Friday, March 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచర్చలంటూనే దాడులు

చర్చలంటూనే దాడులు

- Advertisement -

బట్టబయలైన ట్రంప్‌ కుట్ర
ఇరాన్‌ నేవీ చీఫ్‌ మృతి
హార్ముజ్‌ గుండా వెళ్లే నౌకలపై ఇరాన్‌ టోల్‌ ఫీజు ?
మిత్ర దేశాల నౌకలకు అనుమతి
సీరియస్‌గా ఆలోచించాలంటూ ట్రంప్‌ హెచ్చరికలు

చర్చల పేరుతో ఉద్రిక్తతలను తగ్గిస్తున్నామనే భావం కల్పిస్తూనే, అదే సమయంలో దాడులు కొనసాగించడం అమెరికా ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది. తాజా సైనిక దాడిలో ఇరాన్‌ నేవీ చీఫ్‌ మృతి చెందినట్టు సమాచారం వెలువడటంతో పరిస్థితి ఒక్కసారిగా పతాకస్థాయికి చేరినట్టయింది. ఒకవైపు చర్చలంటూనే మరోవైపు లక్ష్యబద్ధ దాడులకు తెగబడటం యాదృచ్ఛికం కాదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడమా ? లేక ప్రణాళికాబద్ధంగా పరిస్థితిని మరింత రగిలించడమే అసలు వ్యూహమా? అనే ప్రశ్నలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి.

టెహ్రాన్‌, వాషింగ్టన్‌ : ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని, ఐదు రోజులపాటు దాడులను వాయుదా వేస్తున్నామంటూ ట్రంప్‌ చేసిన ప్రకటన కుట్రపూరితమని తెలిపోయింది. ఆ ప్రకటన అనంతరం కూడా ఇరాన్‌పై దాడులు కొనసాగాయి. ఇజ్రాయిల్‌ జరిపిన దాడుల్లో గురువారం ఆ దేశ నేవీ చీఫ్‌ అలీరేజా మృతి చెందారు. ఇరాన్‌ సెంట్రల్‌ సిటీ ఇష్ఫాన్‌ సహా ఇరాన్‌ వ్యాప్తంగా విస్తృతంగా దాడులు జరిపినట్టు ఇజ్రాయిల్‌ మిలటరీ ప్రకటించింది. అనేక ప్రాంతాల్లో ఇరాన్‌ మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్టు మిలటరీ ప్రకటన వెలువడింది. మరోవైపు అంతర్జాతీయంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైనదిగా భావించే హార్ముజ్‌ జలసంధి మార్గంలో సాగే నౌకలకు టోల్‌ ఫీజు విధించే అంశంపై ఇరాన్‌ పార్లమెంట్‌ కసరత్తు చేస్తోంది.

ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌కి అత్యంత సన్నిహితమైన ది ఫార్స్‌, తస్నిమ్‌ వార్తా సంస్థలు ఈ మేరకు కథనాలు ఇచ్చాయి. ”ఇరాన్‌ సార్వభౌమాధికారాన్ని, నియంత్రణను, పర్యవేక్షణ ను అధికారికంగా ప్రకటించేందుకు ఒక ప్రణాళికను అనుసరించాలని ఇరాన్‌ పార్లమెంట్‌ భావిస్తోంది. అదే సమయంలో ఫీజు వసూలు చేయడం ద్వారా కొంతమేర ఆదాయం కూడా సృష్టించుకోవాలని యోచిస్తోంది.” అని పార్లమెంట్‌ సభ్యుడు మహ్మద్‌రెజా కౌచిని ఉటంకిస్తూ ఈ వార్తా సంస్థలు తెలిపాయి. ”ఇది చాలా సర్వసాధారణం, ఇతర కారిడార్ల గుండా సాగేటప్పుడు చెల్లించే రవాణా ఫీజు మాదిరిగానే ఇక్కడ కూడా చెల్లించాల్సి ఉంటుంది. హార్ముజ్‌ జలసంధి కూడా ఒక కారిడారే.” అని ఆ ఎంపీ వ్యాఖ్యానించారు. ఆ మార్గానికి భద్రతను మేం కల్పిస్తున్నపుడు నౌకలు, చమురు ట్యాంకర్లు అటువంటి ఫీజులు చెల్లించడం కూడా సాధారణమేనని ఆయన వ్యాఖ్యానించారు.

నేవీ చీఫ్‌ను చంపేశాం : ఇజ్రాయిల్‌
ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ నావికాదళ కమాండర్‌ అలీరెజా తంగ్సిరిని హత్య చేశామని ఇజ్రాయిల్‌ ప్రకటించింది. గతరాత్రి జరిగిన వైమానిక దాడుల్లో తంగ్సిరితో సహా ఇతర సీనియర్‌ నావికా కమాండర్లు మరణించినట్టు ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి ఇజ్రాయిల్‌ కట్జ్‌ తెలిపారు. కాగా ఈ వార్తను ఇరాన్‌ వెంటనే ధ్రువీకరించలేదు.

