Sunday, May 18, 2025
Homeజాతీయంకేంద్రం మార్గదర్శకాల మేరకే..

కేంద్రం మార్గదర్శకాల మేరకే..

- Advertisement -

– రాష్ట్రపతికి గడువు విధించడంపై సుప్రీంకోర్టు తీర్పులోనే వివరాలున్నాయి
– 201వ అధికరణ లక్ష్యాలు, ఉద్దేశాలకు అనుగుణంగానే తీర్పు
న్యూఢిల్లీ:
తమిళనాడు అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులకు ఆమోద ముద్ర వేయకుండా గవర్నర్‌, రాష్ట్రపతి తొక్కిపెట్టడంపై సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 8న సంచలనాత్మక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. గవర్నర్‌ పరిశీలనకు పంపిన బిల్లులను మూడు నెలల్లోగా రాష్ట్రపతి ఆమోదించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై రాష్ట్రపతి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతికే గడువు విధించవచ్చా? అంటూ సుప్రీంకోర్టుకు తాజాగా పలు ప్రశ్నల్ని సంధించారు. గతంలో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రపతికి కాలపరిమితి విధిస్తూ తీర్పు ఇచ్చిందని విదితమవుతుంది. 2016లో రాష్ట్రపతికి మూడు నెలల కాలపరిమితిని నిర్ణయిస్తూ జారీ చేసిన రెండు ఆఫీస్‌ మెమోరాండమ్‌ (ఓఎం)ల ద్వారా హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంహెచ్‌ఎ) జారీ చేసిన మార్గదర్శకాల మేరకే అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి మూడు నెలల్లోగా ఆమోదించా లనే గడువు విధిస్తూ ఏప్రిల్‌ 8న తీర్పు ఇచ్చినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. మార్గదర్శకాల్లో హోంశాఖ నిర్దేశించిన కాలపరిమితి సముచితమైనదని తాము భావించామని, గవర్నర్‌ పరిశీలన కోసం రిజర్వ్‌ చేయబడిన బిల్లులపై కూడా ఆ విధమైన మార్గదర్శకాలను పాటించాలని, రాష్ట్రపతి కూడా మూడు నెలల్లోగా బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించినట్లు సుప్రీంకోర్టు తీర్పులో జస్టిస్‌ జె.బి పార్దివాలా పేర్కొన్నారు. ఆర్టికల్‌ 201 కింద గవర్నర్లు రాష్ట్రపతికి చేసిన నివేదనలను సత్వరమే పరిష్కరించాలని గతంలో సర్కారియా, పూంచి కమిషన్లు చేసిన సిఫార్సులు కూడా పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాయి. స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ బిల్లులపై తుది నిర్ణయం తీసుకోవడంలో జరిగిన అనవసర జాప్యాన్ని ఫిబ్రవరి 4, 2016న జారీ చేసిన మొదటి ఆఫీస్‌ మెమోరాండమ్‌ హైలైట్‌ చేసింది. తీర్పు పేజీల్లో దీన్ని కూడా తిరిగి పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వాల నుండి అందిన తర్వాత బిల్లులను ఖరారు చేయడానికి గరిష్టంగా మూడు నెలల కాలపరిమితికి కట్టుబడి వుండాలని ఆఫీస్‌ మెమోరాండం (ఒఎం) పేర్కొంది. గవర్నర్‌ రాష్ట్రపతికి నివేదించిన తర్వాత జరగాల్సిన ప్రక్రియను పైన పేర్కొన్న మెమోరాండం సూచిస్తోందని, దీని ప్రకారమే రాష్ట్రపతికి బిల్లుల ఆమోదానికి కాలపరిమితి విధిస్తూ తీర్పును వెలువరించింది.
మొదటగా నోడల్‌ మంత్రిత్వ శాఖగా వ్యవహరించే కేంద్ర హోం శాఖ రాష్ట్ర బిల్లులో ఉన్న ముఖ్యమైన అంశాలను కేంద్రంలో తగిన మంత్రిత్వశాఖకు నివేదిస్తుందని వివరించింది. బిల్లులో ఉపయోగించిన భాష, బిల్లు రూపకల్పన లేదా రాజ్యాంగ చెల్లుబాటుకు సంబంధించిన అంశాలను కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు సూచిస్తారు. ఆయా అంశాలపై ఆయా మంత్రిత్వశాఖలు 15 రోజుల్లోగా కేంద్ర హోం మంత్రిత్వశాఖకు తిరిగి నివేదించాల్సి వుంటుంది. ఒకవేళ ఆలస్యం జరిగితే, సంబంధిత మంత్రిత్వశాఖ అందుకు కారణాలను కూడా తెలియజేయాల్సి వుంటుంది. గరిష్టంగా నెల రోజుల వ్యవధిలోగా ఇలా చేయడంలో విఫలమైతే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అర్ధం చేసుకోవాల్సి వుంటుంది. రాష్ట్రపతికి రిజర్వ్‌ చేసిన బిల్లులపై నిర్ణయం కోసం మూడు మాసాల కాలపరిమితి నిర్దేశించారని ఒఎంను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. అత్యవసర ప్రాతిపదికన ఆర్డినెన్స్‌ల పరిష్కారానికి మూడు వారాల గడువును నిర్దేశించారని జస్టిస్‌ పార్దివాలా ఆ తీర్పులో పేర్కొన్నారు. రాష్ట్ర బిల్లుకు సంబంధించి అభ్యంతరాలు ఏవైనా వుంటే వాటిని తదుపరి వివరణల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సి వుంటుందని ఫిబ్రవరి 4, 2016న జారీచేసిన రెండో ఆఫీస్‌ మెమోరాండం పేర్కొంటోంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వివరణలను కేంద్ర మంత్రిత్వశాఖ తెలుసుకోవాలన్నదే లక్ష్యమని సుప్రీం తీర్పు పేర్కొంది. అందుకు ఒకనెల కాలపరిమితి నిర్దేశించబడిందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ ఒక నెల కాలపరిమితికి సహకరించాల్సి వుంటుందని కోర్టు పేర్కొంది. అలా కాకుండా ఆలస్యం జరిగితే, ఈ విషయమై కేంద్రం నిర్ణయాన్ని వాయిదా వేసే పరిస్థితి వస్తుందని పేర్కొంది. వివిధ పక్షాలకు ఇలా కాల పరిమితులు విధించాలనే ఆలోచన అనైతికమైనదేమీ కాదు. లేదా 201 అధికరణ కింద పేర్కొన్న రాజ్యాంగ విధుల నిర్వహణకు సంబంధించి ప్రక్రియకు విరుద్ధమూ కాదు. ఈ రెండు ఆఫీస్‌ మెమోరాండాలు కూడా ఇదే భావనను మరింత స్పష్టం చేస్తున్నాయి. త్వరితంగా లేదా కచ్చితమైన కాలపరిమితితో కూడిన చర్య తీసుకోవాలన్నది 201వ అధికరణ లక్ష్యాలు, ఉద్దేశాలకు అనుగుణంగానే వుందని జస్టిస్‌ పార్దివాలా ఆ తీర్పులో వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -