– నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
– మార్చి 5న హైదరాబాద్‌లో భారీ నిరసన : రజక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ
నవతెలంగాణ-ముషీరాబాద్
కుమ్మెర గ్రామంలో రజక, దళిత కుటుంబాలపై అమానుషంగా దాడి చేసి, పసిపాపను చంపిన వారిపౖౖె హత్య కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని రజక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. నిందితుల్లో కొందరిని పోలీసులు తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర వైస్ చైర్మెన్ ఎం.నరసింహ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కుమ్మెర గ్రామ ఘటనలో పెత్తందారులు, సర్పంచ్ తుకారాం రెడ్డి సహా మొత్తం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎనిమిది మంది నిందితుల్లో ముగ్గురినే పోలీసులు అరెస్టు చేసి, మిగతా వారిని కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిందితులకు మద్దతుగా వ్యవహరిస్తోందనే అనుమానం కలుగుతోందన్నారు. కేసును తప్పుదోవ పట్టించిన డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలను సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత దళిత కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయం, ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. రజక, దళితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మార్చి 5న హైదరాబాద్‌లోని లిబర్టీ చిన్న అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించాలని కమిటీ నిర్ణయించినట్టు చెప్పారు. ఈ నిరసనకు రజక సామాజిక, ప్రజా సంఘాల నేతలు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రజక అభివృద్ధి సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి జూపల్లి రాజశేఖర్, చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కొత్తకొండ శ్రీలక్ష్మి, రజక వృత్తిదారుల రాష్ట్ర అధ్యక్షులు ఎదునూరి మదారు, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రజక సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు, అక్కడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
‘కుమ్మెర’ కేసులో నిందితులను తప్పించే యత్నం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



