నవతెలంగాణ – కాటారం
భూపాలపల్లి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కాటారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్, ఎంపీపీ ఎస్ పాఠశాలల్లో భరోసా టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భరోసా టీం సభ్యులు విద్యార్థినులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, పిల్లలపై జరుగుతున్న దుర్వినియోగం, పోక్సో చట్టం అంశాలపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ మరియు వీడియో కాల్స్‌కు స్పందించవద్దని, సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మహిళలు, విద్యార్థినుల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎవరు అనుచితంగా లేదా అసభ్యంగా ప్రవర్తించినా ధైర్యంగా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అవసరమైతే కౌన్సిలింగ్‌తో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.
అలాగే, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరం జరిగిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తించి, విద్యార్థులు చదువుపై దృష్టి సారించి బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భరోసా టీం సిబ్బంది పాల్గొన్నారు.



