Friday, September 26, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఅంగన్వాడీల అరెస్ట్‌

అంగన్వాడీల అరెస్ట్‌

- Advertisement -

చలో సెక్రెటేరియట్‌ ఉద్రిక్తం
ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
ఇందిరాపార్కు ప్రధాన రహదారిపై బైఠాయింపు
సొమ్మసిల్లి పడిపోయిన యూనియన్‌ ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి
ఆందోళనకారులను లాక్కెళ్లి వ్యాన్‌లో పడేసిన పోలీసులు
సీఐటీయూ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ సహా పలువురి నేతల అరెస్టు
జిల్లాల్లో ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు
అక్టోబర్‌ 8న సమ్మెకు పిలుపు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అంగన్వాడీలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. పోలీసులతో జరిగిన తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయినా, లాక్కెళ్లి పోలీస్‌ వ్యాన్లలో పడేశారు. జిల్లాల్లో అంగన్వాడీలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మరికొందర్ని గృహ నిర్భంధం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ అనుబంధం) ఛలో సెక్రటేరియట్‌ పిలుపునిచ్చింది. జిల్లాల్లో ఎక్కడికక్కడ ప్రభుత్వం నిర్బంధం విధించినా, గురువారం వందలాదిమంది అంగన్వాడీలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. సచివాలయ ముట్టడిలో పాల్గొన్నారు. వారిని అడ్డుకొనేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. హైదరాబాద్‌ విద్యానగర్‌ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, అశోక్‌ నగర్‌, దోమల్‌గూడ, ఇందిరాపార్క్‌, ట్యాంక్‌బండ్‌ నుంచి సెక్రెటేరియట్‌ వరకు, లక్డీకపూల్‌, సైఫాబాద్‌, ఖైరతాబాద్‌, మింట్‌కాంపౌండ్‌ వరకు అన్ని రహదారుల్ని పోలీసుల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వందలాదిమంది పోలీసులు, రోప్‌పార్టీలు ఎక్కడికక్కడ పదిమంది మహిళలు కనిపిస్తే, అంగన్వాడీలుగా భావించి, అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అయినా పోలీసుల పద్మవ్యూహాల్ని ఛేదించుకుంటూ అంగన్వాడీలు సెక్రటేరియట్‌ వైపు పరుగులు పెట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు.

పోలీసు నిర్బంధాలతో తమ సంఘటిత శక్తిని అడ్డుకోలేరంటూ పాలకులను హెచ్చరించారు. దోమల్‌గూడ ఏవీ కళాశాల వద్ద పోలీసులు మహిళల పట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, యూనియన్‌ నాయకులు, అంగన్వాడీ టీచర్లపై పిడిగుద్దులు గుద్దుతూ..గిచ్చుతూ బలవంతంగా కాళ్లు, చేతులు పట్టి ఈడ్చుకెళ్లి వ్యాన్లలో పడేశారు. ఈ తోపులాటలో ఆ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి సొమ్మసిల్లి పడిపోయారు. అయినా పోలీసులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లి వ్యాన్‌లో పడేశారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఉపాధ్యక్షులు భూపాల్‌, కె.ఈశ్వర్‌రావు, కార్యదర్శులు జె.వెంకటేశ్‌, పిప్పాల శ్రీకాంత్‌, అంగన్వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు సునీత, కోశాధికారి మంగతో పాటు కవిత, స్వప్ప, పద్మ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. నాయకులను తీసుకెళ్తున్న పోలీసు వ్యాన్లను అంగన్వాడీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వారందర్నీ చిక్కడపల్లి, అంబర్‌పేట, ఖైరతాబాద్‌, అబిడ్స్‌, దోమలగూడ, ఉస్మాన్‌గంజ్‌ తదితర పోలీస్‌ స్టేషన్లలో నిర్భంధించారు. అయినా పట్టువదలని కొందరు అంగన్వాడీలు సచివాలయం వైపు పరుగులు తీశారు. ట్యాంకుబండ్‌ వరకు చేరుకోగానే పోలీసులు వారిని అడ్డుకుని, బలవంతంగా అరెస్టులు చేశారు. మరికొందర్ని అంబేద్కర్‌ విగ్రహం వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నేతలు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అంగన్వాడీలకు రూ.18 వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అలాగే ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీవిద్య నిర్వహణ బాధ్యతను అంగన్వాడీలకే ఇవ్వాలనీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించాలనీ, గతంలో చేసిన 24 రోజుల సమ్మె కాలానికి వేతనాలిచ్చి, పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీలపై పోలీసుల దురుసు ప్రవర్తనను పలు రాజకీయ, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. వారేం గొంతెమ్మ కోర్కెలు కోరలేదనీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని కోరడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు.

అక్టోబర్‌ 8న సమ్మె : పి.జయలక్ష్మి
పోలీసుల అక్రమ అరెస్టుల్ని ఖండిస్తూ, ప్రభుత్వ హామీల అమలు కోరుతూ అక్టోబర్‌ 8వ తేదీ ఒక్కరోజు అంగన్వాడీలు సమ్మెలోకి వెళ్తారని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్బంధకాండను తీవ్రంగా ఖండించారు. సమ్మె రోజు ఆన్‌లైన్‌ కార్యక్రమాలు కూడా బంద్‌ చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ అంగన్వాడీల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారిపట్ల రాష్ట్ర సర్కారు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. వారేమీ గొంతెమ్మ కోరికలు కోరట్లేదనీ, కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాత్రమే కోరుతున్నారని చెప్పారు.

అంగన్వాడీల అరెస్టుకు సీపీఐ(ఎం) ఖండన.. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి : జాన్‌వెస్లీ
సమస్యలను పరిష్కరించాలంటూ చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి వచ్చిన అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారమే జిల్లాల్లో ఎక్కడికక్కడ వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారని విమర్శించారు. హైదరాబాద్‌లో జరిగిన ర్యాలీ సందర్భంగా వారిని అరెస్టు చేయడాన్ని ఖండించారు. న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వారితో చర్చించి పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కానీ అరెస్టు చేయడం సరైంది కాదని తెలిపారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని కోరారు.

అక్రమ అరెస్టు దుర్మార్గపు చర్య : ఎస్‌ఎఫ్‌ఐ
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ రజినీకాంత్‌, కార్యదర్శి టి నాగరాజు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి వస్తే సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చి ఇప్పుడు ఐసీడీఎస్‌ను, అంగన్‌వాడీలను మూసివేసే కుట్రలను కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్నదని విమర్శించారు. ప్రీప్రైమరీ పాఠశాలల ఏర్పాటు పేరుతో అంగన్వాడీలను ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. ఛలో హైదరాబాద్‌కు రాకుండా జిల్లాల్లో నిర్బంధం ప్రయోగించడంతోపాటు హైదరాబాద్‌కు వచ్చాక కూడా పోలీసులు తీవ్ర నిర్బంధం ప్రయోగించి అరెస్టు చేశారని విమర్శించారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -