Tuesday, September 30, 2025
E-PAPER
Homeఖమ్మంఏరియా ఆస్పత్రి మరో మైలురాయి

ఏరియా ఆస్పత్రి మరో మైలురాయి

- Advertisement -

– సెప్టెంబర్ లో ఏబై కి మించిన ప్రసవాలు
– పేద గర్భిణీ లకు చేరువలో  ప్రసూతి సేవలు
– హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు 
– మెరుగైన వైద్య సేవలు కల్పించడంలో సఫలీకృతం అవుతున్న జిల్లా యంత్రాంగం
– ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, డీసీహెచ్ఎస్ ల ప్రత్యేక దృష్టి
నవతెలంగాణ – అశ్వారావుపేట

స్థానిక ఏరియా ఆస్పత్రిలో మరో మైలు రాయి నమోదు అయింది. కార్పోరేట్ స్థాయి లో కాకపోయినా ప్రైవేట్ రంగం స్థాయిలో సౌకర్యాలు కల్పించడంతో  గత నెలలో ఒకే రోజు ఆరుగురి కి కాన్పులు చేసి ఆధునిక చికిత్స అందిన ఆసుపత్రి సిబ్బంది ఈ సెప్టెంబర్ లో 52 ప్రసవాలు చేసి తల్లీ బిడ్డలకు మెరుగైన వైద్య సేవలు అందించారు.

2024 లో ఏడాది మొత్తం 201 ప్రసవాలు చేయగా ఈ ఏడాది 9 నెలల లోపే 232 ప్రసవాలు చేసారు. తెలంగాణ లో నేటి ప్రభుత్వం విద్యా వైద్యం,మహిళా ఆరోగ్యం మెరుగుపరచడానికి ప్రధాన్యత ఇవ్వడంతో భద్రాద్రి జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో సైతం వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో మౌళిక సదుపాయాలు,అధునాతన వైద్య పరికరాలు సమకూర్చి,నిపుణులైన వైద్య సిబ్బందిని కేటాయించారు.  దీంతో పరిసర ప్రాంతాల పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు ఉప ముఖ్య మంత్రి బట్టి,తుమ్మల నాగేశ్వరరావు,పొంగులేటి శ్రీనివాసరెడ్డి,స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సూచన మేరకు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్,డీసీహెచ్ఎస్ రవిబాబు లు జిల్లా లో వైద్య రంగాన్ని బలోపేతం చేయడం కోసం నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన వైద్య పరికరాలు,సిబ్బందిని అందుబాటులో తెచ్చారు.

అదనపు ప్రోత్సాహకాలు ప్రకటించి జిల్లా వ్యాప్తంగా స్పెషలిస్ట్ వైద్యులను నియమించారు. ఫలితంగా నేడు పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల కి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో నాణ్యమైన వైద్యం పొందుతున్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకం పెరగడం తో జిల్లాలో అన్ని ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. 

– యాభై ప్రసవాల మైలురాయికి చేరిన పేట ఆస్పత్రి

గతంలో ఎప్పుడూ లేని విధంగా అధిక స్థాయిలో అశ్వారావుపేట ఆస్పత్రిలో ఈ ఏడాది ఏప్రిల్ లో కేవలం పది ప్రసవాలు జరగ్గా సెప్టెంబర్ నెలలో అర్థ సెంచరీ మైలురాయి కి చేరుకుంది. ఈ నెలలో మొత్తం 52 ప్రసవాలు జరిగాయి. అందులో 26 సుఖ ప్రసవాలు కాగా 26 సిజేరియన్ ఆపరేషన్లు ద్వారా ప్రసవాలు జరిగాయి.ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల నమ్మకానికి ఇది నిదర్శనంగా నిలిచింది. ప్రయివేట్ ఆస్పత్రులలో ఒక్కో ప్రసవానికి రూ.50 వ్యయం అవుతున్న నేపధ్యంలో ప్రభుత్వ ఆసుపాత్రుల రూపం లో పేదలకు ఎంతో మేలు జరుగుతుంది. గతం లో స్పెషలిస్ట్ వైద్యులు లేని సమయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీసీహెచ్ఎస్ డాక్టర్ రవి బాబు ప్రత్యేక దృష్టి సారించి ఇద్దరు ప్రసూతి వైద్యులు,ఒక పిల్లల వైద్యుడు, ఇద్దరు మత్తు వైద్యులను నియమించి ఆసుపత్రిని నిత్యం పర్యవేక్షిస్తూ ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారు.ఈ క్రమం లోనే ఆస్పత్రిలో సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ మంచి నడవడికతో ప్రజల ఆదరణ పొందుతున్నారు. విషజ్వరాలు విజృంభిస్తున్న తరుణంలో మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

– ఆస్పత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే జారే ప్రత్యేక కృషి

స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ తరచు ఆస్పత్రిని సందర్శించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారు. ఇటీవలే వంద పడకల భవనాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేయగా, రక్త నిల్వ కేంద్రం ,ఆధునిక పరికరాలను సైతం అందుబాటులోకి తెచ్చారు.ప్రజల నుండి ఎప్పటికప్పుడు వారి స్పందనలు సేకరించి ఆస్పత్రి సిబ్బంది కి తగు సూచనలు చేస్తున్నారు.

– ఆస్పత్రి సిబ్బందికి అభినందన

ప్రసవాలు లో  అర్థ సెంచరి మైలురాయిని చేరిన సందర్భంగా స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, డీసీహెచ్ఎస్ డాక్టర్ రవి బాబు ఆసుపత్రి సిబ్బంది ని అభినందించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా రుక్మిణి, ప్రసూతి వైద్యురాలు డాక్టర్ మౌనిక , మత్తు వైద్యులు డాక్టర్ శంకర్ రావు,డాక్టర్ శివ రామ కృష్ణ ప్రసాద్ , పిల్లల వైద్యులు డాక్టర్ ప్రకాష్ , నర్సింగ్ సిబ్బంది మంగ,ప్రమీల , ఆపరేషన్ థియేటర్ ఇంచార్జి సుజాత, వీరా కుమారి, ఇతర సిబ్బంది ని ప్రత్యేకంగా అభినందించారు.

నెల                          ప్రసవాలు     
జనవరి                         17
ఫిబ్రవరి                         10
మార్చి                           13
ఏప్రిల్                            23
మే                                 26
జూన్                             27
జులై                              25
ఆగస్ట్                            38
సెప్టెంబర్                        52

మొత్తం                         232

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -