనుకూలత ఎక్కువగా ఉండనుంది. టాస్‌ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. రెండో ఇన్నింగ్స్‌లో మంచు కురువనున్నా.. ఆ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ లేదా బౌలింగ్‌ ఎంచుకునేందుకు తికమక పడుతున్నాయి. సెమీఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. ఐసీసీ సెమీఫైనల్స్‌కు రిజర్వ్‌ డే అందుబాటులో ఉంచింది.

తుది జట్లు (అంచనా) :
దక్షిణాఫ్రికా : క్వింటన్‌ డికాక్‌ (వికెట్‌ కీపర్‌), ఎడెన్‌ మార్‌క్రామ్‌ (కెప్టెన్‌), రియాన్‌ రికెల్టన్‌, డెవాల్డ్‌ బ్రెవిస్‌, డెవిడ్‌ మిల్లర్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, మార్కో యాన్సెన్‌, కార్బిన్‌ బాష్‌, కగిసో రబాడ, కేశవ్‌ మహరాజ్‌, లుంగిసాని ఎంగిడి.
న్యూజిలాండ్‌ : టిమ్‌ సీఫర్ట్‌ (వికెట్‌ కీపర్‌), ఫిన్‌ అలెన్‌, రచిన్‌ రవీంద్ర, గ్లెన్‌ ఫిలిప్స్‌, మార్క్‌ చాప్‌మన్‌, డార్లీ మికెల్‌, మిచెల్‌ శాంట్నర్‌ (కెప్టెన్‌), కొలె మెక్‌కొంకీ, జిమ్మీ నీషమ్‌, మాట్‌ హెన్రీ, లాకీ ఫెర్గుసన్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -