నవతెలంగాణ – నాగోల్: హైదరాబాద్ నగరంలోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. భార్యను హత్య చేయాలనే ఉద్దేశ్యంతో భర్త గొంతు కోసిన ఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. తీవ్ర గాయాలతో బాధితురాలు సుప్రఖ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం .. 2024 ఆగస్టు 28న ఉప్పుటల్లి వెంకటేశ్వర్లు కుమారుడు వేణుగోపాల్‌తో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో 15 తులాల బంగారం, రూ.10 లక్షలు కట్నంగా ఇచ్చారని తెలిపింది. అయితే పెళ్లి తర్వాత భర్త మద్యపానానికి అలవాటు పడి, తరచూ గొడవలు పెట్టేవాడని, తన ఆభరణాలను అమ్మి డబ్బులు చేసుకున్నాడని బాధితురాలు వాపోయింది. మిగిలిన బంగారాన్ని తన తల్లివద్ద భద్రపరిచిన విషయం తెలిసిన భర్త, ఆ బంగారం తెప్పించాలని ఒత్తిడి చేస్తూ, తరచూ హింసించేవాడని చెప్పింది.
ఆదివారం ఉదయం బంధువుల గృహప్రవేశానికి వెళ్లాలని భార్య అడగగా.. కోపంతో ఊగిపోయిన వేణుగోపాల్, “నిన్ను చంపేస్తాను” అంటూ గొంతు పట్టుకొని వెనక్కి నెట్టాడు. తన జేబులో ఉన్న పేపర్ కటింగ్ బ్లేడ్‌తో భార్య గొంతు కోసాడు. అడ్డుకునే ప్రయత్నంలో ఆమె కుడిచేయి చిటికెన వేలు తెగిపోయింది. తీవ్ర రక్తస్రావంతో బాధితురాలు బయటికి పరుగెత్తి సహాయం కోసం అరిచింది. స్థానికులు వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన మహిళను సుప్రఖ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. భర్త వేణుగోపాల్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నాగోల్ పోలీసులు వెల్లడించారు.