మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఆరుద్రపై తపాళా బిళ్ల ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆరుద్ర గొప్ప కవి, రచయిత, పరిశోధకుడు, బహుముఖ ప్రజ్ఞావంతుడని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. ఆరుద్ర శతజయంతి సందర్భంగా తపాలా శాఖ విడుదల చేస్తున్న ప్రత్యేక తపాలా బిళ్లను హైదరాబాద్‌లోని ఒక హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆరుద్ర రచనలనూ జీవితాన్ని ప్రస్తావిస్తూ పలు రంగాల్లో ప్రతిభాపాటవాలుండటం అరుదైన విషయమని వెంకయ్యనాయుడు అన్నారు. ఆరుద్ర పాటలు సినిమా రంగానికి సాహిత్య విలువ పెంచాయని పేర్కొన్నారు. త్వమేవాహం కావ్యం అందరికీ కొరుకుడు పడకున్నా కూనలమ్మ పదాల వంటివి తేలిగ్గా ప్రాచుర్యంలోకి వచ్చాయని చెప్పారు.
ఆరుద్ర హేతువాది అనీ, యాంత్రికంగా జీవితం గడపకుండా జరిగే విషయాలను విమర్శనాత్మకంగా చూసి ఏది ఎందుకు జరిగేది అర్ధం చేసుకోవడమే హేతువాదమన్నారు. సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాల్లాగే ఆరుద్ర జీవితం కృషి కూడా సమగ్రమైనవని నివాళులర్పించారు. ఇద్దరు కలిపి రచనలు చేస్తే జంటకవులు అని అంటున్నట్టే ఆరుద్ర రామలక్ష్మి దంపతులను కవి జంట అనొచ్చని చమత్కరించారు. రాముడిమీద ఆయన పాటలు రోజూ వినిపిస్తుంటాయనీ, అయితే రాముడికి సీత ఏమవుతుంది? అంటూ ఆయన చేసిన రచన రామాయణంపై పరిశోధనకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రశంసించారు.
ప్రజాశక్తి ప్రచురణపై స్పందన
ఈ సందర్భంగా ప్రజాశక్తి పూర్వ సంపాదకులు తెలకపల్లి రవి శతజయంతి ప్రచురణగా తీసుకొచ్చిన ఆరుద్ర రచన ‘నా జీవితం కమ్యూనిజానికే అంకితం’ అతిధులకు అందజేశారు. వెంకయ్యనాయుడు ఆ పుస్తకాన్ని పరిచయం చేశారు. ఆయన కమ్యూనిజానికి అంకితం అంటే నేను నా జీవితమంతా కమ్యూనిజానికి వ్యతిరేకంగానే మాట్లాడాను. ఎవరు నమ్మింది వారికి నిజమని పిస్తుంది, అంతిమంగా నిలిచేదేదో కాలమే తేలుస్తుంది అని వ్యాఖ్యానించారు. తెలుగు భాషను సాహిత్యాన్ని కాపాడుకోవడానికి ఆరుద్ర జీవితం స్ఫూర్తినిస్తుందన్నారు. ఈ సందర్భం కోసం అమెరికా నుంచి వచ్చిన ఆరుద్ర కుమార్తె కవిత డి చింతామణి,, తమ ఇంట్లో ఎన్నెన్ని పుస్తకాలు వుండేవో తలిదండ్రులు తమను ఏదైనా చదువుకొమ్మంటూ ఎలా ప్రోత్సహించారో కవిత చెప్పారు. ఆమె కుమారుడు ప్రముఖ ఇంగ్లీషు రచయిత గౌతం చింతామణి, ఆరుద్రపై పరిశోధన చేసిన లగడపాటి సంగయ్య కూడా సభలో మాట్లాడారు. తపాలాశాఖ డైరెక్టర్ జనరల్ కూడా పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్టు డాక్టర్ దుర్గవడ్లమాని సభను నిర్వహించారు.