ఇరాన్‌కు డ్రోన్లు …వార్తలు అబద్ధం : రష్యా
ఇరాన్‌కు రష్యా డ్రోన్లు పంపుతోందంటూ వచ్చిన వార్తలను క్రెమ్లిన్‌ ఖండించింది. ఫైనాన్షియల్‌ టైమ్స్‌లో వచ్చిన ఆ వార్తలు అసత్యాలని పేర్కొంది. ”మీడియాలో అనేక అబద్ధాలు ప్రచారమవుతున్నాయి. వాటిపై దృష్టి పెట్టకండి.” అని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్‌ విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. టెహ్రాన్‌కు డ్రోన్లు పంపించే క్రమంలో రష్యా ఉందని, మార్చి నెలాఖరు నాటికి అది పూర్తవుతుందని పశ్చిమ దేశాల ఇంటెలిజెన్స్‌ అధికారులను ఉటంకిస్తూ ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది.

పరోక్ష చర్చలు జరుగుతున్నాయన్న పాక్‌
యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా, ఇరాన్‌ మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నాయని పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ డర్‌ ధృవీకరించారు. ఈ ‘శాంతి చర్చలు’ గురించి వస్తున్న వదంతులన్నీ అనవసరమైనవని ఆయన వ్యాఖ్యానించారు. పాక్‌ మధ్యవర్తిత్వంతో ఈ చర్చల ప్రక్రియ సాగుతోందని తెలిపారు. టర్కీ, ఈజిప్ట్‌ వంటి దేశాలు ఇందుకు మద్దతునిస్తున్నాయన్నారు.

చర్చల్లేవు.. అమెరికా ప్లాన్‌ను సమీక్షిస్తున్నామన్న ఇరాన్‌
అమెరికాతో చర్చలు లేదా సంప్రదింపులు జరగడం లేదని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరగ్చి స్పష్టం చేశారు. అయితే మధ్యవర్తుల ద్వారా పలు సందేశాల మార్పిడి జరుగుతోందన్నారు. ఇరాన్‌ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని మమ్మల్ని వేడుకుంటోందని ట్రంప్‌ ప్రచారం చేసుకుంటుండగా అరగ్చి వాటిని కొట్టేపారేశారు. అందుకు భిన్నంగా అమెరికా ప్రతిపాదనను సమీక్షిస్తున్నామని మాత్రమే చెప్పారు. ప్రస్తుతానికి చర్చలు జరిపే ఆలోచన లేదన్నారు. ‘మా వైఖరులను తెలియజేయడం లేదా అవసరమైన మేరకు హెచ్చరికలు జారీ చేసే సందేశాలే మధ్యవర్తుల ద్వారా సాగుతున్నాయని, వాటిని చర్చలు అని పిలవరాదని ప్రభుత్వ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు.

ఇజ్రాయిల్‌ అణు స్థావరాలపై ఇరాన్‌ దాడులు
ఇజ్రాయిల్‌ కమాండ్‌కు చెందిన సైనిక నియంత్రణ కేంద్రంపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేశామని ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) తెలిపింది. దానితో పాటు ఇజ్రాయిల్‌, జోర్డాన్‌ సరిహద్దులోని డెడ్‌ సీకి దక్షిణాన ఉన్న ఇజ్రాయిల్‌ అణు మౌలిక సదుపాయాలకు చెందిన పరిశ్రమలపై కూడా దాడి జరిగింది. ఇరాన్‌ వైపు నుంచి అనేక విడతలుగా క్షిపణి దాడులు జరిగాయని ఇజ్రాయిల్‌ సైన్యం తెలియజేసింది. సెంట్రల్‌ ఇజ్రాయిల్‌లోని కఫర్‌ ఖసింలో ఇరాన్‌ క్షిపణి పడి ఐదుగురు గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. దాడిలో అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. కాగా ఇరాన్‌ యుద్ధంలో చేరేందుకు హౌతీలు సిద్ధమయ్యారని ఇరాన్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. గల్ఫ్‌ దేశాలపై కూడా ఇరాన్‌ దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌ వైపు నుంచి దూసుకొస్తున్న క్షిపణులను అడ్డుకునేందుకు యూఏఈ, కువైట్‌ వంటి దేశాలు ఆపసోపాలు పడుతున్నాయి. క్షిపణులను అడ్డుకునే క్రమంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి.

భారత్‌ సహా ఐదు దేశాలకు అనుమతి
భారత్‌, చైనా, రష్యా సహా ఐదు మిత్ర దేశాల నౌకలకు హార్ముజ్‌ జలసంధిలో రవాణా సాగించేందుకు ఇరాన్‌ అనుమతి ఇచ్చింది. వాణిజ్యపరమైన రవాణాకు హార్ముజ్‌ను ఉపయోగించుకోవచ్చంటూ ఇరాన్‌ విదేశాంగ మంత్రి సయీద్‌ అబ్బాస్‌ అరగ్చి తెలిపారు. ‘మేం మిత్ర దేశాలుగా వేటినైతే భావిస్తున్నామో వాటికి మాత్రమే అనుమతినిచ్చాం. అందులో చైనా, రష్యా, భారత్‌, ఇరాక్‌, పాకిస్తాన్‌లు ఉన్నాయని ఆయన తెలిపారు. అదే సమయంలో ఇరాన్‌ శత్రు దేశాల నౌక ఒక్కటి కూడా ఈ మార్గం గుండా ముందుకు సాగలేదని ఇరాన్‌ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. ”ఇప్పుడు యుద్ధం జరుగుతోంది. ఇది యుద్ధ జోన్‌, అటువంటపుడు శత్రు దేశాలు, వాటి మిత్రుల నౌకలను పంపించే ప్రశ్నే లేదు. మిగిలిన వారికి అనుమతి వుంది.” అని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -