వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా
నవతెలంగాణ-హైదరాబాద్ : డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణ వేదికగా జరుగనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు నిరంతర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అధికారులను ఆదేశించారు. యూత్ గేమ్స్ నిర్వహణ స్టేడియాల్లో వైద్య సేవల ఏర్పాట్లపై శుక్రవారం స్పోర్ట్స్ అథారిటీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. యూత్ గేమ్స్‌లో పోటీపడే క్రీడాకారులు, అధికారులు, సందర్శకుల ఆరోగ్య భద్రతకు స్పోర్ట్స్ అథారిటీ, వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో పని చేయాలని సూచించారు. పోటీల సమయంలో గ్రౌండ్‌లో వైద్య సేవలు అందించేందుకు 278 స్పెష్టలిస్ట్ వైద్య బృందాలను ఏర్పాటు చేయగా, తీవ్ర గాయాల సమయంలో రిఫరల్ సేవల కోసం 10 ప్రభుత్వ, 19 ప్రయివేటు హాస్పిటల్స్‌ను గుర్తించారు.
విద్యార్థులను భారీగా తరలించాలి : సీఎస్ సంజయ్ జాజు
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆరంభ వేడుకలకు ప్రభుత్వ, గురుకుల పాఠశాలల విద్యార్థులను భారీగా తరలించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. డిసెంబర్ 11న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆరంభ వేడుకలు ఎల్బీ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముఖ్య అతిథిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఆరంభ వేడుకలతో పాటు పోటీల సమయంలో సమీప ప్రభుత్వ, గురుకుల పాఠశాలల నుంచి విద్యార్థులను ఆర్‌టీసీ అధికారులతో సమన్వయంతో స్టేడియానికి తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.






కామెంట్‌లు (0)