Friday, March 27, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఉద్యోగాల కోసం అసెంబ్లీ ముట్టడి

ఉద్యోగాల కోసం అసెంబ్లీ ముట్టడి

- Advertisement -

ఉద్రిక్తంగా డీవైఎఫ్‌ఐ చలో అసెంబ్లీ
కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట
బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు
రాష్ట్ర అధ్యక్షులు కోటరమేశ్‌, మరొకరికి గాయాలు
జిల్లాల్లో నాయకుల ముందస్తు అరెస్టులు..
అక్రమ అరెస్టులు, పోలీసుల దాడులను ఖండిస్తూ నేడు నిరసనలకు పిలుపు
పోలీసుస్టేషన్లలో యువజన నాయకులను పరామర్శించిన సీపీఐ(ఎం) నేతలు


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలనీ, రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలనీ, నిరుద్యోగ భృతి ఇవ్వడంతో యూత్‌ డిక్లరేషన్‌ హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్‌ఐ), నిరుద్యోగ జేఏసీ గురువారం తలపెట్టిన చలో అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. ఎక్కడికక్కడ పోలీసులు ముందస్తు అరెస్టులు చేసినా..అడుగడుగునా నిర్బంధాలు విధించినా వాటిని చేధించుకుని మరీ పదుల సంఖ్యలో డీవైఎఫ్‌ఐ నాయకులు ఒక్కసారిగా అసెంబ్లీ గేటువైపు దూసుకెళ్లారు. ముందు వరుసలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటరమేశ్‌, ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్‌, ఉపాధ్యక్షులు జావెద్‌లు డీవైఎఫ్‌ఐ జెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ పరుగెత్తారు. ఇలా నిమిషం వ్యవధిలోనే అక్కడకు పదుల సంఖ్యలో వచ్చారు. దీంతో పోలీసులు అలర్ట్‌ అయ్యి ఒక్కొక్కరిని ఆరేడుమంది పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి వ్యాన్‌లో పడేశారు.

ఈ క్రమంలో డీవైఎఫ్‌ఐ నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర ప్రతిఘటన, తోపులాట జరిగింది. అందులో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటరమేశ్‌ నడుముకు వ్యాన్‌ సీకు గీరుకుపోయి రక్తం వచ్చింది. పోలీసులు బలవంతంగా లిఫ్టు చేసే క్రమంలో హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు రాజయ్య ముక్కుకు పోలీసుల గోర్లు గీక్కుని రక్తం కారింది. అరెస్టయిన వారిని అప్జల్‌గంజ్‌, నాంపల్లి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ జేఏసీ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో లైబ్రరీ నుంచి ఆర్ట్స్‌ కాలేజి వరకు ర్యాలీ నిర్వహించారు. అసెంబ్లీకి బయలుదేరి వెళ్తున్న నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ ఆర్‌ఎల్‌.మూర్తితో పాటు నాయకులను అరెస్టు చేసి ఓయూ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అసెంబ్లీ వద్ద అరెస్టయిన వారిలో కోట రమేశ్‌, ఆనగంటి వెంకటేశ్‌తోపాటు డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జావిద్‌, గడ్డం వెంకటేష్‌, మల్లం మహేష్‌, కృష్ణనాయక్‌, జగన్‌, రాష్ట్ర నాయకులు మధు, ప్రశాంత్‌, శ్రీనివాస్‌, భాను ప్రసాద్‌, వనం రాజు, చైతన్య, రాజయ్య, శ్రీను నాయక్‌ తదితరులున్నారు. అప్జల్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న నాయకులను సీపీఐ(ఎం) సీనియర్‌ నేత డీజీ నర్సింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌.శ్రీరాంనాయక్‌, పి.ఆశయ్య పరామర్శించారు.

నేడు, రేపు ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం, నిరనసలు : డీవైఎఫ్‌ఐ
పోలీసుల అక్రమ అరెస్టులను, దాడులను నిరసిస్తూ శుక్రవారం, శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్‌, ఆనగంటి వెంకటేశ్‌ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు జాబ్‌ క్యాలెండర్‌, నిరుద్యోగభృతి, యూత్‌ కమిషన్‌ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయకుండా రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైందని నిలదీశారు. రాష్ట్రంలో యువతకు స్వయం ఉపాధి రుణాల కోసం రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తామని చెప్పి సంవత్సరం గడుస్తున్నా అమలు చేయడం లేదన్నారు. తక్షణమే ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాపాలన అంటూ ముండ్ల కంచెలు, నిర్బంధాలు, ముందస్తు అరెస్టులేంటి? నిరసనలు తెలిపే హక్కు కూడా లేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

నిరుద్యోగ యువతపై లాఠీచార్జి దుర్మార్గం : డీవైఎఫ్‌ఐ నిరసనలకు సీపీఐ(ఎం) మద్దతు
రాష్ట్రంలోని నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారం కోసం, ఎన్నికల హామీల అమలు కోసం డీవైఎఫ్‌ఐ, నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమంపై పోలీసులు జరిపిన లాఠీచార్జి, అక్రమ అరెస్టులను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తీవ్రంగా ఖండించారు. డీవైఎఫ్‌ఐ రెండు రోజులపాటు తలపెట్టిన నిరసనలకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి, జాబ్‌ క్యాలెండర్‌ హామీలను ప్రశ్నిస్తే అరెస్టులేంటని ప్రశ్నించారు. తాజా బడ్జెట్‌లో నిరుద్యోగభృతి ప్రస్తావనే లేకపోవడం యువతను వంచించడమేనని విమర్శించారు. ప్రజాపాలన, స్వేచ్ఛగా ఎవరైనా నిరసనలు తెలుపుకోవచ్చు అంటూనే అర్ధరాత్రి ఇండ్ల మీద పడి అరెస్టులేంటి? నిరసన తెలిపే హక్కును కాలరాయడమేంటి? నిర్బంధాలేంటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా యువతకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -